‘అయ్యా మాకు అన్యాయం చేయకండి’ అంటూ పెద్దపల్లి జిల్లా, మంథని మండలం, పుట్టపాక భూ నిర్వాసితుల ఆందోళన పలువురిని కంటతడి పెట్టించింది. నష్టపరిహారం ఇవ్వకుండా పనులు చేయడమేంటని ఓ భూ నిర్వాసితుడు నేషనల్ హైవే నిర్మాణ పనులను అడ్డుకున్న సంఘటన గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..మండలంలోని పుట్టపాక గ్రామానికి చెందిన ఇసంపల్లి రాధమ్మ అనే వృద్ధురాలి పేరు మీద ఉన్న 16 గుంటల భూమికి అధికారులు అవార్డు పాస్ చేయకుండా.. నష్టపరిహారం ఇవ్వకుండానే బుధవారం ఉదయం ఆ భూమిలో ఉన్న పత్తిపంటను జెసిబి సహాయంతో తొలగించేందుకు సిద్ధపడ్డారు. ఈ విషయాన్ని గమనించిన ఆమె కుమారుడు ఇసంపల్లి చంద్రమూర్తి అధికారుల వద్దకు వెళ్లి తమకు పరిహారం ఇవ్వకుండా ఎలా భూములు స్వాధీనం చేసుకుంటారని
ప్రశ్నించినప్పటికీ వారు వినకపోవడంతో చేసేదేమీ లేక బురదను సైతం లెక్కచేయకుండా జెసిబికి అడ్డుగా పడుకొని ఆందోళన వ్యక్తం చేశాడు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు అతనిని బలవంతంగా పక్కకు లాగడంతో ఆయన కుటుంబ సభ్యులను ఒక గదిలో ఉంచారు. గ్రామస్థులు సైతం అడ్డుచెప్పినా కూడా అధికారులు వినకుండా వారిపని వారు చేసుకుంటూ వెళ్లారు. అనంతరం చంద్రమూర్తిని, ఆయన భార్య సువర్ణ, తల్లి రాధమ్మతోపాటు ఇద్దరు పిల్లలను ఆర్‌డిఒ కార్యాలయానికి తీసుకువచ్చారు. అనంతరం ఆ కార్యాలయానికి కలెక్టర్ కోయ శ్రీహర్ష, గోదావరిఖని ఎసిపి మడత రమేష్ చేరుకున్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులతో కలెక్టర్ ప్రత్యేకంగా మాట్లాడారు. నిబంధనల మేరకు పరిహారం అందిస్తామని సూచించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
పూర్తిస్థాయిలో పరిహారం ఇవ్వకుండా పనులు చేయడమేంటి..
నేషనల్ హైవే నిర్మాణం కోసం తాము తమ భూములను కోల్పోతున్నామని, తమకు పూర్తిస్థౠయిలో నష్టపరిహారం ఇవ్వకుండా పనులు చేయడమేంటని పుట్టపాక గ్రామానికి చెందిన భూ నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్‌డిఒ కార్యాలయం ముందు వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమతో సంతకం చేయించుకునే వరకు అధికారులు తమతో ఎంతో ప్రేమగా మెదిలారని, మొదటి విడత పరిహారం ఇచ్చిన తర్వాత తమను పట్టించుకునేవారే కరువయ్యారని వాపోయారు. పరిహారం గురించి అధికారులను అడిగితే పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని ఆవవేదన వ్యక్తం చేశారు. తమకు పూర్తిస్థాయిలో పరిహారం ఇచ్చిన తర్వాత అధికారులు పనులు నిర్వహించుకోవాలని డిమాండ్ చేశారు.
ALso Read: ‘గ్లోబల్ హెల్త్ కేర్ హబ్’ గా హైదరాబాద్