Friday, December 2, 2022

బిజెపికి యుపి బిపి

- Advertisement -

మూడు రోజుల్లో 10 మంది కీలక ఒబిసి నేతల రాజీనామాలు

ముగ్గురు మంత్రులు, ఐదుగురు ఎంఎల్‌ఎల బాటలో మరికొందరు
కమలనాథుల్లో కలవరం
త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల్లోనూ ప్రతికూల పవనాలు
మరికొద్ది రోజుల్లో 12మంది మంత్రులు, 50మంది ఎంఎల్‌ఎలు బిజెపికి గుడ్‌బై ?
2024 సాధారణ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావించే రాష్ట్రాల్లో ఎదురీత
హిందుత్వ ఎజెండాకు గండం?
అఖిలేశ్‌కు పెరుగుతున్న మద్దతు

BJP leaders joined in SP

మన తెలంగాణ /న్యూఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి:  కేంద్రంలోని ఎన్‌డిఎ పాలనపై రెఫరెండం, 2024కు సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాలు, ప్రత్యేకించి కీలక ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలు కమలనాథులను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. వచ్చే నెలలో దేశంలోని ఉత్తరప్రదేశ్, పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్, గోవాలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిజెపికి అంతటా ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో మెజారిటీ సామాజిక వర్గంలో కీలకమైన బిజెపిలోని ఒబిసిలు, దళితులు యోగీ మార్క్ అగ్రకుల సానుకూల పరిపాలనను వ్యతిరేకిస్తూ తిరుగుబాటు జెండాను కొనసాగిస్తున్నారు. మూడు రోజుల్లోనే ముగ్గురు సీనియర్ మంత్రులు, ఐదుగురు ఎంఎల్‌ఎలు , మరో ఇద్దరు కీలక నేతలు వరుసగా రాజీనామాలు చేసి బిజెపికి సవాల్ విసిరారు.

మరికొద్ది రోజుల్లో 12మంది దాకా మంత్రులు, 50మంది దాకా ఎంఎల్‌ఎలు బిజెపికి గుడ్‌బై చెప్పనున్నారనే వార్తలు కమలనాథులను ఖంగుతినిపిస్తున్నాయి. ఒబిసిలో కీలకమైన సీనియర్ నేతల్లో తొలుత దారాసింగ్ చౌహాన్ ఆ తర్వాత స్వామి ప్రసాద్ మౌర్య, తాజాగా ధరంసింగ్ సైనిలు రాజీనామాలు చేసి యోగి పాలన ఒబిసిలకు, దళితులకు వ్యతిరేకంగా వుందని, అగ్ర కులాలే ఆయన ఎజెండాగా వుందని ఆరోపించారు. ఇంతటితో రాజీనామాలు ఆగవని, ఎన్నికల ముందు దాకా రాజీనామాల సీరియల్ కొనసాగుతాయని ప్రకటించడం బిజెపి అధినేతలకు నిద్రలేకుండా చేసింది. సాధారణంగా బిజెపి రాష్ట్రాల ఎన్నికల ముందు ప్రధాన ప్రత్యర్థి పార్టీల బలమైన నేతలను ఆకర్షించి రాజీనామాలు చేసే వ్యూహాన్ని అమలు చేసేది కాని దీనికి భిన్నంగా ఈసారి ఆ పార్టీ కే స్వపక్షం నుంచి రాజీనామాలు షాక్ తగిలింది.

దీనికి తోడు ప్రధాన విపక్షంగా వున్న అఖిలేశ్ యాదవ్ బిజిపియేతర పార్టీల ఫ్రంట్‌ను విజయవంతంగా ఒకే తాటిపైకి తీసుకురావడంతో యోగికి ప్రతికూలత తీవ్ర స్థాయిలో ఎదురవుతున్నది. యోగి హిందూత్వ ఎజెండాకు ఈ పరిణామం తీవ్ర శరాఘాతంగా మారి బిజెపికి చుక్కలు చూపిస్తున్నది. యుపిలో నిర్ణయాత్మక పాత్ర వహించే ముస్లింలు కాకుండా ఒబిసిలు, దళితులు కూడా వ్యతిరేకంగా మారడం బిజెపికి ముచ్చెమటలు పట్టిస్తున్నది. ఇప్పటికే రైతు వ్యతిరేక చట్టాలు విధానాలతో రైతుల నుంచి అసంతృప్తి, ఉద్యోగాలు లేక నిరుద్యోగుల తిరుగుబాటు, పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఇతర నిత్యావసర ధరలతో మధ్య తరగతి, పేద వర్గాలు కూడా బిజెపి అంటేనే మండిపడే పరిస్థితులు తలెత్తడంతో ఐదు రాష్ట్రాల సెమీఫైనల్స్‌లో బిజెపికి ఎదురీత తప్పదని పరిశీలక వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటి వరకు బిజెపిని తిరుగులేకుండా విజయ తీరాలకు చేరుస్తున్న ప్రధాని మోడీ , నెంబర్ టూ మంత్రి అమిత్ షా రాజకీయ వ్యూహాలు ఈ ఎన్నికల్లో పని చేసే అనుకూల వాతావరణం కనిపించడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో యుపి ఎన్నికల ఫలితాలే అత్యంత కీలకం.
ఇక్కడ 403 అసెంబ్లీ స్థానాలున్నాయి. మిగిలిన పంజాబ్ లో 117, ఉత్తరాఖండ్‌లో 70, మణిపూర్‌లో 60, గోవాలో 40 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. కేంద్రంలో అధికారానికి నిచ్చెన భావించే ఉత్తరప్రదేశ్‌లో అధికార పార్టీగా వున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాలనపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత పెరుగుతున్నది. ముఖ్యంగా ఆ పార్టీలోని కీలకమైన నేతలు పది మంది మూడు రోజుల వ్యవధిలోనే రాజీనామా చేయడంతో కమలనాథులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ రాజీనామాల పర్వం ఇంకా కొనసాగతుందని ఇంకా అనేక మంది మంత్రులు, ఎంఎల్‌ఎలు రాజీనామా చేయబోతున్నారనే వార్తలు మోడీ, అమిత్ షాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. ఎన్నికలకు నెల ముందు జరుగుతున్న స్వపక్ష అసంతృప్తి దావానంలా రగులుతుండడంతో ఎన్నికల ఫలితాలపై పెట్టుకున్న ఆశలను అడియాశలు చేస్తున్నాయి.

యుపిలో 12 శాతంగా వున్న బ్రాహ్మణులను బుజ్జగించడానికి ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన కాశీ కారిడార్ కూడా బిజెపికి ప్రతికూలంగా మారిన సూచనలు కనిపిస్తున్నాయి. కాశీ కారిడార్ కోసం చేస్తున్న విధ్వంసం ఇతర సామాజిక వర్గాలను బిజెపికి వ్యతిరేకంగా మారుస్తున్నది. యుపిలో యోగి ఆదిత్యనాథ్ వ్యతిరేక ఓటు చీలకుండా ప్రధాన ప్రతిపక్షంగా వున్న అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాది పార్టీ ఐక్య కూటమిని ఒకే వేదికపైకి తీసుకు రావడం, యోగి ఆదిత్యనాథ్‌ను , కేంద్రంలోని బిజెపి పాలనను వ్యతిరేకించే వర్గాలన్నీ సమాజ్ వాది పార్టీకి అనుకూలంగా మారడం ఎస్‌పికి సానుకూల వాతావరణం సృష్టిస్తున్నది. యుపిలో మరో కీలక పార్టీగా వున్న మాయావతి నాయకత్వంలోని బహుజన సమాజ్ పార్టీని ఆ పార్టీ నమ్ముకున్న సామాజిక వర్గాలు అంతగా విశ్వసించడం లేదు. యుపిలో జరిగే ముక్కోణపు సమరంలో సమాజ్ వాది పార్టీకే సానుకూల వాతావరణం వుందని ఇప్పటికే పలు సర్వేలు సూచించడం అందుకు తగినట్టుగా అక్కడ అధికార బిజెపికి వరుస షాక్‌లు తగలడం బిజెపి ముందరి కాళ్లకు బంధంగా నిలిచింది.

యుపి తర్వాత పంజాబ్‌లోనే అత్యధికంగా117 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇక్కడ కూడా ఆమ్‌ఆద్మీ, కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్, బిజెపిల మధ్య ప్రధాన పోటీ జరగబోతున్నది. ఇక్కడ అధికార పార్టీగా వున్న కాంగ్రెస్‌కు ఆమ్‌ఆద్మీ తీవ్ర సవాల్ విసురుతున్నది. కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి పీఠం నుంచి వైదొలగిని అమరిందర్ సింగ్, అకాలీదళ్‌లోని కొందరు నేతల అండతో అధికారంలోకి రావాలని బిజెపి ఆశపడుతున్నా అది అసాధ్యమని పరిశీలకులు చెబుతున్నారు. ఉత్తరాఖండ్‌లో పుష్కర్ సింగ్ దామీ నాయకత్వంలోని బిజెపికి కాంగ్రెస్ పార్టీ సవాలు విసురుతున్నది.

ఇక్కడ మూడో పక్షంగా బహుజన సమాజ్ పార్టీ కూడా రంగంలో నిలిచింది. ఈ రాష్ట్రంలో బిజెపి మూడు దఫాలుగా అధికారంలో వున్నా ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చినా అభివృద్ధి సంక్షేమంలో ముందడుగు లేదని అక్కడి ప్రజలు అసంతృప్తిగా వున్నారు. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ లో 60 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇక్కడ కూడా కాంగ్రెస్, బిజెపి, నాగా పీపుల్స్ ఫ్రంట్ మధ్య త్రిముఖ పోరు జరగబోతున్నది. బిజెపిపై వున్న వ్యతిరేకత ఇక్కడ అధికార బిజెపికి ప్రతికూలంగా మారే పరిస్థితి వున్నట్లు సర్వేలు సూచిస్తున్నాయి. కీలకమైన రాష్ట్రంగానే వున్న గోవాలో 40 సీట్లే వున్న అక్కడ అధికార బిజెపి పాలన పట్ల మెజారిటీగా వున్న కేథలిక్‌లు తీవ్ర అసంతృప్తితో వున్నారు. ఇక్కడ కాంగ్రెస్, బిజెపి, గోవా ఫార్వార్డ్ పార్టీ, ఆమ్‌ఆద్మీల మధ్య పోరు జరుగుతున్నా అధికార బిజెపికి మునుపటిలా సానుకూల పరిస్థితులు కనిపించడంలేదు. ముఖ్యమంత్రి ప్రమోద్ సామంత్ అనుసరిస్తున్న విధానాలు కేథలిక్‌లను నిరాశలో ముంచాయి. ఇవి అక్కడ బిజెపికి ప్రతికూలంగా పరిణమించాయి. బజెపి ఉత్తరాది రాష్ట్రాల్లో తమకు తిరుగులేదని ఇక దక్షిణాది రాష్ట్రాల్లోనే పాగా వేయాలని ప్రయత్నిస్తుండగా ఉత్తరాది రాష్ట్రాల పరిణామాలు దక్షిణాది సంగతి సరే ఉత్తరాదికే ఎసరు పడే రాజకీయ పరిస్థితులు రావడం ఆ పార్టీ అధినేతలకు ఊహించని పరిణామంగా చెప్పవచ్చు.

Related Articles

- Advertisement -

Latest Articles