హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్)కు ఊహించని షాక్ తగిలింది. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ కీలక నేత, నాగర్‌కర్నూల్ జిల్లా బిఆర్‌ఎస్ ప్రెసిడెంట్ గువ్వల బాలరాజు (Guvvala Balaraju) తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామ లేఖను బిఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ సిఎం కెసిఆర్‌కు ఆయన పంపించారు. అయితే ఆయన రాజీనామకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతానికైతే పార్టీతో ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
గువ్వల బాలరాజు (Guvvala Balaraju) 2014 నుంచి 2023 వరకూ రెండుసార్లు బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే మూడోసారి మాత్రం ఆయనకు ఓటమి తప్పలేదు. అప్పటి నుంచి ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఆయన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో సమావేశం అయ్యారు. నేడు బిఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. దీంతో బాలరాజు త్వరలోనే బిజెపిలో చేరుతారని.. అంతేకాక.. ఆయనతో పాటు మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా బిఆర్‌ఎస్‌కి రాజీనామా చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.