Sunday, April 28, 2024

బైడెన్ విజయానికి నల్లజాతి నేతల స్వాగతం

- Advertisement -
- Advertisement -

Black leaders welcome Biden's victory

 

జాతి సమానత్వ ప్రోత్సాహానికి అంకితం

డెట్రాయిట్ : అధ్యక్షునిగా బైడెన్ ఘన విజయాన్ని స్వాగతిస్తూ నల్లజాతి నేతలు, పౌరహక్కుల నేతలు ఘనంగా వేడుక జరుపుకున్నారు. ట్రంప్ ప్రభుత్వ పాలనలో రగులుకున్న అసమానతలు, జాతి వివక్ష వంటి గడ్డు సమస్యలు బైడెన్ ప్రభుత్వం మున్ముందు పరిష్కరించవలసిన సవాళ్లుగా ఉన్నాయని హెచ్చరించారు. కరోనా విజృంభణకు తోడు నల్లజాతీయులు, వర్ణవివక్ష ,జాతివిద్వేషాలు, విచక్షణా రహితంగా దాడులు, తీవ్ర నిరుద్యోగం తదితర సమస్యల సంక్షోభం నేపథ్యంలో జనవరిలో బిడెన్ అధికార పగ్గాలు చేపట్టనున్నారు. నల్లజాతీయులకు జరిగిన అన్యాయంపై గత వేసవి అంతా అమెరికా అట్టుడికింది. ట్రంప్‌కు వ్యతిరేకంగా వివాదాస్పద ప్రచారం సాగుతుండగా, నల్లజాతి ఓటర్ల మద్దతు కోరుతూ బైడెన్ స్పష్టమైన అభ్యర్థనలు చేశారు. జాతి వివక్షను రూపుమాపుతానని దేశాన్ని సమైక్యతా బాటలో నడిపిస్తానని వాగ్దానం చేశారు.

వేర్పాటు వాదాన్ని రెచ్చగొడుతున్న ప్రత్యర్థిని తీవ్రంగా విమర్శిస్తూ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా తొలి నల్లజాతీయురాలైన కమలాహారిస్‌ను ఎంపిక చేశారు. బైడెన్ చేపట్టిన ఈ చర్యలను నల్లజాతీయులు స్వాగతించారు. అందుకే అన్ని ఆకాంక్షలు నెరవేర్చేలా వచ్చే ప్రభుత్వాన్ని ప్రోత్సహిస్తామని చెబుతున్నారు. ‘ ఇది కేవలం మార్పుకు ఆరంభం మాత్రమే. తన తండ్రి మార్టిన్ లూథర్‌కింగ్ 57 ఏళ్ల క్రితం ఆశించిన విజన్ ను అమెరికా ఇంకా పూర్తిగా గ్రహించలేదని లూథర్ కింగ్ తనయుడు, పౌరహక్కుల నేత జూనియర్ లూథర్‌కింగ్ పేర్కొన్నారు. అమెరికా సమాజం నుంచి జాతివివక్షత, పేదరికం,హింస పూర్తిగా నిర్మూలన కావాలని తన తల్లిదండ్రులు ఆశించారని, బైడెన్ హారిస్ పాలక ప్రభుత్వం ఆ సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుందని సూచించారు.

మనమంతా అమెరికా పురోగతిలోని అన్ని భాగాలతో అనుసంధానం కలిగిన సంపూర్ణ అమెరికా పౌరులుగా బైడెన్ అర్థం చేసుకున్నారని వోటింగ్ హక్కుల నేత మాజీ జార్జియా గవర్నర్ అభ్యర్థి స్టేసీ అబ్రమ్స్ అభిప్రాయ పడ్డారు. భవిష్య అభివృద్ధి ప్రణాళికలను ఏ విధంగా అమలు చేయాలన్న దానికి బైడెన్ కట్టుబడి ఉంటారని విశ్వసించారు. ట్రంప్ జాత్యహంకారం వల్ల తామెంతో నష్టపోయామని, చాలా లాబీలకు గురయ్యామని, నల్లజాతి ప్రగతిశీలక నేత,మాజీ ఒహియోస్టేట్ సెనేటర్ నీనా టర్నర్ ఆవేదన వెలిబుచ్చారు. ట్రంప్ పాలనలో అనుభవమైనట్టు ఆ విధంగా ఈ దేశం మళ్లీ మోసపోకూడదని హెచ్చరించారు. ట్రంప్ పాలనలో ఉదారవాదులైన తెల్లజాతీయులు ఎంతో సౌఖ్యవంతులయ్యారని వ్యాఖ్యానించారు.

ఇంతవరకు నల్లజాతి, తెల్లజాతీయుల మధ్య క్లిష్టమైన విభేదాలతో విడిపోయిన సమాజాన్ని తాము చూశామని, ఉమ్మడి ఆర్థికభాగస్వాములమైనప్పటికీ ఆ ఫలితాన్ని శ్వేతజాతీయులు తమకు దక్కకుండా చేశారని పర్డూ యూనివర్శిటీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ నాడియా బ్రౌన్ పేర్కొన్నారు. నల్లజాతీయురాలు బ్రెయొన్నా టేలర్ తన కెంటకీ ఇంటిలో తుపాకీ కాల్పులతో హత్యకు గురికావడం, నల్లజాతీయుడు జార్జిఫ్లాయిడ్ గొంతుపై మిన్నెపొలిస్ పోలీస్ కాలితో నొక్కి చంపడం ఇవన్నీ అమెరికాలో నల్లజాతిపై విదేషాలకు పోలీస్ హింసాకాండకు తార్కాణాలుగా నిలిచి ప్రపంచ దేశాల్లో ఆందోళనలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో నల్లజాతీయులు తమపై జరుగుతున్న దారుణాలను బైడెన్ ప్రభుత్వం నివారించి న్యాయం చేకూర్చగలదని, పోలీస్ హింసాకాండకు దారి తీసిన మూలకారణాలు పరిశీలించి, ప్రగతిశీలక విధానాలను రూపొందిస్తారని ఆయా ఆందోళన కారులు ఆశిస్తున్నట్టు జెస్సికాబైర్డ్ అభిప్రాయపడ్డారు. నల్లజాతీయుల ఎలెక్టోరల్ జస్టిస్ ప్రాజెక్టు కోసం జెస్సికా ఉద్యమం సాగిస్తున్నారు. ఈ ఆందోళన ఉద్యమానికి బైడెన్, హారిస్ మద్దతు ఇవ్వగలరన్న అభిప్రాయాన్ని జెస్సికా వెల్లడించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News