దుబాయి: ఆసియాకప్‌లో భాగంగా ఆదివారం జరిగే సూపర్4 రెండో మ్యాచ్‌కు చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్‌లు సిద్ధమయ్యాయి. ఇరు జట్లు ఇప్పటికే లీగ్ దశలో పోటీపడ్డాయి. ఆ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇదే సంప్రదాయాన్ని సూపర్4లోనూ కొనసాగించాలనే పట్టుదలతో భారత్ ఉంది. పాకిస్థాన్ కూడా విజయమే లక్షంగా పెట్టుకుంది. లీగ్ దశలో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకోవాలని తహతహలాడుతోంది. అయితే వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియాను ఓడించాలంటే పాకిస్థాన్ సర్వం ఒడ్డి పోరాడక తప్పదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారత్‌ను ఓడించడం పాక్‌కు శక్తికి మించిన పనిగానే విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
శుభారంభం దక్కాల్సిందే..
ఈ మ్యాచ్‌లో భారత్‌కు ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్లు కీలకంగా మారారు. జట్టుకు శుభారంభం అందించాల్సిన బాధ్యత వీరిపై నెలకొంది. ఒమన్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ నిరాశ పరిచాడు. అభిషేక్ ధాటిగానే ఆడినా దాన్ని భారీ స్కోరుగా మలచుకోలేక పోయాడు. కీలకమైన ఈ మ్యాచ్‌లో అభిషేక్, గిల్లు తమ బ్యాట్లకు పనిచెప్పక తప్పదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా వీరికుంది. దీంతో ఈ మ్యాచ్‌లో ఓపెనర్లపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజు శాంసన్ అర్ధ సెంచరీతో రాణించడం టీమిండియాకు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. శాంసన్ గాడిలో పడడం జట్టుకు శుభపరిణామమే.
ఈ మ్యాచ్‌లో కూడా శాంసన్ నుంచి జట్టు భారీ ఇన్నింగ్స్‌ను ఆశిస్తోంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా జట్టును ముందుండి నడిపించాల్సి ఉంది. సూర్యకుమార్ తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే టీమిండియాకు భారీ స్కోరు ఖాయం. తిలక్ వర్మ, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె వంటి మ్యాచ్ విన్నర్ బ్యాటర్లు జట్టులో ఉన్నారు. వీరు తమవంతు పాత్రను సమర్థంగా పోషిస్తే ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ బౌలర్లకు కష్టాలు తప్పక పోవచ్చు. బౌలింగ్‌లోనూ టీమిండియా బాగానే ఉంది. కుల్దీప్ యాదవ్; బుమ్రా, హార్దిక్, దూబె, వరుణ్ చక్రవర్తి వంటి స్టార్ బౌలర్లు జట్టులో ఉన్నారు. వీరు చెలరేగితే జట్టుకు విజయం నల్లేరుపై నడకేనని చెప్పాలి. రెండు విభాగాల్లోనూ చాలా బలంగా ఉన్న భారత జట్టు ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
తక్కువ అంచనా వేయలేం..
మరోవైపు పాకిస్థాన్‌ను కూడా తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లు జట్టులో ఉన్నారు. లీగ్ దశలో చేసిన పొరపాట్లకు తావులేకుండా ఈసారి మెరుగైన ప్రదర్శన చేయాలనే పట్టుదలతో పాక్ ఆటగాళ్లు ఉన్నారు. సమష్టిగా రాణించి టీమిండియాను దెబ్బతీయాలనే వ్యూహంతో వారు కనిపిస్తున్నారు. సల్మాన్ ఆఘా, ఫహీం అశ్రఫ్, ఫకర్ జమాన్, మహ్మద్ హారిస్, హారిస్ రవూఫ్, హసన్ అలీ, సైమ్ అయుబ్, షహీన్ అఫ్రిది తదితరులతో పాక్ బలంగానే కనిపిస్తోంది. పాక్ ఆటగాళ్లు తమ మార్క్ ఆటతో ఆడితే టీమిండియాకు కష్టాలు ఖాయమని చెప్పాలి. కానీ వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత జట్టును కట్టడి చేసి విజయం సాధించడం పాక్‌కు అంతే తేలికేం కాదని విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు.
Also Read: మంధాన శతకం వృథా.. ఆస్ట్రేలియాపై పోరాడి ఓడిన భారత్