మొరాదాబాద్: పాకిస్తాన్ కు కీలక సమాచారాన్ని చేరవేస్తున్న మరో వ్యక్తిని అధికారులు అరెస్టు చేశారు. పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ కోసం పనిచేస్తున్నాడనే ఆరోపణలతో ఉత్తరప్రదేశ్ ఉగ్రవాద నిరోధక దళం (ఎటిఎస్) మొరాదాబాద్‌కు చెందిన అనుమానిత పాకిస్తానీ గూఢచారిని అరెస్టు చేసినట్లు సోమవారం అధికారులు తెలిపారు. రాంపూర్ జిల్లా నివాసి అయిన షెహజాద్‌ను శనివారం మొరాదాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. భారత్-పాకిస్తాన్ సరిహద్దు గుండా దుస్తులు, సుగంధ ద్రవ్యాలు, ఇతర వస్తువులను అక్రమ రవాణా చేయడం, స్మగ్లింగ్ ముసుగులో పాక్ ఐఎస్ఐ కోసం గూఢచర్య కార్యకలాపాలలో పాల్గొన్నాడని ఎటిఎస్ అధికారులు తెలిపారు.
పాకిస్తాన్ నిఘా సంస్థలకు గూఢచర్యం చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులపై దేశవ్యాప్తంగా దాడులు జరుగుతున్న సమయంలో షెహజాద్‌ను అరెస్టు చేశారు. ఈ దాడుల్లో ఇప్పటికే ఓ మహిళా యూట్యూబర్ తో సహా అనేక మంది అరెస్టు అయ్యారు.