ఆన్లైన్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు అర్జించవచ్చని ఆశ కల్పించి రూ. 4.87 కోట్ల రూపాయలను కాజేసిన ఘటనలో టిజిసిఎస్బి (తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో) నలుగురిని అరెస్ట్ చేసింది. దీనికి సంబధించిన వివరాలు టిజిసిఎస్బి డైరెక్టర్ శిఖాగోయొల్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. రంగారెడ్డి జిల్లా హస్తినాపురంకు చెందిన ఒక వ్యక్తి వాట్సప్ ద్వారా పెట్టుబడి పెడితే అధికంగా లాభాలు అర్జించవచ్చని వచ్చిన మెసెజ్‌తో రెండు నెలల్లో రూ. 4.87 కోట్లు పెట్టుబడి పెట్టారన్నారు. ఈ క్రమంలో ఉగ్ర నరసింహులు అనే నింధితుడు రిటానా ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఒక కరంట్ ఖాతా తెరిచాడు. ఫిర్యాదు దారుడు పంపిన డబ్బులో కొంత మొత్తం ఈ ఖాతాలోకి వెళ్లినట్టు గుర్తించామన్నారు. ఆ తరువాత ఒక ట్రేడింగ్‌కు సంబధించిన వాట్సాప్ గ్రూప్‌లో చేర్చి,
అధిక లాభాలు వస్తాయని బాధితుడి చేత మరికొంత పెట్టుబడి పెట్టే విధంగా నింధితులు ప్రలోభ పెట్టారన్నారు. ఈ మొత్తాన్ని మోసగాళ్లు అందించిన కరంట్ ఖాతాలకు బాధితుడు దఫాలవారీగా బదిలీ చేశారని ఆమె చెప్పారు. లాభాలను చూపించడానికి దరఖాస్తును తారుమారు చేయడం, వివిధ రకాల సాకులతో బాధితుడి వద్ద నుంచి నేరగాళ్లు అదనంగా నగదు వసూలు చేశారన్నారు. ఈ క్రమంలో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైంకు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సైబర్ క్రైం పోలీసులు మహ్మద్ మోహినుద్దీన్, చిన్నం ఉగ్రనరసింహులు, పసుపులేటి రాజేష్, శివారెడ్డి అనే నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఆమె వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి పది సెల్ఫోన్లు, పది బ్యాంకు పాస్ బుక్స్, రెండు చెక్ బుక్స్, పది డెబిట్, క్రెడిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
కమిషన్ ఇస్తామని నమ్మించి
ఖాతా ఇస్తే కమిషన్ ఇస్తానని నమ్మించి నిందితులు ఖాతాలు సేకరిస్తున్నట్లు టిజిసిఎస్బి డైరెక్టర్ శిఖా గోయొల్ తెలిపారు. ప్రతి కరెంట్ ఖాతాకు లక్ష రూపాయల కమిషన్ ఇస్తానని శివారెడ్డి అనే నింధితుడి పోద్బలంతో ఉగ్ర నర్సింహులు బ్యాంకులో కరంట్ ఖాతాలు తెరిచి వాటి వివరాలు, నెట్ బ్యాకింగ్ సమాచారం మెయినుద్దీన్‌కు అందించేవాడని ఆమె పేర్కొన్నారు. ఈ విషయాల్లో మెయినుద్దీన్‌కు రాజేష్ సహాయకుడిగా పనిచేశాడని తెలిపారు. మెహినుద్దీన్ ఇండోర్‌లో ఉన్న ఒక సైబర్ నేరస్తుడికి ఖాతా వివరాలు, సిమ్ కార్డులు అందచేశారని ఆమె చెప్పారు.
సదరు సిమ్ కార్డులు, ఖాతాలను ఉపయోగించి మోసగాళ్లు 48 గంటల్లో లావాదేవీలు పూర్తి చేయడ, తర్వాత సిమ్ కార్డులు, తిరిగి ఖాతాదార్లకు అందచేయడం జరుగుతుందని ఆమె చెప్పారు. ఈ ప్రక్రియలో ఒక్కో ఖాతాకు లక్షల రూపాయలు మెయినుద్దీన్ కి రావడం వాటిలో 50శాతం ఖాతాదార్లకు అందించేవారని ఆమె వివరించారు. అనుమతి లేని, నకిలీ ట్రేడింగ్ ప్లాట్ ఫారమ్‌లలో పెట్టుబడులను పెట్టవద్దని ఆమె సూచించారు. సొంత బ్యాంక్ ఖాతాలను ఎవరికీ ఇవ్వద్దని, ఖాతాను అక్రమ కార్యకలాపాలకు ఉపయోగిస్తే, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
Also Read: శబరిమలలో బంగారం మాయం