Wednesday, October 9, 2024

జమ్మూ కశ్మీర్ ఎన్నికలకు బిజెపి మేనిఫెస్టో విడుదల

- Advertisement -
- Advertisement -

జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 ఓ చరిత్ర అని, ఇది తిరిగి వచ్చే ప్రసక్తే లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు బిజెపి మేనిఫెస్టోను శుక్రవారం ఆయన విడుదల చేశారు. ఆ తరువాత విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆర్టికల్ 370 రద్దు తరువాత జరుగుతున్న ఈ ఎన్నికలలో ప్రజలు బిజెపిని ఆదరిస్తారని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. గడిచిన పది సంవత్సరాల కాలం జమ్మూ కశ్మీర్‌తో పాటు దేశ చరిత్ర సువర్ణ అధ్యాయం అయిందని , పలు విధాలుగా ఈ ప్రాంతం శాంతి ప్రగతి సమ్మిళితంగా సాగుతోందన్నారు. ఈ ప్రక్రియ మరింత వేగవంతం కావాలంటే , సుపరిపాలన స్థిరంగా విలసిల్లాలంటే ప్రజలు తమ పార్టీకే ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 18, 25, అక్టోబర్ 1వ తేదీలలో మూడు విడతలుగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈ క్రమంలో పార్టీ తరఫున ప్రచారాన్ని వేగిరపర్చే బాధ్యతను అమిత్ షా తీసుకున్నారు. శుక్రవారం ఉదయం ఆయన ఇక్కడ రెండు రోజుల బస కోసం వచ్చారు.

ఆర్టికల్ 370 రాజ్యాంగంలో భాగం కాదని, ఇక ముందు కూడా కాబోదని స్పష్టం చేశారు. ఈ అధికరణ దుష్టశక్తులకు ఊతం ఇచ్చింది. యువత చేతిలో రాయి అయింది. వారు దీనిని ఆధారంగా చేసుకుని ఉగ్రవాదం పంథాను ఎంచుకునే వీలు కల్పించిందని విశ్లేషించారు. అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకునే ఈ ఆర్టికల్‌పై వేటేశామని హోం మంత్రి చెప్పారు. తాను ఈ ఎన్నికలకు నేషనల్ కాన్ఫరెన్స్ అజెండాను చూశామని, ఇందులో పలు ప్రమాదకర అంశాలు ఉన్నాయని చెప్పారు. ఆర్టికల్ 370ని తిరిగి తీసుకువస్తామని వారు అంటున్నారు. అయితే ఇది తేవడం వారి భ్రమ , కల్ల అని స్పష్టం చేశారు. ఏది ఏమైనా ఇక్కడి గుజ్జర్లు, బకేవాలాలు, పహాడీ వంటి ఆదివాసీల రిజర్వేషన్ల కోటా జోలికి ఎవరిని రానిచ్చేది లేదని , దీనిని ఈ నేపథ్యంలో తాను ఒమర్ అబ్దుల్లాకు చెపుతున్నానని తెలిపారు. ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో చేపట్టిన చర్యలతో ఉగ్రవాదం పూర్తిగా ఏరివేస్తామని, అంతేకాకుండా ఇక్కడ ఉగ్రవాదం తలెత్తడానికి కారకులు ఎవరు? బాధ్యత వహించాల్సింది ఎవరు? అనేది తెలియచేస్తామని వివరించారు. ఈ క్రమంలో టెర్రరిజంపై శ్వేతపత్రం వెలువరిస్తామన్నారు. ఐదేళ్ల పాటు బిజెపికి ఇక్కడ పాలనా అవకాశం ఇవ్వాలని, దీనికి ప్రతిగా ఇక్కడి శాంతి ప్రగతికి బిజెపి గ్యారంటీ ఇస్తుందన్నారు.

టూరిస్టు హబ్‌లు , ఐదు లక్షల ఉద్యోగాలు
బిజెపి మేనిఫెస్టోలో కీలక విషయాలు
జమ్మూ వద్ద , కశ్మీర్‌లోని రాజౌరీలో నూతన పర్యాటక కేంద్రాలు (టూరిస్టు హబ్‌లు) ఏర్పాటు , ఐదు లక్షల ఉద్యోగాల కల్పన. ఈ రెండు కీలక విషయాలతో శుక్రవారం బిజెపి ఎన్నికల వాగ్దాన పత్రం వెలువరించింది. పార్టీ ప్రచార నిర్వాహకులు, కేంద్ర మంత్రి అమిత్ షా ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. పర్యాటక రంగం కశ్మీర్‌కు ఆయువుపట్టు. ఈ రంగం బలోపేతానికి అన్ని చర్యలూ తీసుకుంటామన్నారు. కశ్మీర్ లోయలో యువతను దృష్టిలో పెట్టుకుని ఐదు లక్షల ఉద్యోగాలకు తగు విధంగా చర్యలు తీసుకుంటామని, దీనిని నిర్థిష్టంగా తమ పార్టీ మేనిఫెస్టోలో తెలిపామని వివరించారు. కశ్మీరీ పండిట్లు నిర్వాసితులసురక్షిత రాకకు బిజెపి పలు కార్యక్రమాలు చేపడుతుందని షా తెలిపారు.

టికా లాల్ తప్లూ విషపిత్ సమాజ్ పురాన్వాస్ యోజన ((టిఎల్‌టివిపివై) ప్రవేశపెడుతామన్నారు. బిజెపి చర్యలకు ముందు ఈ ప్రాంతం గరిష్ట స్థాయి ఉగ్రవాదం (మాక్స్ టెర్రరిజం)గా ఉంది. ఇప్పుడిది నిండైన పర్యాటకం (మాక్స్ టూరిజం) అయిందని అమిత్ షా తెలిపారు. 2014 వరకూ ఇక్కడ ఉగ్రవాదం, వేర్పాటువాదం చెట్టాపట్టాలుగా సాగాయి. ఈ ప్రాంతాన్ని ఇక్కడి, అంతర్జాతీయ శక్తులు ప్రభావితం చేశాయని . ఆ తరువాత తాము తీసుకున్న చర్యలతో పరిస్థితి మారిందని అమిత్ షా చెప్పారు. ఇకపై కూడా రాష్ట్రం అగ్రస్థాయికి చేరేందుకు రంగం సిద్ధం అవుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News