Tuesday, April 30, 2024

ఢిల్లీలో రాష్ట్రపతి పాలనకు బిజెపి కుట్ర

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించడానికి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఢిల్లీ క్యాబినెట్ మంత్రి అతిషి శుక్రవారం ఆరోపించారు. ఆప్ ప్రభుత్వాన్ని కూల్చడానికి జరిగిన రాజకీయ కుట్రే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టని విలేకరుల సమావేశంలో ఆమె ఆరోపించారు. ఢిల్లీలో త్వరలో రాష్ట్రపతి పాలన విధించనున్నట్లు తమకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందని ఆమె చెప్పారు. ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించిన చట్టవిరుద్ధమేగాక ప్రజా తీర్పునకు వ్యతిరేకమని ఆమె తెలిపారు.

దేశ రాజధానిలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందని సూచించే పరిణామాలు ఇటీవలి కాలంలో చాలా జరిగాయని అతిషి తెలిపారు. గత కొద్ది నెలలుగా సీనియర్ ఐఎఎస్ అధికారి ఎవరినీ ఢిల్లీలో నియమించలేదని ఆమె తెలిపారు. వివిధ శాఖలలో అనేక ఖాళీలు నెలల తరబడి భర్తీ కావడం లేదని, ఎన్నికల నియమావళి పేరుతో మంత్రుల సమావేశాలకు అధికారులు హాజరు కావడం లేదని ఆమె చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వ నిర్వహణపై కేంద్ర హోం శాఖకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ లేఖలు రాస్తున్నారని ఆమె చెప్పారు.

ఢిల్లీలో అధికారంలోకి రాలేమన్న విషయం బిజెపికి ఎప్పడో తెలుసునని ఆమె వ్యాఖ్యానించారు. 2015, 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపిని ఆప్ ఓడించిందని, ఈ కారణంగానే ఆప్ ప్రభుత్వాన్ని కూల్చివేయాలని బిజెపి భావిస్తోందని ఆమె ఆరోపించారు. అసెంబ్లీలో మెజారిటీ సభ్యుల బలమున్న ఆప్ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించడం చట్ట విరుద్ధమేగాక ప్రజా తీర్పును వ్యతిరేకించడమేనని అతిషి అన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 17న అసెంబ్లీలో తమ బలాన్ని కూడా నిరూపించుకున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. కాగా..ఈ ఆరోపణలపై ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ స్పందిస్తూ అసెంబ్లీలో 62 మంది సభ్యుల బలం ఉన్న ఆప్‌ను రాష్ట్రపతి పాలన భయం వెన్నాడుతుండడం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి పదవి నుంచి అరవింద్ కేజ్రీవాల్ తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఢిల్లీ హైకోర్టులో ఎదురైన ఎదురుదెబ్బలకు కేజ్రీవాల్ నిస్పృహ చెంది దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారని సచ్‌దేవ విమర్శించారు. బిజెపిలో చేరాలని తనను బెదిరించారంటూ తప్పుడు కథనాలు చెప్పిన అతిషి ఇప్పుడు కొత్త కట్టుకథను చెబుతున్నారని సచ్‌దేవ ఆరోపించారు. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ప్రభుత్వ పగ్గాలను వేరే వారికి అప్పగించి పాలన సక్రమంగా జరిగేలా చూడాలని ఆయన హితవు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News