Friday, April 26, 2024

అరవింద్ టికెట్లు అమ్ముకున్నాడు

- Advertisement -
- Advertisement -

Arvind

 

బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నిజామాబాద్ కార్యకర్తల నిరసనలు
రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిల ముందే ఆందోళనలు
ఎంపికి వ్యతిరేకంగా నినాదాలు

హైదరాబాద్/నిజామాబాద్ : మున్సిపల్ టిక్కెట్లను ఎంపి అరవింద్ ఒకే సామాజిక వర్గానికి కేటాయించారని, సీనియర్లకు ఇవ్వకుండా అమ్ముకున్నారని ఆరోపిస్తూ నిజామాబాద్ జిల్లాకు చెందిన బిజెపి కార్యకర్తలు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా. లక్ష్మణ్‌తో వాగ్వాదానికి దిగారు. శనివారం నిజామాబాద్ నుంచి హైదరాబాద్ పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న కార్యకర్తలు ఎంపి ఆరవింద్ ముందే లక్ష్మణ్‌తో గొడవకు దిగారు. ఈ సందర్భంలో లక్ష్మణ్ జోక్యం చేసుకుని వాగ్వాదానికి దిగిన కార్యకర్తలు, నాయకులకు ఎంత సర్ది చెప్పినా శాంతించలేదు. దీంతో పెద్ద ఎత్తున వారికి వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. పార్టీ అధిష్టానంపై, ఎంపి అరవింద్‌ను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. దీంతో ఒక్కసారిగా బిజెపి శ్రేణుల్లో అసమ్మతి బహిర్గతమైంది. మున్సిపల్ ఎన్నికలలో టికెట్ల కేటాయింపుతో బిజెపిలోని గ్రూపు రాజకీయాలు బయటపడ్డాయి. గత కొంతకాలంగా నిజామాబాద్ జిల్లా పరిధిలో గ్రూపులు నెరపుతున్న నాయకులు తమ ఆధిపత్యం కోసం వర్గాలను ప్రోత్సహిస్తూ వస్తున్నారనేది బహిరంగ రహాస్యం.

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డా. కె. లక్ష్మణ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి , పార్టీ పరిశీలకులు కృష్ణదాస్ సమావేశమైన గది ముందే కార్యకర్తలు, నాయకులు బైఠాయించి నిరసన తెలిపారు. పార్టీ కోసం పనిచేస్తున్నవారు, సీనియర్ నాయకులను కాదని ఇష్టారాజ్యంగా కార్పొరేషన్ టిక్కెట్లు అమ్ముకున్నారని వారు ఆరోపిస్తున్నారు. స్థానిక నాయకుడు ఎండల సుధాకర్, స్వామి యాదవ్, గంగోనె గంగాధర్, నారాయణ యాదవ్, నాగరాజు, సుగుణ, పుష్పలత, సరిత, తదితరులతోపాటు 200 మంది బిజెపి నాయకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేస్తూ రాష్ట్ర నాయకులను నిలదీశారు. టిక్కెట్ల కేటాయింపులో నిధులు చేతులు మారాయని, దీనిపై విచారణ చేపడితే వాస్తవాలు వెల్లడవుతాయని నిజామాబాద్‌కు చెందిన సీనియర్ నేతలు ఆరోపిస్తున్నారు. గత రెండు రోజులుగా ఒకే వర్గానికి టిక్కెట్లు కేటాయిస్తున్నారంటూ ఎంపికి వ్యతిరేకంగా ఆందోళనలతో ఉన్నారు.

బిజెపి మాజీ ఎంఎల్‌ఎ ఎండల లక్ష్మీనారాయణతోపాటు ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్‌పాల్ సూర్యనారాయణ సూచించిన పేర్లను పక్కనబెట్టారనేది కార్యకర్తల ప్రధాన వాదనగా ఉన్నది. ఎంపి అరవింద్ మద్దతుదారులుగా చెప్పుకునే మాజీ కార్పొరేటర్ భర్త టిక్కెట్ల కేటాయింపులో కీలక పాత్ర పోషించారంటూ పార్టీ వర్గాలు విమర్శిస్తున్నాయి. ఎంపి సూచించిన పేర్లనే ఎంపికచేస్తూ మిగతా అభ్యర్థులను పక్కనపెట్టడంపై వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ మేరకు మొదటి జాబితా 18 మందితో విడుదల చేయగా మిగతా జాబితా విడుదలచేయడానికి బిజెపిలో ఆందోళన మరింత పెరిగిందని అరవింద్‌తో తాడోపేడో తేల్చుకునేందుకు బిజెపి ముఖ్య నేతలు హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకుంటున్నారని కార్యకర్తలు వెల్లడిస్తున్నారు.

Arvind sold tickets
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News