Sunday, September 21, 2025

తెలంగాణ పూలసింగిడి బతుకమ్మ

- Advertisement -
- Advertisement -

పల్లె, పట్నం యావత్ తెలంగాణ కూడళ్ళు ఆడపడుచుల వేడుకలై, పూలసింగిడులై సందడి చేయబోతున్నాయి. తొమ్మిది రోజుల పాటు ఆటపాటలతో కష్ట, సుఖాల మధ్య ఆటవిడుపుగా ఆత్మీయ బంధాల సమ్మేళనంగా సాగే ‘బతుకమ్మ పండుగ’ నేటి నుంచి మొదలవుతుంది. ప్రకృతి సంబంధాలు, మానవ సంబంధాల మేళవింపు ఉత్సవంగా ఈ బతుకమ్మ పండుగ ఉంటుంది. అనేక జీవరాశుల మనుగడకు కారణభూతమైన భూమి ని, నీరుని గౌరవించి, పూజించే సంస్కృతి బొడ్డెమ్మ పండుగ, బతుకమ్మ పండుగల్లో కన్పిస్తుంది. మన పూర్వీకులను గుర్తుచేసుకుని పూజించటం పెత్తరామవాస్య రోజున జరుపుకుంటారు. భూమిమీద పండిన పంటలను, పూసిన పువ్వులను పూజించడం బతుకమ్మ పండుగలో కనిపిస్తుంది. భూమి, నీరు, చెట్లు, పూలు ఇవన్నీ సృష్టి , సృజనాత్మకతకు సంబంధించిన ప్రకృతి సంబంధాలను తెలియజేస్తున్నాయి.

ఇక ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళల ఆటపాటల్లోని కథలు అన్నాచెల్లెలు, అత్తాకోడలు, అన్నదమ్ములు, తల్లిదండ్రులు, బావమరదలు, చారిత్రక, సామాజిక అంశాల పైన ఉంటాయి. ఇవన్నీ సమాజంలో మనుషుల మధ్య జరిగే కష్ట-సుఖాలు, మంచి- చెడుల జాగ్రత్తలు, మానవ సంబంధాల గురించిన కథనాలు ఉంటాయి. బతుకమ్మ పండుగను పరిశీలిస్తే ప్రకృతి సంబంధాలు, మానవ సంబంధాలతో పాటు చారిత్రిక, పౌరాణికమైన అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. రాక్షస రాజైన మహిషాసురుని దుశ్చర్యలను అడ్డుకోవడానికి శక్తి స్వరూపిణి అయిన గౌరీ దేవి అతనితో యుద్ధం చేసి అతన్ని వధించి అలసిపోయి స్పృహ కోల్పోయింది. ఆ సన్నివేశంలో అమ్మవారిని మేల్కొలిపి తమను రక్షించాలని భక్తులు ప్రార్థించారు. రకరకాల పూలతో, నైవేద్యాలతో తొమ్మిది రోజుల ప్రార్థన తర్వాత అమ్మవారు మేల్కొందని విశ్వాసం.

ఈ బతుకమ్మ పండుగ భాద్రపద మాసాంతంలో వచ్చే మహాలయ అమావాస్య, అశ్వీయుజ మాస శుద్ధ పాండ్యమి ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మ వరకు తొమ్మిది రోజులపాటు కొనసాగుతుంది. బతుకమ్మ అంటే కలకాలం జీవించు అని అర్థం. జానపద గేయ సాహిత్యంలో ఈ పండుగ నేపథ్యం చరిత్రపరంగా చోళ దేశరాజకు ధర్మాంగదుడు, సత్యవతి దంపతులు నూరు నోములు నోచి నూరుగురు పుత్రులను కన్నారు. కానీ ఆ నూరుగురు శత్రువులచే హతులైనారు. ఆ దుఃఖంతో వారు రాజ్యాన్ని వదిలి అడవికి వెళ్లి లక్ష్మీదేవిని గురించి తపస్సు చేశారు. వారి తపస్సుకు లక్ష్మీదేవి ప్రసన్నం కాగా, వారి కోరిక మేరకు సత్యవతి గర్భంలో లక్ష్మీదేవియే కూతురుగా జన్మించింది. ఆమె చిరంజీవిగా జీవించాలని ‘బతుకమ్మ’ అని పేరుపెట్టారు. పండుగ జరుపుకునే ఆనవాయితీ మారింది. మరో కథనం ప్రకారం ఒక కాపు దంపతులకు ఆరుగురు పిల్లలు పుట్టి పురిట్లోనే చనిపోయారు. ఏడో బిడ్డ పుట్టగానే ఆ దంపతులు ఆమెను ‘బతుకమ్మ’ అంటూ వేడుకున్నారు. ఆ కూతురు బతికిబట్ట కట్టింది. అనంతరం వారికి ఓ మగ బిడ్డ జన్మించాడు. వారు అక్కా, తమ్ముళ్లుగా పెరిగి పెద్దవాళ్ళు అయినారు. బతుకమ్మ పండుగపై ఆయా వర్గాలకు సంబంధించిన వేర్వేరు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ అస్తిత్వానికి, ఉద్యమానికి ప్రతీకగా బతుకమ్మ నిలిచింది.

ఈ తొమ్మిది రోజులు బతకమ్మను తంగేడు, గునుగు, కట్ల, రుద్రాక్ష, గోరింటా, బొడ్డుమల్లె, బంతి, చామంతి, గడ్డి, గుమ్మడి పూలతో పేరుస్తారు. ఆరో రోజు ‘అర్రెం’ అని బతుకమ్మను పేర్చరు. మొదటి రోజు నుండి చివరి రోజు అయిన సద్దుల బతుకమ్మ వరకు ప్రతిరోజు వేరువేరు ప్రసాదాలను నైవేద్యంగా పెడతారు. మొక్కజొన్నలు, పేలాలు, నువ్వులు, పెసర్లు, శనగలు, సజ్జలు లాంటి ధాన్యాలతో కూడిన ప్రసాదాలను తయారు చేస్తారు. ప్రతి రోజూ సాయంత్రం వరకు మహిళలంతా ముస్తాబై బతుకమ్మ ఆడే కూడళ్ళకు పేర్చిన బతుకమ్మలతో చేరుకుంటారు. వాటిని మధ్యలో పెట్టి మహిళలు వాటి చుట్టూ తిరుగుతూ ఒక క్రమపద్ధతిలో చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ ఆడుతారు. చీరె, సారెలతో ఆడబిడ్డలను అత్తారింటి నుంచి పుట్టినింటికి తీసుకువస్తారు.

కొత్త బట్టలతో మహిళల కోలాహలాలు ప్రతి ఇంటా కన్పిస్తాయి. కూడళ్ళన్నీ పూలసింగిడులై ఆడపడుచుల ఆనందోత్సాహాలతో ఆత్మీయ బంధాల సమ్మేళనంగా కనబడతాయి. జానపద కళా ఉత్సవాల అపూర్వ వేడుకలుగా, మానవ సంబంధాల పాటలతో మార్మోగిపోతాయి. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, చల్లంగ చూడమ్మ ఉయ్యాలో కాంతలందరినీ ఉయ్యాలో, నిండు ముత్తయిదువలుగా ఉయ్యాలో దీవించు గౌరమ్మ ఉయ్యాలో అనుకుంట వరలక్ష్మిఉయ్యాలో బతుకమ్మ పట్టుకా ఉయ్యాలో బయలుదేరినాది ఉయ్యాలో కాంతలందరూ గూడి ఉయ్యాలో బతుకమ్మ చుట్టూ ఉయ్యాలో ఆడుతూ పాడుతూ ఉయ్యాలో ఇట్లా వాడ వాడలా, బతుకమ్మ ఆట పాటలు సందడి చేయనున్నాయి.

నర్రా భగవాన్ రెడ్డి, 94929 13165

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News