Sunday, June 16, 2024

ప్రభుత్వ ఆస్పత్రుల్లో అధునాతన పరికరాలు

- Advertisement -
- Advertisement -

బాన్సువాడ: రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వాస్పత్రులను విస్తరించి, ఆధునీకరణ చేసి అధునాతన పరికరాలు అందుబాటులోకి తెచ్చి పేదలకు వైద్య సహాయం అందజేస్తుందని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని మీనా గార్డెన్‌లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వైద్యారోగ్య దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కంటి వెలుగు, కేసిఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, డయాలసిస్ పేషంట్లు, తదితరులు తమ అనుభవనాలను, ప్రభుత్వం నుంచి పొందిన సేవలను వివరించారు.

వైద్య, ఆరోగ్య శాఖ ప్రాముఖ్యమైందని, ఏడాదికి ఏడాదికి ప్రైవేట్ ఆస్పత్రుల సంఖ్య పెరుగుతుందన్నారు. ఆస్పత్రులు పెరిగాయంటే రోగులు పెరుగుతున్నారని అర్థమన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం ఖరీదైన వ్యవహారమని, పేదలు ఆర్థికంగా భరించలేరన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆస్పత్రులను విస్తరించి, ఆధునీకరణ చేసి ఆధునాతన పరికరాలను అందుబాటులోకి తెచ్చి పేదలకు వైద్య సహాయం అందజేస్తుందన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో వైద్య, ఆరోగ్య శాఖకు రూ. 11 వేల కోట్లు కేటాయించారన్నారు. నిమ్స్ ఆస్పత్రిలో ఇప్పటికే 2 వేల పడకల కెపాసిటి ఉండగా, ఈ రోజు మరో 2 వేల పడకల కెపాసిటి విస్తరణకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ శంకుస్థాపన చేశారన్నారు.

దేశంలో 4 వేల పడకలు గల ఆస్పత్రి ఉండే విధంగా నిమ్స్‌లో సౌకర్యాలు, వసతులు కల్పిస్తున్నారన్నారు. పట్టణ ప్రాంతాలలో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశామని, ఇంత పెద్ద ఎత్తున నిధుల కేటాయింపు, దేశంలో మరే రాష్ట్రంలో లేదన్నారు. వరంగల్‌లో 2 వేల పడకల సూపర్ స్పెషాలిటి ఆస్పత్రి నిర్మాణంలో ఉందన్నారు. గతంలో రాష్ట్రంలో 3 డయాలసిస్ కేంద్రాంటుంటే ప్రస్తుతం 26కు పెరిగాయన్నారు. 2014కు ముందు రాష్ట్ర ఆస్పత్రుల్లో బెడ్ల సంఖ్య 8 వేలుంటే, ప్రస్తుతం 27,700 ఉందన్నారు. బాన్సువాడలో రూ. 20 కోట్లతో 100 పడకల మాత, శిశు ఆస్పత్రిని నిర్మించామని, ప్రారంభించిన రెండు సంవత్సరాలలోపే బిడ్డకు తల్లి పాల ప్రోత్సాహంలో బాన్సువాడ మాత, శిశు ఆస్పత్రికి జాతీయ అవార్డు వచ్చిందన్నారు. ప్రభుత్వం నుంచి ఆస్పత్రికి మంజూరు చేసి, నిర్మించిన తక్కువ సమయంలో ఇంత పేరు రావడానికి కారణం డాక్టర్లు, సిబ్బంది సేవల కృషి అన్నారు. బాన్సువాడ ఆస్పత్రికి జుక్కల్, ఎల్లారెడిడ, బోధన్, నారాయణ ఖేడ్ నియోజకవర్గాలతో పాటు మహారాష్ట్ర నుంచి కూడా రోగులు వస్తారన్నారు. డాక్టర్లు, సిబ్బంది తమ సేవలతో ప్రజల మన్ననలు పొందుతున్నారన్నారు.

ప్రతి మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయించామన్నారు. బాన్సువాడ పట్టణంలో రెండు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయించామన్నారు. వర్నిలో రూ. 10.70 కోట్లతో నిర్మించే 30 పడకల ఆస్పత్రికి, కోటగిరిలో రూ. 13 కోట్లతో నిర్మించే 50 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేయనున్నామన్నారు. భవిష్యత్తులో పేదలకు వైద్య సేవలు ఇంకా విస్తరించాలన్నారు.
వైద్యులు, సిబ్బంది సేవలు అమోఘం : కలెక్టర్ జితేశ్ వి పాటిల్
కరోనా సమయంలో వైద్యులు, వైద్య సిబ్బంది చేసిన సేవలు అమోఘమని, ఇటు కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే కష్టకాలంలో సేవలందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలన్నారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. బాన్సువాడ పట్టణంలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వైద్యారోగ్య దినోత్సవంలో పాల్గొని మాట్లాడారు. ఆరోగ్య మహిళ కార్యక్రమం ఎంతో ఆదర్శమన్నారు. నర్సింగ్ కళాశాల విద్యార్థులు నెంబర్ వన్‌గా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు.

బాన్సువాడ ఆస్పత్రికి మంచి మంచి అవార్డులు రావడం ఎంతో సంతోషకరమని, వైద్యులు, వైద్య సిబ్బందికి మరొక్క సారి అభినందనలన్నారు. కంటి వెలుగు ఎంతో మంచి కార్యక్రమమని, గ్రామ గ్రామాన ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు చేయడం ఎంతో హర్షనీయమన్నారు. ఈ కార్యక్రమంలో డీఎం అండ్ హెచ్‌వో లక్ష్మణ్ సింగ్, డిప్యూటి డీఎం అండ్ హెచ్‌వో శిరీష, బాన్సువాడ ఆర్డీవో రాజాగౌడ్, నాయకులు అంజిరెడ్డి, ఆయా మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News