Friday, March 29, 2024

ఆస్ట్రేలియా అదరహో..

- Advertisement -
- Advertisement -
Australia
కదం తొక్కిన వార్నర్, ఫించ్, తొలి వన్డేలో భారత్ చిత్తు

ముంబై: వరుస విజయాలతో ఎదురులేని శక్తిగా మారిన టీమిండియాకు ఆస్ట్రేలియా దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ముంబై వేదికగా మంగళవారం జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా పది వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా 10 ఆధిక్యాన్ని అందుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆతిథ్య భారత జట్టు ప్రత్యర్థి బౌలర్ల ధాటికి తట్టుకోలేక 49.1 ఓవర్లలో 255 పరుగులకే కుప్పకూలింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 37.4 ఓవర్లలనే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, అరోన్ ఫించ్‌లు అజేయ శతకాలతో ఆస్ట్రేలియాకు రికార్డు విజయాన్ని అందించారు. మరోవైపు భారత బౌలర్లు చెత్త బౌలింగ్‌తో నిరాశ పరిచారు.

ఫించ్ దూకుడు

ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు అరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్‌లు శుభారంభం అందించారు. ఆరంభంలో వార్నర్ డిఫెన్స్‌కే పరిమితం కాగా, కెప్టెన్ ఫించ్ మాత్రం అడపాదడపా బౌండరీలతో స్కోరును పరిగెత్తించాడు. ఇద్దరు భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ఈ జోడీపై ఒత్తిడి తెచ్చేందుకు భారత బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఒక్కటి కూడా ఫలించలేదు. మరోవైపు వార్నర్ సమన్వయంతో ఆడగా ఫించ్ తన మార్క్ షాట్లతో అలరించాడు. భారత బౌలర్లను హడలెత్తిస్తూ ముందుకు సాగాడు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే చెత్త బంతులను బౌండరీలుగా మలుస్తూ స్కోరు వేగం తగ్గకుండా చూశాడు. ఫించ్ చెలరేగి ఆడడంతో ఆస్ట్రేలియా స్కోరు 7.1 ఓవర్లలోనే 50కి చేరింది.

వార్నర్ జోరు

ఈ దశలో వార్నర్ కూడా దూకుడును పెంచాడు. భారత బౌలర్లను హడలెత్తిస్తూ స్కోరును పరిగెత్తించాడు. ఇటు ఫించ్, అటు వార్నర్ దూకుడుగా ఆడడంతో స్కోరు వేగంగా పరిగెత్తింది. మరోవైపు వీరిని కట్టడి చేసేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. ఆరంభంలో కాస్త సమన్వయాన్ని కనబరిచిన వార్నర్ నిలదొక్కుకున్న తర్వాత బ్యాట్‌ను ఝులిపించాడు. దీంతో భారత బౌలర్ల కష్టాలు రెట్టింపుఅయ్యాయి. చెలరేగి ఆడిన 40 బంతుల్లోనే ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో అర్ధ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. కొద్ది సేపటికే ఫించ్ కూడా దీన్ని సాధించాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన ఫించ్ 8 ఫోర్లు, సిక్సర్‌తో అర్ధ సెంచరీని పూర్తి చేశాడు.

వీర విహారం

ఆ తర్వాత ఆస్ట్రేలియా ఓపెనర్లు వెనుదిరిగి చూడలేదు. ఇటు వార్నర్, అటు ఫించ్‌లు చెలరేగి పోవడంతో భారత బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. వికెట్లను తీయాలనే వారి ప్రయత్నాలపై ఆస్ట్రేలియా ఓపెనర్లు నీళ్లు చల్లారు. ఇదే క్రమంలో ఇద్దరు కలిసి 22.4 ఓవర్లలోనే జట్టు స్కోరును 150 పరుగులు దాటించారు. మరోవైపు వార్నర్ తన మార్క్ షాట్లతో విజృంభించడంతో భారత బౌలర్లు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఏ బౌలర్ కూడా వీరిపై పెద్దగా ప్రభావం చూపలేక పోయాడు. స్పిన్నర్లు కుల్దీప్, రవీంద్ర జడేజాలు మాత్రమే కాస్త పొదుపుగా బౌలింగ్ చేశారు. అయినా వికెట్లు తీయడంలో మాత్రం విఫలమయ్యారు. మరోవైపు వార్నర్ తన జోరును కొనసాగిస్తూ స్కోరును పరిగెత్తించాడు.

వార్నర్ దూకుడుగా ఆడడంతో ఆస్ట్రేలియా ఏమాత్రం కష్టపడకుండానే లక్షం దిశగా సాగింది. చెలరేగి ఆడిన వార్నర్ 12 ఫోర్లు, మూడు సిక్సర్లతో 88 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. అంతేగాక ఆస్ట్రేలియా స్కోరును 200 పరుగులకు చేర్చాడు. కొద్ది సేపటికే ఫించ్ కూడా సెంచరీని పూర్తి చేశాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన ఫించ్ రెండు సిక్సర్లు, 12 ఫోర్లతో 108 బంతుల్లో సెంచరీ సాధించాడు.

కీలక ఇన్నింగ్స్ ఆడిన వార్నర్ 112 బంతుల్లోనే 17 ఫోర్లు, మూడు సిక్సర్లతో 128 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరోవైపు కెప్టెన్ అరోన్ ఫించ్ 114 బంతుల్లో 13 ఫోర్లు, మరో రెండు సిక్సర్లతో 110 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. దీంతో ఆస్ట్రేలియా 37.4 ఓవర్లలోనే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే పది వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఇదే క్రమంలో ఫించ్, వార్నర్‌లు తొలి వికెట్‌కు అజేయంగా 258 పరుగులు జోడించి కొత్త రికార్డును సృష్టించారు. భారత జట్టుపై ఏ వికెట్‌కైనా ఇదే అత్యంత పెద్ద భాగస్వామ్యం కావడం విశేషం.

ధావన్, రాహుల్ రాణించినా

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో ఆస్ట్రేలియా బౌలర్లు సఫలమయ్యారు. ఓపెనర్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. రెండు ఫోర్లతో పది పరుగులు చేసిన రోహిత్‌ను స్టార్క్ వెనక్కి పంపాడు. అయితే తర్వాత వచ్చిన లోకేశ్ రాహుల్‌తో కలిసి మరో ఓపెనర్ శిఖర్ ధావన్ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు. ఇద్దరు ఆస్ట్రేలియా బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ఇద్దరు కుదురు కోవడంతో భారత్ కోలుకుంది. ఇటు రాహుల్, అటు ధావన్ మెరుగ్గా ఆడడంతో భారత్ భారీ స్కోరు దిశగా అడుగులు వేసింది.

ఇదే క్రమంలో జట్టు స్కోరు వంద పరుగులు దాటించారు. కానీ, 4 ఫోర్లతో 47 పరుగులు చేసిన రాహుల్‌ను అగర్ వెనక్కి పంపాడు. ఆ తర్వాత భారత వికెట్ల పతనం ప్రారంభమైంది. ఆ వెంటనే ధావన్ కూడా ఔటయ్యాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన ధావన్ 91 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్‌తో 74 పరుగులు సాధించాడు. కెప్టెన్ విరాట్ కోహ్లి (16) నిరాశ పరిచాడు. మిగతావారు కూడా విఫలం కావడంతో భారత్ ఇన్నింగ్స్ 255 పరుగులకే ముగిసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ మూడు, కమిన్స్, రిచర్డ్‌సన్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

Australia beat India by 10 wickets

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News