Friday, July 19, 2024

అజెండాపై అస్పష్టత!

- Advertisement -
- Advertisement -

ప్రత్యేక సందర్భాల్లో నిర్వహించవలసిన చట్టసభల ప్రత్యేక సమావేశాలను కేంద్రంలోని బిజెపి పాలకులు తమ చిత్తం వచ్చినట్టు జరిపిస్తున్నారు. అందుకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలతో ముందుగా పంచుకోకుండానే నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. ప్రజాస్వామ్యం పట్ల తమకు ఏమాత్రం గౌరవం లేదని ఇప్పటికే అనేక సార్లు నిరూపించుకొన్న బిజెపి పెద్దలు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలంటూ ఇలా వ్యవహరించడం ఆశ్చర్యపోవలసిన విషయం కాదు. వాస్తవానికి పార్లమెంటు సమావేశాలన్నీ ఒకటే. ప్రత్యేక సమావేశాలంటూ రాజ్యాంగంలో ప్రత్యేకించి ఏమీ లేదు. అయితే గతంలో వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) ప్రవేశపెట్టినప్పుడు 2017లో ఒకసారి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ 125వ జన్మదినం సందర్భంగా 2015 నవంబర్ 26న ఒకసారి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరిగాయి. అలాగే భారత స్వాతంత్య్ర స్వర్ణోత్సవాల సందర్భంగా 1997 ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 1 వరకు కూడా ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. అలా అంతకు ముందు సైతం పలు కీలక సందర్భాల్లో వీటి నిర్వహణ జరిగింది. ఇప్పుడు మాత్రం అటువంటి చరిత్రాత్మక ఘట్టమేదీ లేకుండానే ఈ ప్రత్యేక సమావేశాలను కేంద్రం ప్రకటించడం విశేషం. గత నెలలోనే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిశాయి.

ఆ తర్వాత కొద్ది రోజులకే ఆగస్టు 31న ఈ సమావేశాల ప్రకటన వెలువడింది. ఎందుకు జరుపుతున్నారనే దానిపై అనేక ఊహాగానాలు చోటు చేసుకొన్నాయి. జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలో ప్రత్యేక కమిటీని నియమించడంతో అందుకు సంబంధించిన బిల్లును ఆమోదింప చేసుకోడం ఈ ప్రత్యేక సమావేశాల లక్షమని ప్రచారం జరిగింది. ఎవరు ఎన్ని రకాలుగా అంచనాలు వేసుకొంటున్నప్పటికీ ప్రధాని మోడీ ప్రభుత్వం మాత్రం ఈ సమావేశాలను పలానా అవసరాల కోసం జరుపుతున్నట్టు అధికారికంగా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. ఇంతకీ సమావేశాల అజెండా ఏమిటని సూటిగా ప్రశ్నిస్తూ సోనియా గాంధీ ప్రధానికి లేఖ రాసిన తర్వాత సమావేశాలలో చేపట్టదలచిన కార్యక్రమంపై కేంద్రం కొంత స్పష్టతను ఇచ్చింది. 75 ఏళ్ళ పార్లమెంటు చరిత్రను గురించి మొదటి రోజు చర్చించనున్నట్టు, ఆ తర్వాత రాజ్యసభలో రెండు బిల్లులను, లోక్‌సభలో రెండు బిల్లులను ప్రవేశపెట్టనున్నట్టు అందులో పేర్కొన్నది. ఆ బిల్లులు ఏమిటనేది ఇంకా అస్పష్టతే. చంద్రయాన్ 3 విజయవంతం కావడం, జి 20 శిఖరాగ్ర సమావేశాలు సవ్యంగా ముగిసిపోడం ప్రధాని కీర్తి కిరీటంలో కలికి తురాయిలుగా చెప్పుకొంటున్నారు. ఇప్పటికే బిజెపి ఈ రెండింటినీ తన సొంత ఖాతాలో వేసుకొన్నది.

ఈ రెండు విజయాల మీద పార్లమెంటులో పార్టీ సభ్యుల చేత బల్లలు చరిపించుకోడం లక్షంగా ప్రత్యేక సమావేశాలు జరుగుతూ వుంటే ఆశ్చర్యపోనవసరం లేదు. వాస్తవానికి ఈ రెండూ ఇండియా సాధించిన విజయాలే అవుతాయి గాని, ప్రత్యేకించి పాలక పక్షం గొప్పతనం ఇందులో వుండదు. జి20 సమావేశాలు అమెరికా కూటమి ప్రయోజనాల మేరకు జరిగినవేనన్న సంగతి తెలిసిందే. అయినా వంతులవారీగా వచ్చిన అధ్యక్ష స్థానాన్ని వినియోగించుకొని దానిని విజయవంతంగా జరిపించడం ప్రధాని మోడీ గొప్పతనం కిందికి వస్తుంది గాని, అందు కోసం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరిపి జబ్బలు చరుచుకోవలసిన పని లేదు. వచ్చే డిసెంబర్‌లో ఐదు రాష్ట్రాల కీలక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత కొద్ది మాసాలకు లోక్‌సభ ఎన్నికలున్నాయి. వాటి కోసం నెమ్మది నెమ్మదిగా స్వీయ ఘనతల చాటింపు కార్యక్రమాన్ని రక్తికట్టించి పరాకాష్ఠకు తీసుకుపోవాలన్నది ప్రధాని మోడీ పథకం కావచ్చు. అంతటితో ఆగకుండా దేశ ప్రజలను భ్రమల్లో ముంచే కొత్త బిల్లులను ఈ సమావేశాల్లో చట్టాలుగా చేసుకొనే వీలు లేకపోలేదు. చట్టసభల్లో మహిళల కోటా బిల్లు, వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ బిల్లు వంటి వాటిని ప్రవేశపెట్టి పార్లమెంటు చేత ఆమోదింపజేసుకొని వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలని ప్రధాని మోడీ ప్రభుత్వం వ్యూహం పన్నిందని చెప్పుకొంటున్నారు. అలాగే ప్రధాన ఎన్నికల కమిషనర్,

ఎన్నికల కమిషనర్లను నియమించే కమిటీ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించే బిల్లును ఆమోదింపజేసుకొంటారని తెలుస్తున్నది. దేశంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కీలకమైన వ్యవహారంలో కేంద్ర పాలకులు తమదే పైచేయిగా చేసుకోడానికి ఉద్దేశించిన ఈ బిల్లును ఇప్పటికే పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అయితే దీనిని చట్టం చేసుకోడం సులభసాధ్యం కాకుండా చేయవలసిన బాధ్యత ప్రతిపక్షంపై వుంది. ఇలా ఇన్ని రకాల ఊహాగానాల నేపథ్యంలో వచ్చే సోమవారం నుంచి జరగనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఇప్పటికీ అత్యంత ఉత్కంఠభరితమైనవే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News