Thursday, October 24, 2024

వైద్య విద్యలో నవశకం

- Advertisement -
- Advertisement -
ఒకేసారి 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభం

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ వైద్యవిద్యా రంగంలో నవశకం మొదలైందని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. 9 వైద్య కళాశాలలు ప్రారంభించడం శుభపరిణామం అని పేర్కొన్నారు. కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగాం జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో ఎంబిబిఎస్ తరగతులను శుక్రవారం ము ఖ్యమంత్రి కెసిఆర్ ప్రగతి భవన్ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు పలువురు ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, ఎంపిలు, వైద్యారోగ్య శా ఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ, ప్రజారోగ్యాన్ని పరిరక్షిస్తూ వైద్యాన్ని పే దలకు అతి చేరువలోకి తెస్తూ, తెలంగాణ రాష్ట్రం ప్రతియేటా 10వేల మంది వైద్యులను తయారుచేసే స్థాయికి చేరుకుని భార త దేశ వైద్య రంగ చరిత్రలోనే విప్లవాన్ని సృష్టిస్తున్నదనీ, దేశానికే ఆదర్శంగా రాష్ట్ర వైద్యరంగం పురోగమించడం తెలంగాణ కు గర్వకారణమని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఉజ్వలమైన దినం అని పేర్కొన్నారు. ఒకే సారి 9 మెడికల్ కాలేజీలు ప్రారంభించుకోవడం.. సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ ఘట్టం అని వ్యాఖ్యానించారు. ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటుం టాం… కానీ ఈ కార్యక్రమం చాలా ఆత్మసంతృప్తి కలిగే గొప్ప సన్నివేశమని అన్నారు. పరిపాలన చేతకాదు అని ఎగతాళి చేసిన పరిస్థితులను చూశాం… అటువంటి తెలంగాణలో ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకుంటున్నామని చెప్పారు. గతంలో ఐదు మెడికల్ కాలేజీలు ఉంటే.. ఇవాళ ఆ సంఖ్య 26కు చేరిందని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరానికి 8 కాలేజీలు నూతనంగా ప్రాంరంభం కాబోతున్నామని, వీటికి కేబినెట్ ఆమోదం కూడా లభించిందని సిఎం తెలిపారు.
ఏడాదికి 10వేల మంది డాక్టర్లను ఉత్పత్తి చేయబోతున్నాం..
2014లో 2,850 మెడికల్ సీట్లు ఉంటే 2023 నాటికి 8,515 మెడికల్ సీట్లు ఉన్నాయని సిఎం కెసిఆర్ ఆర్ తెలిపారు. ఈ సందర్భంగా వైద్యశాఖ మంత్రిని, కార్యదర్శిని సిఎం అభినందించారు. 85 శాతం మెడికల్ సీట్లు తెలంగాణ బిడ్డలకే దక్కాలని పటిష్టంగా పోరాటం చేసి హైకోర్టులో విజయం సాధించామని, అది గొప్ప విజయమని వ్యాఖ్యానించారు. ప్రైవేటు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ద్వారా తెలంగాణలో సంవత్సరానికి 10 వేల మంది డాక్టర్లను ఉత్పత్తి చేయబోతున్నామని, ఇది రాష్ట్రానికి, దేశానికి కూడా మంచిదని పేర్కొన్నారు.దేశంలో వైద్య విప్లవం సాధించామని వ్యాఖ్యానించారు. భవిష్యత్‌లో వైద్య విద్యార్థులకు అండగా ఉంటాం అని కెసిఆర్ స్పష్టం చేశారు. వైద్య వృత్తి ఎంతో పవిత్రమైన వృత్తి అని, వైద్యులు చేసే పనులు మిగతా వాళ్లు చేయలేరని పేర్కొన్నారు. ఐఎఎస్‌లు, ఇంకా ఎవరైనా వైద్యులు చేసే పనులు చేయలేరని, ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే వైద్యుల వద్దకు వెళ్లాల్సిందే అని అన్నారు. వైద్యవిద్యలో ప్రవేశాలు పొందిన విద్యార్థులు వైద్యరంగంలో ఉన్నత స్థాయికి ఎదగాలని సిఎం ఆకాంక్షించారు.
తెల్ల రక్త కణాల మాదిరిగానే తెల్ల కోటు డాక్టర్లు
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే, రోగ నిరోధక శక్తి ఉండాలని సిఎం అన్నారు. శరీరంలో తెల్ల రక్త కణాలు ఏ విధంగా పని చేస్తాయో.. తెలంగాణ ఉత్పత్తి చేయబోయే తెల్ల కోటు డాక్టర్లు రాష్ట్రానికే కాదు.. దేశ ఆరోగ్య వ్యవస్థను కూడా కాపాడుతారని కెసిఆర్ వివరించారు. ఇందులో ఎవరికి ఎలాంటి సందేహం లేదని పేర్కొన్నారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని, విద్యుత్ రంగంతో పాటు సాగు, తాగునీటి రంగంలో అద్భుతాలు సాధించామని చెప్పారు. దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగామని పేర్కొన్నారు. గంజి కేంద్రాలతో విలసిల్లిన పాలమూరు జిల్లాలో ఇప్పుడు వ్యవసాయం పరుగులు పెట్టిందని తెలిపారు. పాలమూరు ప్రాజెక్టు ప్రారంభించుకోబోతున్నామని, ఒక్క కాలేజీ లేని పాలమూరులో ఐదు మెడికల్ కాలేజీలు వచ్చాయని, ఇది గొప్ప విజయమని అన్నారు. నల్లగొండలో మూడు కాలేజీలు వచ్చాయని, మారుమూల జిల్లాలైన ఆసిఫాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాలు.. అలా అడవి బిడ్డలు నివసించే ప్రాంతాల్లో కూడా మెడికల్ కాలేజీలు స్థాపించుకొని అద్భుతాలు సృష్టించబోతున్నామని కెసిఆర్ తెలిపారు.
50 వేల పడకలకు చేరుకోబోతున్నాం..
ఒక దేశం కావొచ్చు.. రాష్ట్రం కావొచ్చు.. ఎక్కడైతే వైద్యారోగ్య వ్యవస్థ పటిష్టంగా ఉంటుందో.. అక్కడ తక్కువ మరణాలు, నష్టాలు సంభవిస్తాయని సిఎం కెసిఆర్ తెలిపారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మెడికల్ కాలేజీలతో పాటు అద్భుతమైన ఆస్పత్రులను కూడా తీసుకువస్తున్నామని చెప్పారు. వందలాది పడకలతో వైద్య సౌకర్యాలు వస్తాయని తెలిపారు.తెలంగాణ వైద్యారోగ్య శాఖ చాలా విజయాలు సాధించిందని అన్నారు. దేశంలో ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబిబిఎస్ సీట్లు ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని, ఇది మనం సాధించిన ఘనత అని వ్యాఖ్యానించారు. రాష్ట్రం ఏర్పడే నాటికి 17 వేల పడకలు ఉంటే.. ఇప్పుడు 34 వేల పడకలకు చేరుకున్నామని చెప్పారు. మరో 6 హాస్పిటల్స్ నిర్మాణంలో ఉన్నాయని, వరంగల్‌లో అద్భుతమైన హాస్పిటల్ నిర్మాణం జరుగుతోందని తెలిపారు. హైదరాబాద్‌కు నలువైపులా టిమ్స్ నిర్మిస్తున్నామని అన్నారు. గచ్చిబౌలి, ఎల్‌బీ నగర్, అల్వాల్, ఎర్రగడ్డలో వెయ్యి పడకల చొప్పున ఆసుపత్రులు నిర్మిస్తున్నామని, నిమ్స్‌ను మరో 2 వేల పడకలతో విస్తరిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో ఆస్పత్రుల్లో పడకల సంఖ్య 50 వేలకు చేరుకోబోతోందని వెల్లడించారు.
500 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి..
కరోనా సమయంలో ఆక్సిజన్ చాలా అవసరం ఉండేదని, దానిని గుణపాఠంగా తీసుకొని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి నేతృత్వంలో 500 టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసుకుంటున్నామని కెసిఆర్ తెలిపారు. ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు మౌలిక సదుపాయాలు కల్పించుకున్నామని చెప్పారు. 50 వేల పడకలను ఆక్సిజన్ బెడ్స్‌గా తీర్చిదిద్దుకుంటున్నామన్నారు. 10 వేల సూపర్ స్పెషాలిటీ బెడ్స్ కూడా అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. పారా మెడికల్ సిబ్బందికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉందని, మెడికల్ కాలేజీలకు అనుబంధంగా.. ప్రతి జిల్లాలో నర్సింగ్ కాలేజీలు, పారా మెడికల్ కోర్సులు పెట్టేలా చర్యలు తీసుకుంటున్నారని సిఎం తెలిపారు.
వేజ్ లాస్‌ను భర్తీ చేయడమే కెసిఆర్ కిట్ వెనుకాల ఉన్న ఫిలాసఫీ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కెసిఆర్ కిట్‌పై సిఎం కెసిఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ కిట్ అంటే నాలుగు సబ్బులు.. మూడు వస్తువులు కాదు అని స్పష్టం చేశారు. గర్భిణీ మహిళలు వేతనం నష్టపోకుండా(వేజ్ లాస్)ను భర్తీ చేయడమే కెసీఆర్ కిట్ వెనుకాల ఉన్న ఫిలాసఫీ అని కెసిఆర్ వివరించారు. నీతి ఆయోగ్ ఇచ్చే హెల్త్ డిపార్ట్‌మెంట్ ఇండికేటర్స్‌లో 2014లో మన ర్యాంకు 11వ స్థానంలో ఉండేదని, ఇప్పుడు దేశంలో 3వ స్థానానికి ఎదిగామని తెలిపారు. ఒకప్పుడు పేద ప్రజలు ప్రసూతి సందర్భం వస్తే చాలా బాధలు పడేవారని, ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీతో, అనవసరమైన ఆపరేషన్లు చేసేవారని అన్నారు. దీనిని సమాజం నుంచి ఎలా బయటపడేయాలనే ఆలోచనతో చాలా పెద్ద ఎత్తున ఒక ప్రణాళిక బద్దంగా కెసిఆర్ కిట్ ప్రారంభించుకున్నామని చెప్పారు. నిరుపేద మహిళలు గర్భం దాల్చిన తర్వాత కూడా కూలీ పనులు చేస్తుంటారు…అది తల్లి ఆరోగ్యానికి కానీ, శిశువు ఆరోగ్యానికి కానీ మంచిది కాదని, దాన్ని నివారించేందుకు, వారు కూలీకి వెళ్లే డబ్బులను భర్తీ చేసేందుకు మానవీయ కోణంలో తీసుకొచ్చిందే కెసిఆర్ కిట్ అని స్పష్టం చేశారు. అమ్మ ఒడి వాహనాల ద్వారా గర్భిణిలను ఆస్పత్రులకు తీసుకొచ్చి చికిత్స చేయిస్తున్నామని… డెలివరీ తర్వాత తల్లీబిడ్డలను వారిని ఇంటికి తరలిస్తున్నామని చెప్పారు. ఇలాంటి సౌకర్యం భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదని అన్నారు. ఈ పథకాల వల్ల అద్భుతమైన ఫలితాలు వచ్చాయని, ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ నుంచి ప్రజలు రక్షించబడ్డారని వివరించారు.
న్యూట్రిషన్ కిట్ ద్వారా మంచి పోషాకాహారం అందిస్తున్నాం
కెసిఆర్ కిట్‌తో పాటు న్యూట్రిషన్ కిట్ ప్రవేశపెట్టామని సిఎం కెసిఆర్ చెప్పారు. న్యూట్రిషన్ కిట్ ద్వారా మంచి పోషాకాహారం అందిస్తున్నాంమని తెలిపారు. ఆరోగ్యకరమైన సమాజం తయారు కావాలన్నదే ప్రధాన లక్ష్యమని కెసిఆర్ స్పష్టం చేశారు.ఒక్క జనరేషన్ దెబ్బతింటే కోలుకోవడానికి 75 సంవత్సరాలు పడుతుంది అని సిఎం తెలిపారు. ఈ సమస్యను అధిగమించాలంటే గర్భంలో పెరిగే శిశువు బాగుండాలని, అందుకు న్యూట్రిషన్ కిట్ అందిస్తున్నామని చెప్పారు. దీంతో భవిష్యతు తరాలు బాగుంటాయని అన్నారు. కెసిఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, అమ్మ ఒడి పథకాల ద్వారా ప్రభుత్వ ఆస్పత్రలుల్లో 76 శాతం ప్రసవాలు జరుగుతున్నాయని వివరించారు. మాతా,శిశు మరణాలను నివారించామని చెప్పారు. 2014లో (ఎంఎంఆర్) తల్లులు 92 మంది చనిపోతే ఇవాళ 43కు తగ్గించామని, అలాగే శిశు మరణాలను 21కి తగ్గించామని తెలిపారు. ఒకప్పుడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో 30 శాతం ప్రసవాలు జరిగితే.. ఇప్పుడు 76 శాతానికి పెంచామని పేర్కొన్నారు.
ఇది సిఎం కెసిఆర్ పట్టుదలకు నిదర్శనం : మంత్రి హరీశ్‌రావు
ఒక రాష్ట్రం ఒకేసారి 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించడం దేశ వైద్య రంగ చరిత్రలోనే మొదటిసారి.. ఇది సిఎం కెసిఆర్ పట్టుదలకు నిదర్శనం అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు.ఈరోజు రాష్ట్ర చరిత్రలో సుదినం అని పేర్కొన్నారు. రాష్ట్రంలో పేదలకు విద్య, వైద్యం అందుబాటులోకి రావాలని సిఎం కెసిఆర్ మార్గనిర్దేశంలో ఇంత గొప్ప విజయాన్ని సాధించామని చెప్పారు. గత సంవత్సరం 8 కాలేజీలు ప్రారంభించి తెలంగాణ కొత్త రికార్డు సృష్టించిందని, ఈ సంవత్సరం మన రికార్డును మనమే అధిగమించామని పేర్కొన్నారు. ఈ ఏడాది దేశ వ్యాప్తంగా ప్రభుత్వ రంగంలో అందుబాటులోకి వచ్చిన ఎంబిబిఎస్ సీట్లలో తెలంగాణ వాటా 43 శాతం అని, ఇది గొప్ప రికార్డు అని తెలిపారు. దేశంలోని మిగితా 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి 57 శాతం సీట్లు మాత్రమే అందుబాటులోకి తెచ్చాయని తెలిపారు.
తెలంగాణ దేశానికే దిక్సూచిగా నిలిచింది..
మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, 24 గంటల విద్యుత్తు సరఫరా, జిల్లాకో మెడికల్ కాలేజీ, రైతుబంధు వంటి కార్యక్రమాలతో మన రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలిచిందని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఒకప్పుడు బెంగాల్ ఆలోచిస్తుంది.. దేశం అచరిస్తుంది అనే నానుడి ఉండేదని, దాన్ని తిరగరాసిన ఘనత సిఎం కెసిఆర్‌ది అని పేర్కొన్నారు. ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ అని సిఎం కెసిఆర్ సంకల్పిస్తే.. దేశం మొత్తం అదే దారిలో నడుస్తున్నదని చెప్పారు. ఇప్పుడు తెలంగాణ అచరిస్తుంది.. దేశం అనుసరిస్తుంది అన్నంత గొప్పగా రాష్ట్రాన్ని సిఎం కెసిఆర్ ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించుకోవడమే కాదు.. సాధించుకున్న రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత సిఎం కెసిఆర్‌ది అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు పొందిన వైద్య విద్యార్థులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఇంత గొప్ప పవిత్ర యజ్ఞంలో తనకూ భాగస్వామ్యం కల్పించినందుకు సిఎం కెసిఆర్‌కు మంత్రి హరీశ్‌రావు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. తొలుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ప్రారంభ ప్రసంగంతో సమావేశం ప్రారంభం కాగా, అనంతరం వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రసంగించారు. సిఎం కెసిఆర్ సందేశంతో సమావేశం ముగిసింది. ఈ కార్యక్రమంలో సిఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్‌ఎఎం రిజ్వీ, వైద్య విద్య సంచాలకులు డాక్టర్ రమేశ్ రెడ్డి, వైద్యశాఖ సిఎం ఒఎస్‌డి డాక్టర్ గంగాధర్, కాళోజీ హెల్త్ యూనివర్శిటీ వైఎస్ ఛాన్స్‌లర్ కరుణాకర్ రెడ్డి,టిఎస్‌ఎంఐడిసి ఎండి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు ఎంపిలు దామెదర్ రావు, రాములు,కవిత, బడుగుల లింగయ్య యాదవ్, ఎంఎల్‌సిలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మధునూధనాచారి, శేరి సుభాష్ రెడ్డి, ఫారుఖ్ హుస్సేన్, ఎంఎల్‌ఎలు రేగాకాంతారావు, బాల్క సుమన్, జీవన్ రెడ్డి, మాజీ మంత్రి వేణుగోపాలచారి తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం పండుగ వాతావరణం మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవం
దేశ వైద్యరంగంలో తెలంగాణ వేదికగా శుక్రవారం సరికొత్త రికార్డు నమోదైంది. మెడికల్ కాలేజీ ఏర్పాటుతో జిల్లాకు క లిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని ఇటీవల మం త్రులు కెసిఆర్, హరీశ్‌రావులు ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయా జిల్లా కేంద్రాల్లో జరిగే కార్యక్రమాల్లో మంత్రులు, ఎంఎల్‌ఎలు పా ల్గొని పండుగ వాతావరణంలో మెడికల్ కాలేజీల ప్రారంభోత్సరం నిర్వహించారు. ఆయా జిల్లా కేంద్రాలో 15 వేల నుం చి -20 వేల మందితో భారీ ర్యాలీలు నిర్వహించారు. ఇందులో పెద్ద ఎత్తున యువతను, విద్యార్థులను భాగస్వాములను చేశారు. మెడికల్ కాలేజీ ఏర్పాటుతో విద్యార్థులకే కాకుండా దానికి అనుబంధంగా అందుబాటులోకి వచ్చే దవాఖానతో ప్రజలకు ఎలాంటి అత్యుత్తమ ఆరోగ్య సేవలు అందుతాయో వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News