రాష్ట్రంలో ఎరువుల సరఫరా బాధ్యత మహిళా సంఘాలకే అప్పగించే యోచనలో ప్రభుత్వం ఉందని మంత్రి సీతక్క తెలిపారు. కరీంనగర్ జిల్లా, తిమ్మాపూర్ మండలం, ఎల్‌ఎండి కాలనీలోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ మహిళా, శిశు వికాస కేంద్రం (మహిళా ప్రాంగణం)లో బ్యూటీషియన్, టైలరింగ్, జ్యూట్ బ్యాగ్, ఆటో డ్రైవింగ్‌లో శిక్షణ పూర్తి చేసిన మహిళలకు సర్టిఫికెట్ల ప్రదానం, పోషణ మాస ఉత్సవం, బతుకమ్మ ఉత్సవాలకు మంత్రి పొన్నం ప్రభాకర్, మానకొండూరు ఎంఎల్‌ఎ కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. గత ప్రభుత్వ పాలనలో శిథిలావస్థకు చేరిన మహిళా ప్రాంగణాలు ప్రస్తుతం మహిళలకు స్వయం ఉపాధి రంగాల్లో శిక్షణ ఇస్తూ కళకళలాడుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంకల్పించారని అన్నారు. ఇందులో భాగంగా మహిళల స్వయం ఉపాధి కోసం ఇప్పటికే రూ.27 వేల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణం అందజేశామని తెలిపారు. శిధిలావస్థకు చేరిన రాష్ట్రంలోని పది మహిళా ప్రాంగణాలను
మళ్లీ శిక్షణకు సిద్ధం చేసి రూ.10 కోట్లు కేటాయించామని అన్నారు. ప్రభుత్వ సహకారంతో మహిళా సంఘాల సభ్యులు విజయవంతంగా పలు వ్యాపారాలు నిర్వహిస్తూ ఆర్థికంగా ఎదుగుతున్నారని అన్నారు. ప్రతి మహిళా సంఘంలో చేరి ప్రభుత్వం అందించే ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తూ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న కలెక్టర్, పోలీస్ కమిషనర్‌ను మంత్రి అభినందించారు. అభివృద్ధికి సలహా లు ఇవ్వాలని సూచించారు.మహిళలు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందాలిః మహిళా కోపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ బండ్రు శోభారాణి మహిళా ప్రాంగణాల ద్వారా ఒకే తరహా శిక్షణలు కాకుండా మహిళలు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో విభిన్న రంగాల్లో శిక్షణ ఇస్తున్నామని రాష్ట్ర మహిళా కోపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ బండ్రు శోభారాణి అన్నారు. ప్రాంగణాల శిక్షణ ద్వారా ఎక్కువ మంది మహిళలు స్వయం ఉపాధి సాధించడమే లక్ష్యమని తెలిపారు
.మహిళలు ఉన్నతంగా ముందుకుః మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద
ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, కార్యక్రమాల ద్వారా మహిళలు ఉన్నతంగా ముందుకు వెళుతున్నారని మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నేరెళ్ల శారద అన్నారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలను పూర్తిగా నివారించాలని అన్నారు. తెలంగాణను జీరో క్రైమ్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని సూచించారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. ప్రతి మహిళ స్వయంసమృ ద్ధి సాధించాలని అన్నారు. జిల్లా యంత్రాంగం అందిస్తున్న వివిధ శిక్షణలను సద్వినియోగం చేసుకొని ఆర్థిక సాధికారత సాధించాలని సూచించారు. మానకొండూరు శాసనసభ్యుడు కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.. మహిళలను కోటీశ్వరులు చేయాలన్న ముఖ్యమంత్రి ఉసంకల్పంతో ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, ఆర్‌డిఒ మహేశ్వర్, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, ప్రాంగణం మేనేజర్ సుధారాణి తదితరులు పాల్గొన్నారు.