Friday, April 26, 2024

ఎపి త్రికేంద్రీకరణ

- Advertisement -
- Advertisement -

 Capitals

 

మూడు రాజధానుల బిల్లుకు మంత్రి వర్గం ఆమోదం, అసెంబ్లీకి సమర్పణ

అమరావతిలోనే శాసనసభ, పాలనా రాజధానిగా విశాఖపట్నం, కర్నూలులో హైకోర్టు
అసెంబ్లీ వద్ద నిరసన ప్రదర్శనలు, ఉద్రిక్తత

హైదరాబాద్ : పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదించింది.అమరావతికి సంబంధించి టిడిపి ప్రభుత్వం ఏ ర్పాటు చేసిన రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సిఆర్‌డిఎ)ను రద్దు చేస్తూ కే బినెట్ నిర్ణయం తీసుకుంది. హైపవర్ కమిటీ నివేదికకు ఆమోదం తెలిపింది. రాజధానికి భూములిచ్చిన రైతులకు కౌలు చెల్లింపు కా లాన్ని ప్రస్తుతమున్న పదేళ్ల నుంచి 15 ఏళ్లకు కేబినెట్ పెంచింది. ఏటా 10 శాతం చొప్పున పెంచుతూ పదేళ్లపాటు కౌలు చెల్లించాలనే గత నిర్ణయాన్ని సవరించింది. విశాఖపట్నంను పరిపాలనా రాజధాని చేయాలని ఎపి మంత్రి మండలి సోమవారం నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ సమావేశాలు అమరావతిలో నిర్వహించాలని, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. వికేంద్రీకరణ బిల్లును ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

సిఆర్‌డిఎ రద్దు బిల్లును పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రవేశపెట్టారు. ప్రజాస్వామ్యంలో అతి ముఖ్యమైన మూలస్తంభం చట్టసభలని, శాసన రాజధానిగా అమరావతి ఉంటుందని మంత్రి బుగ్గన సభలో చెప్పారు. విశాఖపట్నం పరిపాలన రాజధానిగా ఉంటుందని, రాజ్‌భవన్, సచివాలయం విశాఖలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. న్యాయ రాజధానిగా కర్నూలు ఉంటుందని, న్యాయపరమైన అన్ని శాఖలు కర్నూలులో ఉంటాయని మంత్రి తెలిపారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన చెప్పారు. తెలంగాణ కన్నా రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనకబడి ఉన్నాయని జస్టిస్ శ్రీకృష్ణకమిటీ తేల్చిందన్నారు. పరిపాలన సంబంధిత వ్యవహారాలు మొత్తం విశాఖ నుంచి జరుగుతాయి. రాజ్‌భవన్, సచివాలయం, విభాగాల అధిపతుల(హెచ్‌వోడి) కార్యాలయాలు విశాఖలో ఏర్పాటు చేయాలి. శాసన కార్యకలపాలన్నీ అమరావతిలోనే సాగుతాయి.

న్యాయ సంబంధిత కార్యకలాపాలు మొత్తం కర్నూల్ నగరం నుంచి జరుగుతాయి. న్యాయవ్యవస్థ ఆమోదం తెలిపిన తర్వాత అమరావతి నుంచి కర్నూలుకు హైకోర్టు తరలింపు మీద నిర్ణఁం ఉంటుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం కర్నూలులో ఏర్పాటు చేయాలని అని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం జూన్‌లో ఏర్పడిందని, రాజధానిని డిసెంబర్‌లో ప్రెకటించారని, రాజధాని ప్రకటనకు ముందే ఇప్పుడు రాజధాని ఉన్న ప్రాంతంలో 4070 ఎకరాలను టిడీపి నాయకులు, వారి బినామీలు కొనుగోలు చేశారని మంత్రి బుగ్గన సభలో ఆరోపించారు. అధికారిక సమాచారం ప్రకారం 4070 ఎకరాలు అని, వాస్తవానికి ఇంతకన్నా పెద్ద మొత్తంలో టిడిపి నాయకులు, బినామీలు భూమలు కొన్నారని, ఇదంతా ఇన్‌సైడర్ ట్రేడింగ్ అని ఆరోపించారు.

ఇలా భూములు కొన్న వారిలో అప్పటి ముఖ్యమ్రంతి చ్రందబాబు నాయుడు, టిడిపి నాయకులు పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్ర, పల్లె రఘునాథ్‌రెడ్డి, మురళీమోహన్, పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ వారి బంధువులు పెట్టా మహేష్ యాదవ్, లింగమనేని రమేశ్, జీవీఎస్ ఆంజనేయులు, వేమూరి రవికుమార్, వేమూరి ప్రసాద్, యార్లగడ్డ రవికిరణ్, బుచ్చయ్య చౌదరి తదితరులు ఉన్నారని మంత్రి బుగ్గన ఆరోపించారు. లంక భూములు, పోరంబోకు భూములు, ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు సహా ఏ భూములను వదిలిపెట్టలేదని, ఇది రాజధాని నిర్మాణమా? రియల్ ఎస్టేట్ వ్యాపారమా? అని ఆయన వ్యాఖ్యానించారు.

బ్రిటిష్ పాలనలో కోట్ల రూపాయల పన్ను వసూళ్లు లండన్ తరలించి మహాసౌధాలు నిర్మించుకున్నారని భారతీయులు కనీస అవసరాలకు నోచుకోక పోరాటం చేయాల్సి వచ్చిందని మంత్రి చెప్పారు. ఆధునిక కలంలో పాలకులు అలాంటి పొరపాట్లు చేయకూడదన్నారు. శ్రీకృష్ణదేవరాయలు హయాంలో ఎక్కడా పెద్ద కోటలు నిర్మించలేదని, కానీ అప్పుడు తవ్విన చెరువులు ఇప్పటికీ ఉన్నాయని పేర్కొన్నారు. శాసనసభ ప్రత్యేక సమావేశాలకు టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఆ పార్టీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు.

కుప్పకూలిన ఇంజనీరింగ్ విద్యార్థిని
ఈ నేపథ్యంలో వెలగపూడిలో కుటుంబంతో కలిసి నిరసనల్లో పాల్గొంటున్న ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. పోలీసులు నిర్ధాక్షిణ్యంగా వ్యవహరించడమే ఇందుకు కారణమంటూ ప్రజలు ్రఆగహావేశాలు వ్యక్తపర్చారు.

అసెంబ్లీ వైపు దూసుకొచ్చిన ఎంపి గల్లా అరెస్ట్
టిడిపి ఎంపి గల్లా జయదేవ్ కూడా అసెంబ్లీ వైపు దూసుకొచ్చారు. స్థానికులతో కలిసి పోలీసుల్నిదాటుకుని రాగా.. జయదేవ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అక్కడ్నించి పోలీసులు తరలించారు. దీంతో టిడిపి కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఎంపి గల్లా జయదేవ్ చొక్కా కూడా చిరిగిపోయింది.

గృహ నిర్భంధాలు.. కొనసాగిన అరెస్ట్‌ల పర్వం
అసెంబ్లీ ముట్టడిని భగ్నం చేయడానికి ప్రభుత్వం పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరింపజేసింది. పలువురు నాయకులను గృహనిర్భందంలో ఉంచింది. పోలీసుల చర్యకు నిరసనగా గ్రామస్తులు రోడ్ల మీదికి వచ్చి నిరసనలు చేపట్టడం పలు చోట్ల ఉద్రిక్తతకు దారితీసింది. సోమవారం తెల్లవారుజామునుండే పలు చోట్ల నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్‌లు చేశారు. పొన్నూరు నుంచి భారీ బైక్ ర్యాలీతో అసెంబ్లీ ముట్టడిలో పాల్గొన్న టిడిపి మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రకుమార్ చౌదరిని పోలీసులు అరెస్టు చేశారు. పొన్నూరు నుంచి ర్యాలీగా బయలుదేరిన ఆయన తుళ్లూరుకు చేరుకన్నారు. అసెంబ్లీ వైపు దూసుకెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు నరేంద్రకుమార్ అనుచరులు, కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అనంతరం ఆయనను అరెస్టు చేసిన పోలీసులు అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

విద్యార్థి నాయకుల విఫల యత్నం
ఏపి గుంటూరులో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బయల్దేరిన విద్యార్థి యువజన ఐకాస నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకటే రాజధాని అంటూ.. ఏపీ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రావిపాటి సాయి, మహంకాళి సుబ్బరావు, బట్టగిరి వెంటకేశ్వరరెడ్డి, షేక్ జిలాని తదితరులను బృందావన్ గార్డెన్ కూడలిలో అరెస్ట్ చేశారు. నిరసనగా వీరు బెలూన్లు ఎగరేశారు. పోలీసులు వారిని బలవంతంగా రైల్వే కల్యాణమండపానికి తరలించారు.

చేపల వలలతో పోలీసుల గస్తీ…
రాజధానిలో పోలీసులు పెద్ద ఎత్తున వలలు సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి ప్రయాణించే మార్గంలో నివాసాలు ఉన్న ప్రతి ఇంటి వద్ద వలలు ఏర్పాటు చేశారు. ప్రధానంగా మందడం గ్రామంలో రహదారి వెంబడి ఉన్న ఇళ్ల వద్దే ఉదయం నుంచే ఈ వలలతో పోలీసులు మోహరించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా.. సిఎం వెళ్లే సమయంలో వలలు ఎలా ఉపయోగించాలో రిహార్సల్స్ చేశారు.

హోంమంత్రి సుచరిత ఇల్లు ముట్టడి
గుంటూరులో ఎపి హోంమంత్రి మేకతోటి సుచరిత ఇంటిని ముట్టడించారు. మంత్రి ఇంటి ఎదుట మాజీ మంత్రి ఆలపాటి రాజా, తెదెపా నేతలు డేగల ప్రభాకర్, సనీర్, మల్లి, కనపర్తి, గోళ్ళ ప్రభాకర్‌లు బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రభుత్వం భారీగా పోలీసులను మోహరించింది. వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే బ్యారేజ్ మీదకు అనుమతించారు.

తూ.గో జిల్లాలో టిడిపి ఆందోళన
ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్‌చేస్తూ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో తెదేపా శ్రేణులు జాతీయ రహదారిపై నిరసనకు దిగారు. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ జ్యోతుల నవీన్‌కుమార్ ఆధ్వర్యంలో కిర్లంపూడి మండలం రామవరం వద్ద జాతీయ రహదారిపై టెర్లు దహనం చేశారు.

ఇంటికి పదిమంది పోలీసులా?
జగన్ సర్కార్ తీరుపై మండిపడ్డ నారా లోకేష్
జెఏపీ, పార్టీల నేతల అరెస్ట్‌లు.. అమరావతి ప్రాంతంలో పోలీసుల మోహరింపుపై మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. జగన్ సర్కార్ తీరుపై మండిపడ్డారు. ఇంటికి పది మంది పోలీసులా.. ఇళ్ల ముందు నెట్‌లు పెట్టుకుని నిలబడటం ఏంటి.. రాజధాని గ్రామాల్లో యుద్ధ వాతావరణం ఎందుకు.. పాకిస్థాన్ బోర్డర్ కంటే ఎక్కువగా రాజధాని గ్రామాల్లో పోలీసులను దింపుతారా.. ఇచ్చిన హామీ నిలబెట్టుకోమని అడగటం ప్రజలు చేసిన తప్పా? అంటూ ప్రశ్నించారు.

17 మంది టిడిపి సభ్యుల సస్పెన్షన్
ఎపి అసెంబ్లీ నుంచి పదిహేడు మంది టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సస్పెండ్ చేశారు. సీఆర్డీఏ బిల్లు రద్దుపై చర్చ సందర్భంగా స్పీకర్ పోడియాన్ని టీడీపీ సభ్యులు చుట్టుముట్టారు. సిఎం జగన్ ప్రసంగాన్ని ఉద్దేశపూరర్వకంగా టీడీపీ సభ్యులు అడ్డుకుంటున్నారంటూ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో టిడిపి సభ్యులు అచ్చెన్నాయుడు, కరణం బలరాం, ఆదిరెడ్డి భవానీ, బుచ్చయ్యచౌదరి, చినరాజప్ప, వెంకటరెడ్డినాయుడు, వాసుపల్లి గణేష్, పయ్యావుల కేశవ్, గద్దె రామ్మోహన్, ఏలూరి సాంబశివరావు, జోగేశ్వరరావు, వెలగపూడి రామకృష్ణబాబు, నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, గొట్టిపాటి రవి, అనగాని సత్యప్రసాద్, బాల వీరాంజనేయస్వామిలను సభ నుంచి సస్పెండ్ చేశారు.

ఎపి అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత
ఎపి రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రైతులు కొనసాగిస్తున్న నిరసన ప్రదర్శనలు సోమవారం నాటికి పతాకస్థాయికి చేరాయి. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ టిడిపి నేతలు, అమరావతి సంయుక్త కార్యాచరణ సమితి ఐక్య కార్యాచరణ కమిటీ నేతల పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడి ఆందోళనను నిర్వహించాయి. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ముందు నుండి చెబుతున్న విధంగానే మూడు రాజధానులకు అనుకూలంగా బిల్లును ప్రవేశపెట్టింది. అమరావతిని కేవలం శాసన రాజధానిగా పరిమితం చేసింది. ఇప్పటికే 34 రోజులుగా ఈ ప్రతిపాదన తెర మీదకు రాగానే రోడ్ల మీదకు వచ్చిన అమరావతి గ్రామ ప్రజలు సోమవారం అసెంబ్లీ ముట్టడికి నిర్ణయించారు. దీనికి పోలీసులు నిరాకరించారు.

మమ్నల్ని కాల్చేయండి సార్.. చచ్చిపోతాం..
ఇదే సందర్భంలో నిరసన ప్రదర్శన చేస్తున్న ఓ రైతు పోలీసు అధికారితో మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. నిరసన చెప్పేందుకు కూడా ఈ ఆంక్షలు ఏంటని పోలీసు ఉన్నతాధికారిని ప్రశ్నించారు. మమ్నలి కాల్చేయండి సార్.. చచ్చిపోతాం… నిరసన తెలిపే హక్కు కూడా లేదా అంటూ ఓ రాజధాని రైతు తన ఆగ్రహావేశాన్ని వ్యక్తం చేశారు. అయినా పోలీసులు అక్కడినుంచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేయడంతో నిరసన తెలిపేందుకు హక్కు లేకుండా.. ఏంటండి ఈ అమానుషం అంటూ అక్కడి నుంచి భారంగా పొంగుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ వెనుదిరిగారు. ఈ ఘటన వైరల్ అయ్యింది.

వెనక్కి తగ్గని రైతులు, మహిళలు
వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక అసెంబ్లీ భవనం చుట్టూ వందలాది మంది పోలీసులు మోహరించి ఉన్నప్పటికీ రాజధాని గ్రామాల రైతులు, మహిళలు, ఎక్కడా వెనుకంజ వేయలేదు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తరువాత స్థానిక మహిళలు, రైతులు మందడం పొలాల నుండి అసెంబ్లీ వద్దకు చేరుకునే ప్రయత్నం చేశారు. జాతీయ జెండాలు, నల్లజెండాలు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోలీసులు ఏర్పాటు చేసిన కంచెల్ని దాటుకుంటూ అసెంబ్లీ వైపు పరుగులు దీశారు. చివరి నిమిషంలో వారిని గమనించిన పోలీసులు అప్రమత్తమయ్యారు.

వారిని చెదరగొట్టారు. ఆ సమయంలో పలువురు రైతులు, మహిళలు కిందపడిపోయారు. కొంతమంది పైన పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. తమను అడ్డుకుంటున్న పోలీసులపైన స్థానికులు వాగ్వాదానికి దిగారు. కొందరు పోలీసులకు దండం పెట్టి వేడుకుంటున్నారు. అక్కడ పెద్ద ఎత్తున స్థానికులు చేరుకోవటంతో ఇతర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున పోలీసులను సైతం అక్కడకు తరలించారు. దీంతో సభ లోపల చర్చ కొనసాగుతున్న సమయంలోనే బయట పోలీసులు వర్సెస్ స్థానికులు అన్నట్లుగా పరిస్థితి నెలకొంది.

AP has three Capitals
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News