పాతబస్తీలోని గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బిఆర్ఎస్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఫైరయ్యారు. అందాల పోటీల మీద పెట్టే ఖర్చు.. ప్రజల ప్రాణాలు కాపాడడానికి కూడా పెట్టాలని.. హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి ఘటనా స్థలానికి వచ్చి బాధితులను పరామర్శించాలని డిమాండ్ చేశారు. పాతబస్తీలో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 17మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో సోమవారం అగ్ని ప్రమాద ప్రదేశానికి వెళ్లి కెటిఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా బాధితులను ఓదార్చారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ కుటుంబంలో జరిగిన విషాద ఘటన ఇంకొకరికి జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఇంత పెద్ద అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అంబులెన్స్‌లో ఆక్సిజన్ మాస్క్ లేకుండా, ఫైర్ ఇంజన్‌లో నీళ్ళు లేకుండా ఘటనా స్థలానికి రావడం వల్లనే మా కుటుంబ సభ్యులను కోల్పోయాం అని బాధితులు చెప్తున్నారని అన్నారు. పాతబస్తీలోని గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు కాదు.. రూ.25 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. కాగా, ఈ ప్రమాదంపై స్పందించిన ప్రభుత్వం.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి ప్రకటించారు.