Wednesday, May 1, 2024

గ్లాసుతో గరళం

- Advertisement -
- Advertisement -

Plastic contamination in drinking tea from disposable paper cups

 

వాడి పారేసే పేపర్ కప్పుల్లో టీ తాగడం ఆరోగ్యానికి చేటే
మూడు సార్లు తాగితే కడుపులోకి 75వేల సూక్ష్మస్థాయి
ప్లాస్టిక్ రేణువులు : ఐఐటి ఖరగ్‌పూర్ అధ్యయనం

న్యూఢిల్లీ : వాడిపారేసే పేపర్ కప్పులలో టీ తాగుతున్నారా? అయితే మీరు మీ జీవిత ఆయుష్షును చేజేతులా విసిరి పారేసుకుంటున్నట్లే. ఈ విషయం ప్రఖ్యాత ఐఐటి ఖరగ్‌పూర్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడయింది. డిస్పోజబుల్ పేపర్ కప్పులలో టీ అందించడం పరిపాటి అయింది. అయితే ఈ పద్థతిలో తేనీటి సేవనం ఏకంగా ప్లాస్టిక్ పదార్థాలను శరీరంలోకి చొప్పించుకోవడమే అవుతుందని అధ్యయనంలో స్పష్టం అయింది. ఏ వ్యక్తి అయినా రోజుకు మూడుసార్లు డిస్పోజబుల్ కప్‌లలో టీ తాగితే వారి కడుపులోకి ఎంత లేదన్నా 75000 సూక్ష్మ స్థాయి ప్లాస్టిక్ రేణువులు చేరుతాయి. మనిషిని ప్లాస్టిక్ విషపూరితం చేసి, ఆరోగ్యాన్ని గుల్ల చేసే ఈ ముప్పు గురించి ఐఐటి ఖరగ్‌పూర్ అసోసియేట్ ప్రొఫెసర్ సుధా గోయల్ తెలిపారు. ఆమె ఆధ్వర్యంలోనే దీనిపై అధ్యయనం జరిగింది. టీ ఒక్కటే కాదు ఇతరత్రా పలు పానీయాలు తీసుకోవడానికి ఇటీవలి కాలంలో ఈ పేపర్ కప్పులే దిక్కు అయ్యాయి.

వేడివేడి టీ కావాలని చెపుతాం. వెంటనే మరగపెట్టిన టీని సరైన ప్రామాణికత లేని పేపర్ కప్పులలో మనకు అందిస్తుంటారు.ఇటువంటి కప్పుల లోపలి పై భాగాలు అత్యంత తేలిక పాటిగా ఉండటం, పైగా వీటిలోహైడ్రోఫోబిక్ పొరలు ఉంటాయి. ఇవి ఫ్యాక్టరీలలో రసాయనిక చర్యల ద్వారా ఎక్కువగా ప్లాస్టిక్ అంటే పాలిథిన్ పదార్థాలతో రూపొందుతున్నాయి. కొన్ని సందర్భాలలో పేపర్ కప్‌లు దళసరిగా ఉండేందుకు కో పాలిమర్స్‌ను కూడా వాడుతున్నారు. వీటి తయారీ ప్రక్రియ అంతా కూడా పూర్తిగా రసాయనిక చర్యలతో ప్లాస్టిక్ ముడి సరుకుల సమ్మేళనంగా ఉంటుంది. అయితే ఇటువంటి తయారీ దశల పేపర్ కప్పులలో పోసే వేడి ద్రావకం పోస్తే పావు గంటలోనే ఇందులోని ప్లాస్టిక్ భూతం వంటి పదార్థాలు కరిగిపోతాయి. ఇవి మనం తాగే టీలో కలిసి చప్పరింతల మధ్య క్రమేపీ మన శరీరంలోకి చేరుతాయని, తరువాత అవి ఏఏ శరీరభాగాలలో ఏ విధంగా పేరుకుంటాయి? ఏ స్థాయిలో ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయనేది మనం రోజుకు ఎన్నిసార్లు ఈ పేపర్ కప్‌లను వాడాం అనేదానిని బట్టి ఉంటుందని ప్రొఫెసర్ సుధ తెలిపారు.

మనం వంద మిల్లీలీటర్ల వేడి నీరు లేదా టీ కాఫీలను ఈ పేపర్ కప్‌లలో తీసుకుంటే వాటిలో 25000 మైక్రాన్ పరిణామపు ప్లాస్టిక్ కణాలు వచ్చిచేరుతాయి. ఇక మనం ఏ మోతాదులో వేడి ద్రావకాలను ఈ పేపర్ కప్‌లలో తాగుతున్నామనేదానిని బట్టి ఈ రసాయనికాలు వచ్చి చేరే పరిణామం ఆధారపడి ఉంటుంది.

వేరే మార్గం వెతుక్కోవల్సిందే ః డైరెక్టర్

జీవనక్రమంలో పలు నిత్య అలవాట్లతో ఉండే భారతదేశం వంటి దేశంలో డిస్పోజబుల్ కప్పుల వెనుక ఉన్న ముప్పుతో మనం మరింతగా జాగ్రత్తగా ఉండాలని తేలిందని ఐఐటి సంస్థ డైరెక్టర్ వీరేంద్ర కె తివారీ తెలిపారు. మనిషి శారీరక ధర్మానికి ముప్పు తెచ్చే ఉత్పత్తులకు బదులు ఇతరత్రాలను అందుబాటులోకి తేవాల్సి ఉంది. ఇవి ఇప్పటికే గతంలో వాడకంలో ఉన్న మట్టిపాత్రలు కావచ్చు ఇతరత్రా వస్తువులు కావచ్చు. ముందు ముప్పు తెచ్చిపెట్టే వాటిని మానుకోవల్సి ఉంది. పైగా పర్యావరణ కాలుష్య కారకాలను రోజూ మనకు మనమే పరిసరాలలో పారేస్తూ ఉండటం మరింత జటిలతను తెచ్చిపెడుతుందన్నారు.పర్యావరణ హిత ఉత్పత్తులను వాడాల్సి ఉంటుంది. మన దేశం ఎల్లవేళలా పరివర్తనాయుత జీవనశైలికి అలవాటుపడి ఉంటుంది. ప్రస్తుత ప్రమాదకర పరిస్థితి నేపథ్యంలో మనను మనం తరచిచూసుకుని దిద్దుబాట్లకు వెళ్లాల్సి ఉంటుందని తివారీ స్పష్టం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News