Sunday, June 23, 2024

అశ్లీల ఫొటోలు పోస్టు చేస్తున్న యువకుడి అరెస్టు

- Advertisement -
- Advertisement -

obscene Photos

 

హైదరాబాద్ : తన క్లాస్ మేట్ ఫొటోలను సేకరించి మార్ఫింగ్ చేసి సోషల్‌మీడియాలో పోస్టింగ్ చేస్తున్న ఓ యువకుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం… నగరంలోని సికింద్రాబాద్, నార్త్ లాలాగూడ, ఇందిరా నగర్‌కు చెందిన నార అక్షయ్ నారపల్లిలోని నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఈసిఈ మూడో సంవత్సరం చదువుతున్నాడు. బాధితురాలు, నిందితుడు అక్షయ్ పాఠశాలలో కలిసి చదువుకున్నారు. ఇద్దరికి ఇన్‌స్టాగ్రాం ఖాతాలు ఉన్నాయి. నిందితుడు తన వివరాలు దాచి నకిలీ ఇన్‌స్టాగ్రాం ఖాతాను క్రియేట్ చేశాడు. దాని ద్వారా గతంలో తనతో పాఠశాలలో చదువుకున్న వారికి రిక్వెస్ట్ పంపించాడు.

వాటిని బాధితురాలు కూడా అంగీకరించడంతో ఆమె ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ నుంచి సేకరించాడు. వాటిని అశ్లీల వెబ్‌సైట్‌ల నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న ఫోటోలకు మార్ఫింగ్ చేసి నగ్న ఫొటోలను బాధితురాలికి పంపించాడు. దీంతో బాధితురాలు అక్షయ్‌ను దూషించింది. తర్వాత నీ సాయం నాకు కావాలని మెసేజ్ పెట్టి మళ్లీ నగ్న మార్ఫింగ్ ఫొటోలు పంపించాడు. అంతేకాకుండా పలుమార్లు వీడియోకాల్ చేసినా కూడా బాధితురాలు స్పందించలేదు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న రాచకొండ సైబర్ క్రైం పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, ఎసిపి హరినాథ్ పర్యవేక్షణలో ఇన్స్‌స్పెక్టర్ రాము కేసు దర్యాప్తు చేశారు.

Arrest of teenager for posting obscene Photos
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News