Sunday, April 28, 2024

ఇక ఎన్నికల నియంతృత్వం

- Advertisement -
- Advertisement -

‘ఎన్నికల్లో పాలక పార్టీ ఆధిక్యతను సాధించి, చట్టపరంగా అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటికీ, ప్రజాస్వామ్యం పేరుతో నియంతృత్వ మార్గంలో నడుస్తోంది. ఎమర్జెన్సీలో లాగా పరిపాలనా వ్యవస్థ ఆధిపత్యం పెరుగుతోంది? భారత రాజ్యాంగ దృక్పథానికి భిన్నంగా అధిక సంఖ్యాకుల సమాజాన్ని పెంచిపోషిస్తోంది. రాజకీయ ప్రయోజనాల కోసం అనుసరిస్తున్న ఈ విధానం నిజంగా ప్రజాస్వామ్యమా? నేనైతే ఎన్నికల నియంతృత్వంలోకి జారిపోతున్నామని భావిస్తున్నాను’ అని ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎ.పి.షా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రముఖ ప్రజాసేవకుడు, విద్యావేత్త డి.ఎస్. బోర్కర్ స్మారకార్ధం ‘భారత దేశం కోసం నా దృష్టి: 20047’ అన్న అంశంపై ఇటీవల ఆయన చేసిన ఉపన్యాసంలో సంక్షిప్తంగా మరి కొంతభాగం. ‘భారత దేశం హిందువుల జన్మస్థలం కాదని ఎవరూ అనలేదు. హిందువులు తమ విశ్వాసాన్ని కొనసాగించడంలో సంక్షోభాన్ని ఎదుర్కొన్నట్టు ఎలాంటి ఆధారాలూ లేవు. ముస్లింల జనాభాతో పాటు, లవ్ జిహాదీ పెరుగుతోందని ప్రచారం మాత్రం జరుగుతోంది. హిందూ జాతీయవాదమనండి, హిందూ సమర్ధకులనండి వారికిక్కడ స్థానముంది.

ఇక్కడ వారి గొంతు వినిపిస్తోందనడానికి వారి భావప్రకటనా స్వేచ్ఛే రుజువు. మైనారిటీల నోరుమూయించడానికి హిందూ తీవ్రవాద ముఠాల రాజ్యాధిపత్యం ముందుకు వస్తోంది. మైనారిటీలు ఏం తినాలి, ఏం తినకూడదు, ఏ దుస్తులు వేసుకోవాలి, ఏం వేసుకోకూడదు, ఏ భాష మాట్లాడాలి, ఎవరిని పెళ్ళి చేసుకోవాలి, ఎవరిని చేసుకోకూడదంటూ సజాతి సంస్కృతిని వారిపైన రుద్ద్దుతున్నారు. ఇది ఘర్షణకు దారితీస్తోంది. ఈ ప్రమాదం గురించి అంబేడ్కర్ కూడా హెచ్చరించారు. ఎన్నికల్లో ఆధిక్యతను సాధించిన పాలక పార్టీ చట్టపరంగా ప్రజాస్వామ్య అధికారాన్ని చేజిక్కించుకుంది.ప్రజాస్వామ్యమని చెప్పుకుంటూ నియంతృత్వ మార్గంలో నడుస్తోంది. ఎమర్జెన్సీలో లాగా పరిపాలనాధిపత్యం పెరుగుతోంది. భారత రాజ్యాంగ దృక్పథానికి భిన్నంగా రాజకీయ సంస్కృతిని, అధిక సంఖ్యాకుల సమాజాన్ని పాలనా వ్యవస్థ పెంచి పోషిస్తోంది. చట్టబద్ధమైన రాజకీయ ప్రయోజనాల కోసం అనుసరిస్తున్న ఈ విధానం ప్రజాస్వామ్యమా? మనం ఒక ఎన్నికల నియంతృత్వంలోకి జారిపోతున్నామని నేను భావిస్తున్నాను. తమ ప్రయోజనాలకు అనుగుణంగా నిబంధనలను రూపొందిస్తున్నారు.

ప్రైవేటు రంగం, పెద్ద పెద్ద పత్రికలు నోరెత్తడం లేదు. నోరెత్తాల్సిన వారు, ప్రశ్నించేవారు, నిరసనకారులు అనేక రకాల ఇబ్బందుల్లో పడిపోయారు. ఎలెక్టోరల్ బాండ్ల విషయంలో పారదర్శకత లేకపోవడాన్ని మనం గమనించాం. ఎన్నికల కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తిని నీరుకార్చడం గమనించాం. ప్రధాన ఎన్నికల కమిషన్ ఎంపిక కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగిస్తూ చేసిన ప్రతిపాదననూ గమనించాం. అధికారులు జవాబుదారీగా వ్యవహరించవలసిన లోక్‌పాల్, కేంద్ర సమాచార కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ వంటి వాటిని కాగితాలకు పరిమితం చేశారు. బిజెపియేతర పాలిత రాష్ట్రాలలో పక్షపాత ధోరణితో వ్యవహరించే వారిని గవర్నర్లుగా నియమించి, వారి ద్వారా ఆయా రాష్ర్ట ప్రభుత్వాలను శాసిస్తూ ఫెడరల్ సంబంధాలను నాశనం చేశారు. రాజకీయ ప్రత్యర్థులపైన, స్వతంత్ర పత్రికా వ్యవస్థపైన, అసంతృప్తవాదులపైన సిబిఐ, ఇడి, ఎన్‌ఐఎలను ప్రయోగిస్తున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం కొత్తకాకపోయినా, ప్రస్తుతం అనూహ్యంగా తయారయ్యాయి. కొన్ని మినహాయింపులు ఉన్నప్పటికీ పత్రికలు కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీస్వతంత్రంగా వ్యవహరించలేకపోతున్నాయి.

విద్వేషాలు పెరగడానికి మీడియా కూడా కారణమవుతోంది.ప్రజాస్వామ్య వైఫల్యానికి ఇవ్వన్నీ దోహదం చేస్తున్నాయి. తనకు ఇబ్బందికరంగా ఉన్న భావ వ్యక్తీకరణను అణచివేస్తూ, నిరసనకారులను నేరస్థులని ముద్రవేసే ధోరణి కనిపిస్తోంది. నిరసనగా టూల్‌కిట్‌ను పంపిణీ చేస్తున్నాడని దిశ రవిని అరెస్టు చేయడం, కరోనా చికిత్సగా ఆవు మూత్ర సేవనాన్ని ప్రశ్నించిన వారిని అరెస్టు చేయడం, సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వాన్ని విమర్శించిన పత్రిసియ ముఖిం వంటి జర్నలిస్టులను అరెస్టు చేయడం, సంఘ సేవకుడు హర్ష మందిర్‌పైన దాడి చేయడం, హాస్యనటుడు మున్వర్ ఫరూకిని అరెస్టు చేయడం, రైతుల ఆందోళన సమయంలో, జమ్ముకశ్మీర్‌లో, మణిపూర్‌లో ఇంటర్‌నెట్‌ను నిలిపివేయడం వంటి లెక్కలేనన్ని ఉదాహరణలున్నాయి. ఎప్పుడో 150 సంవత్సరాల క్రితం నాటి పాత చట్టాల స్థానంలో కొత్త చట్టాలు రావడం మంచిదే. నూతన చట్టాల తయారు చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు, కొత్త సీపాలో పాత సారా నింపి ఇస్తున్నారు. వలసవాద పాలనకు అవశేషాలకు ముగింపుగా మెకాలే విద్యా విధానాన్ని విమర్శించినప్పటికీ, కొత్త చట్టాలు అదేభాషలో పునరుద్ధరిస్తున్నారు. నూతన చట్టాలు మరింత సంక్లిష్టతను తెచ్చిపెడుతున్నాయి. దేశద్రోహ నిరోధక చట్టాలలో ఉన్నటువంటి నిబంధనలతో వ్యక్తి స్వేచ్ఛను పెంచడానికి బదులు తగ్గించేస్తున్నాయి. హోం మంత్రిత్వ శాఖ తెచ్చే నూతన చట్టాల వల్ల నేరస్థులను సంస్కరించడానికి బదులు వారిని నిర్బంధించి, కఠినంగా శిక్షిస్తున్నారు.

చివరి రక్షణ కోటగా న్యాయ వ్యవస్థ
గోప్యత హక్కు చట్టంవంటి వాటిపైన సుప్రీంకోర్టు ఇటీవల మంచి తీర్పులను వెలువరించింది. మణిపూర్, హర్యానాలో జరిగిన సంఘటనలకు సంబంధించి, విద్వేష ప్రసంగాలపైన, భీమాకోరెగాన్ కేసులో బెయిల్ మంజూరు చేయడం వంటి మంచి ఆదేశాలను జారీ చేసింది. అయితే పాలనా వ్యవస్థలో జరుగుతున్న అతిపోకడలను న్యాయవ్యవస్థ పూర్తిగా నిలుపుదల చేయలేకపోయింది. ఎలెక్టోరల్ బాండ్ల విషయంలో, పౌరసత్వం సవరణ చట్టం విషయంలో వాదనలను వెంటనే వినడానికి సుముఖత చూపలేదు. న్యాయంకోసం పోరాడే తీస్తాసెతల్వాద్ వంటి వారిని ధ్యేయంగా పెట్టుకుని పెట్టిన కేసును న్యాయస్థానాలు కొట్టివేయకుండా, ఆచరణలో ప్రభుత్వానికి మద్దతుగానే వ్యవహరించాయి. మానవ హక్కుల కోసం పోరాడే వారిని పీడించడానికి తీవ్రవాద వ్యతిరేక చట్టాలు, ముఖ్యంగా ‘ఉపా’ చట్టం వాటిని మోపుతున్నారు. ‘ఉపా’ కింద ఎవరినైనా అరెస్టు చేస్తే, నిరవధికంగా నిర్బంధిస్తున్నారు. ఢిల్లీ అల్లర్లు, భీమాకోరెగాన్ కేసులతో పాటు అనేక కేసుల్లో ‘ఉపా’ను ప్రయోగిస్తున్నారు.భీమాకోరెగాన్ కేసులో సుధాభరద్వాజ్ వంటి కొందరికి బెయిల్ మంజూరైనా, స్టాన్‌స్వామి పైన విచారణ జరగకుండానే జైల్లో మరణించారు.

ఇదివరలా హైకోర్టులు స్వతంత్రంగా వ్యవహరించలేకపోతున్నాయి. ఇలాంటి వాటి వల్ల నా న్యాయమూర్తి పదవి హైకోర్టుకు పరిమితమైపోయింది. ఎమర్జెన్సీ చీకటిరోజుల్లో భారత ప్రజలతరపున నిలబడిన ప్రజాస్వామిక సంస్థల్లో హైకోర్టులు పని చేశాయి. కరోనా సమయంలో వలస కార్మికుల విషయంలో హైకోర్టులు కొన్ని మంచి ఆదేశాలు జారీ చేశాయి. కానీ ప్రస్తుతం పౌర హక్కుల కేసుల్లో హైకోర్టులు అలా స్వతంత్రంగా వ్యవహరించడానికి వీలులేకపోవడంతో, వ్యక్తులు ఎవరైనా సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వస్తోం ది. ఆవు పేడ, మూత్రం వల్ల ప్రయోజనాలని, మనుస్మృతిని ఆవాహన చేయడం, అధికసంఖ్యాకుల భాషనే మాట్లాడాలనడం వంటివన్నీ చూడాల్సి రావడం న్యాయమూర్తులకు ఇబ్బందికరంగా తయారయ్యాయి. వీటన్నిటినీ అధిగమించడానికి న్యాయవ్యవస్థే చివరి రక్షణ కోటని పాలనా వ్యవస్థ కూడా భావిస్తోంది. రాజ్యాంగం మార్చకుండా హిందూ రాష్ర్ట ఏర్పాటు అసాధ్యమని పాలనా వ్యవస్థ కూడా అర్ధం చేసుకుంది. కేశవానంద భారతి కేసులో 13 మంది సభ్యులు గల ధర్మాసనం రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలైన ప్రజాస్వామ్యం, లౌకికతత్వం, చట్టబద్ధత, సమానత్వం, ఫెడరలిజం, న్యాయస్థానాల స్వయం ప్రతిపత్తిని మార్చలేం అని స్పష్టం చేసింది. భారత ఆర్థిక వ్యవస్థ వెలిగిపోతోందని మనం గర్వంగా చెప్పవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద అర్థిక వ్యవస్థగా ఏర్పడవచ్చు.

దీన్ని కాస్త లోతుగా పరిశీలించినట్టయితే భారత ఆర్థిక వ్యవస్థ చాలా కొద్దిమందికే వెలిగిపోతోందన్న విషయం స్పష్టమవుతుంది. ఆకలిని జయించి, ఆహార భద్రతను కల్పించిన 170 ప్రపంచ దేశాల జాబితాలో భారత దేశం 107వ స్థానంలో నిలిచింది. పరిసరాల పరిజ్ఞానంలో వాయు, నీటి కాలుష్యంలో భారత దేశం అట్టడుగున 180వ దేశంగా ఉండిపోయింది. మానవ అభివృద్ధిలో, జెండర్ తేడాలో, వివిధ రకాల పేదరికంలో భారత దేశం యధావిధిగా దారుణమైన స్థానంలో ఉంది. పొరుగున ఉన్న దేశాలతో పోల్చుకున్నా కూడా భారత దేశం అట్టడుగున ఉంది. ఒక చేదైన విషాదం ఏమిటంటే, శ్రామిక వర్గం, దిగువ మధ్యతరగతి వర్గం, అట్టడుగు వర్గం, వ్యవసాయ కూలీలు అసలు మనుగడ సాగించలేకపోతున్నారు. ఆదాయ అసమానతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ వర్గాల వారు విద్య, వైద్యం పైన కనీసంగానైనా వెచ్చించలేకపోతున్నారు. గతంలో కంటే ఇప్పుడు అవినీతి, ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం పెరిగిపోయింది. రాజకీయాల్లో గాని, సమాజంలో గాని విభజన, విద్వేషాలు ఎల్లకాలం సాగవని చరిత్ర చెపుతోంది.

ప్రస్తుత రాజకీయాలను, ఆర్థిక వ్యవస్థను మతం, మతవాదులు శాసించవచ్చు. కానీ, ఇది తాత్కాలికమే. మతోన్మాదులు గాంధీ విగ్రహాలను, టాగూర్ విగ్రహాలను కూలదోయవచ్చు. వారి ఆలోచనలను అవహేళన చేయవచ్చు. కాని, శాంతి మార్గం మాత్రమే నిజమైన అభ్యుదయమని ఒక ఉద్యమం మనకు చెపుతుంది. భారతీయుల్లో చాలా శక్తిఉంది. ఈ రోజు మనం చూస్తున్న పరిస్థితిని తారుమారు చేయగలుగుతారనే నమ్మకం నాకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News