Friday, April 26, 2024

ప్రేమల్లో సినిమా

- Advertisement -
- Advertisement -

valentine-day-2020

లవ్..రొమాన్స్ అనే జోనర్‌కు ప్రపంచమంతా ఫాలోయింగ్ ఉంది.
స్టార్ హీరోహీరోయిన్లు ఉన్నా లేకున్నా
ప్రేమ కథ బాగుంటే చాలు సినిమా హిట్టే…
లెక్కలేనన్ని అద్భుతమైన ప్రేమకథలతో సినిమాలొచ్చాయి.
వస్తూనే ఉన్నాయి.
ప్రేమకథల్లేని సినిమాలు వేళ్లమీద లెక్క పెట్టొచ్చు..
ప్రేమలోని భిన్న కోణాలను చూపించే కథలు ఎన్నెన్నో….
ఒకప్పుడు లైలామజ్ను, దేవదాసులాంటి భగ్నప్రేమికులపై సినిమాలొచ్చాయి.
తర్వాత సఫలమైన ప్రేమలు…
స్నేహం నుంచి ప్రేమ చిగురించడం…
ద్వేషంలోంచి ప్రేమ పుట్టి,
నిండా మునగడం….
త్యాగానికి ప్రతిరూపంగా చూపే ప్రేమకథలున్న సినిమాలు మరికొన్ని…
అప్పటి నుంచి ఇప్పటివరకూ ప్రేమ సినిమాలకు ప్రేక్షకులు నీరాజనాలు పడుతూనే ఉన్నారు.
ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే సందర్భంగా తెలుగులో ప్రేమకథలతో తెరకెక్కిన
కొన్ని గొప్ప సినిమాలను చూద్దాం..

అలనాటి లైలామజ్ను నుంచి ఇప్పటి జాను వరకు ప్రేమ కథలకు ఎప్పుడూ డిమాండే. ప్రేమలో అడ్డంకులు, అవరోధాలు సహజం. ప్రేమలోని ఆనందం అనుభవించేవారికే తెలుస్తుంది. ప్రేమలో పడ్డవారికి ఎక్కడలేని ధైర్యం, పట్టుదల, మొండితనం వచ్చేస్తాయి. ప్రేమకోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతుంటారు. పాతాళభైరవిలో రాకుమారి ఓ తోటరాముణ్ణి ప్రేమించి పెద్ద సాహసమే చేసింది. “సాహసం సేయరా ఢింబకా రాజకుమారి లభిస్తుంది” అంటూ ప్రోత్సహించే మాంత్రికుడి మాటల్ని కూడా గుడ్డిగా నమ్మేస్తాడు కథానాయకుడు.“ప్రేమ కోసమై వలలో పడెనే పాపం పసివాడు” అంటూ ప్రేక్షకుల చేత బోలెడంత జాలి, సానుభూతి సంపాదించాడు. సుఖాంతమైన ఈ కథ ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో పదిలంగా ఉంది.
మిస్సమ్మలో టీచరమ్మగా సావిత్రి, పంతులుగా ఎన్టీఆర్‌లు ఒకే ఇంట్లో దంపతులుగా ఉద్యోగం కోసం నాటకమాడుతుంటారు. ఎప్పుడు పడతారోగానీ ఇద్దరూ ప్రేమలో పడతారు. “రావోయి చందమామ మా వింత గాథ వినుమా” అంటూ పాడుకుంటూ హొయలుపోతారు.

ప్రేమ అంటే శోకం, వేదన, మరణయాతన అని కూడా చూపిన ఓ కొత్తరకం ప్రేమను పంచాడు దేవదాసు. చిన్నప్పటి స్నేహితురాలి ప్రేమను దక్కించుకోలేక దేవదాసుగా మారిన పాత్రలో ఏఎన్‌ఆర్ జీవించాడనే చెప్పొచ్చు.
ఈ ప్రేమికుడిలో “కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్‌” అనే తాత్వికత కనిపిస్తోంది. మత్తులో చిత్తయి చివరికి మరణంతో ముగిసి ప్రేక్షకుల హృదయాలను పిండేస్తుందీ సినిమా. ఇప్పటికీ అమర ప్రేమికులను దేవదాసు పార్వతిలతో పోలుస్తారు. ప్రేమలో పడ్డవాళ్లకు నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయంటాడు మూగమనసుల్లో నాయకుడు. ప్రేమ సందేశానికి ఏకంగా మేఘాన్నే ఎంచుకున్నాడు మల్లీశ్వరి కథానాయకుడు ఎన్టీఆర్. “ఏడతానున్నాడో బావా జాడ తెలిసిన పోయి రావా అందాల ఓ మేఘమాలా” అని భానుమతి పాడే తీరు ప్రియుని ఎడబాటుకు పరాకాష్ట. “అందాల ఓ చిలుకా అందుకో నాలేఖా” అంటూ పిబి శ్రీనివాస్ పాట ఇప్పటికీ శ్రోతలకు వీనులవిందే. ఈ పాతకాలంనాటి ప్రేమికుల్లో ప్రేయసీప్రియులు చూపులతో, సైగలతోనే ప్రేమించు కుంటారు. ప్రేయసి వ్యక్తిత్వానికి ఎంతో విలువనిచ్చారు. ప్రేయసి తన ప్రేమను అంగీకరించేవరకూ ఎదురుచూసేవారు. ఒకవేళ ప్రేమించుకున్నా పెళ్లి చేసుకోలేని పరిస్థితి వస్తే “నీ సుఖమే నే కోరుకున్నా నినువీడి అందుకే వెళుతున్నా…అంటూ ఆమె హితాన్నే కోరుకునేవారు.

కాలంతోపాటు ప్రేమల తీరూ మారింది. ప్రేమలో అంతరాలు ఉండవనే భావనలు పెరిగాయి. ప్రేమకు భాష, రాష్ట్రంతో పనిలేదన్నారు. అలా వచ్చిందే కమల్ సరితల మరోచరిత్ర. ఓ తమిళ అబ్బాయికి, తెలుగమ్మాయికి మధ్య జరిగే ప్రేమ కథే ఇది. మరోచరిత్ర నిజంగా మరో ప్రేమచరిత్రే. ఈ సినిమా వచ్చిన కొత్తలో చాలామంది ప్రేమికులు ఇందులోని నాయికా నాయకులను ఆదర్శంగా తీసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటనలున్నాయి.

శోభన్‌బాబు సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లు ఉండాల్సిందే. ఒకరు ప్రియురాలు, మరొకరు ఇల్లాలుగా. మహిళల కలల రాకుమారుడు శోభన్. అనుకోని పరిస్థితుల్లో ఇద్దర్ని కనిపెట్టుకుని ఉండాల్సిన పరిస్థితి శోభన్ సినిమాల్లో కనిపిస్తుంది. అయ్యో ఎవరికీ అన్యాయం చేయకూడదనే అనుకునే ప్రేక్షకులు ఉండేవారు. ఇద్దర్నీ హీరో ఏలుకోవాలని దండం పెట్టుకునేవాళ్లే ఎక్కువ. కోడెనాగు, కార్తీక దీపం, ఇల్లాలు, దేవత, సోగ్గాడు, మల్లెపువ్వు, స్వయంవరం, గోరింటాకు, రాధాకృష్ణ, శ్రావణసంధ్య, చండీప్రియ….ఇలాంటి సినిమాల్లో ప్రేమకు పట్టంకట్టాడు శోభన్.

అనంతరం కొత్త తరం ప్రేమకథలొచ్చాయి. నరేష్, పూర్ణిమ, ప్రదీప్, తులసిలాంటి కొత్త నటీనటులతో జంధ్యాల తీసిన నాలుగుస్తంభాలాట కొత్త ఒరవడిని సృష్టించింది. ప్రేమకు ధైర్యం కూడా అవసరమని చెప్పింది. కాలేజీ వయసులోనే ప్రేమించుకునే తరాన్ని ముద్దమందారం సినిమా పరిచయం చేసింది. ఇందులోని ప్రేమికులు ఇంట్లోంచి పారిపోయి పెళ్లిచేసుకున్నారు. వయసుకు శరీరానికి అవతల ఉన్న ఆరాధనా భావాన్ని చూపించారు.
అనంతరం నాగార్జున, వెంకటేష్‌ల యుగం మొదలైంది. నాగార్జున గీతాంజలి మృత్యువు ప్రేమను నిరోధించలేదని చెప్పింది. హీరో చనిపోతాడని తెలిసినా హీరోయిన్ చనిపోతుందని తెలిసినా ప్రేమ బతికే ఉంటుందన్న నమ్మకాన్ని కలిగించిందీ సినిమా. వెంకటేష్ ప్రేమ సినిమా ప్రేమ పవర్‌ను చూపించింది. చివరలో హీరోయిన్‌ను చంపడం ప్రేక్షకులకు నచ్చకపోయవడంతో తిరిగి బతికించాల్సి వచ్చింది దర్శకుడికి. ఇక చిరంజీవి రుద్రవీణను తీసుకుంటే ఊరికోసం తన ప్రేమనే త్యాగం చేస్తాడు కథానాయకుడు. ప్రేమ ఫలించడం కోసం హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసి వచ్చిన యువకుడిగా రాజేంద్రప్రసాద్ ముత్యమంత ముద్దులో కనిపిస్తాడు. సాగరసంగమంలో కమల్‌హాసన్, జయప్రదల మూగప్రేమను విశ్వనాథ్ అద్భుతంగా ఆవిష్కరించాడు.

తర్వాత తరం సినిమాల్లో తొలిప్రేమ పెద్ద హిట్. ప్రేమ సత్యమైనదే అయితే గెలిచే తీరుతుందని ఈ సినిమా చెప్తుంది. ప్రేమలో అమాయకత్వం అంతా తొలిప్రేమ సినిమాలో కనిపిస్తుంది. మొదటిసారి ప్రేమలో పడినప్పుడు ఎలా ఉంటుంది, ప్రేమించిన వ్యక్తిని చూడటానికి ఎంత ఆరాటపడతారు, ప్రేమను చెప్పడానికి ఎంత కష్టపడతారు.. ఇవన్నీ ఈ సినిమాలో కనిపిస్తాయి. దర్శకుడు తేజ సినిమాలైన చిత్రం, నువ్వు నేనూ, జయం లాంటివన్నీ ప్రేమ దుమారం రేపినవే. మనసంతా నువ్వే కుర్రాళ్లను ప్రేమలో పడేలా చేసింది. కొత్త బంగారులోకంలో చదువు పూర్తి చేసుకుని కెరీర్‌లో స్థిరపడ్డాకే పెళ్లికి రెడీ అయిన ప్రేమికుల జంట కనిపిస్తారు. ఏమాయ చేసావే , ఎటో వెళ్లిపోయింది మనసూ, అందాల రాక్షసి, నేను శైలజ, మళ్లీ మళ్లీ ఇదిరానిరోజు, గీత గోవిందం, అర్జున్ రెడ్డి ఇవన్నీ ప్రేక్షకులకు ప్రేమను పంచినవే.

“నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు. నా ప్రేమను ఫీల్ అవ్వు” అంటూ ఆర్య అనే యువకుడు తన ప్రేమను చెప్తాడు. ఆర్య ఒక కొత్త ప్రేమకథ. ఇలా కూడా ప్రేమ ఉంటుందా అన్నట్టుగా ఈ కథ నడుస్తుంది. చివరికి సుఖాంతమే అయినా, అంతవరకూ ఈ ప్రేమకథలో చాలా గమ్మత్తైన మలుపులు ఉంటాయి.
ప్రేమలో ఎంత ప్రేమ ఉంటుందో, అందే బాధ కూడా ఉంటుంది. ఆ బాధను చెప్పే సినిమా ‘అర్జున్ రెడ్డి’. ప్రేమించిన అమ్మాయి అకస్మాత్తుగా దూరమైతే అర్జున్ రెడ్డి అనే ఒక వ్యక్తి జీవితమంతా తలకిందులు అయిపోతుంది. కొన్ని నెలలపాటు తనలో తానే నరకం అనుభవిస్తాడు. ప్రేమకథల్లో ఒక కొత్త కోణం ఈ సినిమా.

ప్రపంచంలోనే అతిపెద్ద నౌక టైటానిక్. టైటానిక్ నిజంగా మునిగిపోయిన నౌక. దీన్ని నేపథ్యంగా తీసుకుని దర్శకుడు జేమ్స్ కేమరూన్ చెప్పిన ప్రేమకథే ‘టైటానిక్’. మునిగిపోయే నౌకలో ఇద్దరి ప్రేమకథను ఈ సినిమాలో చూడొచ్చు. ప్రపంచ సినీ చరిత్రలో టైటానిక్‌కు ఎంత పేరుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
ఇది ఈ తరం ప్రేమకథ. ఈ కథలో ఎన్ని అలకలు ఉంటాయో, అంతే ప్రేమ ఉంటుంది. తెలుగులో వచ్చిన బెస్ట్ రొమాంటిక్ సినిమాల్లో ‘ ఏమాయ చేశావే’కి ఎప్పుడూ స్థానం ఉంటుంది.
‘ఈ ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలు ఉంటే, నేను నిన్నే ఎందుకు?’ అని అడుగుతాడు హీరో. ప్రేమ కథల్లో ఉండే మ్యాజిక్ అంతా ఈ సినిమాలో ఉంటుంది.

జీవితంలో మూడు దశల్లో తను ప్రేమించిన ముగ్గురు అమ్మాయిలను గుర్తు చేసుకుంటూ ఒక వ్యక్తి చేసే ప్రయాణమే ‘ నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్’. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా అంతా ప్రేమే ఉంటుంది. ప్రేమలోని అమాయకత్వం ఉంటుంది. బాధ ఉంటుంది. త్యాగం కూడా ఉంటుంది.
ఇలాంటిదే కథతో మలయాళంలో తెరకెక్కిన ‘ ప్రేమమ్’ అనే సినిమా, తర్వాత తెలుగులోనూ అదే పేరుతో రీమేక్ అయ్యి హిట్ కొట్టింది.
ఇలా కొనసాగుతూనే ఉన్నాయి సినీ రంగంలో ప్రేమకథలు. అప్పటి ప్రేమ కథలతో వచ్చిన సినిమాల్లోనూ ఇంటిల్లిపాదీ కలిసి కూర్చొని చూపే విధంగా ఉండేవి. తర్వాత కూడా ఫరవాలేదు. కానీ ఈమధ్య వచ్చే కొన్ని సినిమాల్లోనూ ప్రేమ గొప్పదనాన్ని చెప్తూనే ఉన్నాయి.

Best complete love story movies in Telugu

సండే డెస్క్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News