ఖమ్మం: సూర్యాపేట జిల్లా రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్-విజయవాడ ప్రధాన రహదారిపై ఎస్ వి కాలేజీ సమీపంలో లారీని వెనక నుండి కారు ఢీకొట్టడంతో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బొల్లోజు అయోధ్య చారి మృతి చెందాడు. కారు డ్రైవర్ రమేష్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో వైద్య పరీక్షల కోసం వెళ్లేందుకు ఆయన నిన్న రాత్రి సూర్యాపేటలోని తన కూతురు ఇంటికి వచ్చారు. బుధవారం కూతరు ఇంటి నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన అయోధ్య చారి, ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్‌గా సేవలందించారు. పినపాక నియోజకవర్గంలో మంచి నాయకుడిగా ఆయనకు పేరు ఉంది.
అయోధ్య మృతిపట్ల ఉమ్మడి ఖమ్మం జిల్లా సిపిఐ నాయకులు, కార్యకర్తలు సంతాపం తెలిపారు. అయోధ్య చేసిన సేవలు మరువలేనివని, ఆయన మృతి బడుగు బలహీన వర్గాల ప్రజలకు తీరని లోటు అని, ప్రజా హక్కుల కోసం అలుపెరగని పోరాటాలు చేసిన యోధుడు అని ఖమ్మం జిల్లా సిపిఐ నాయకులు గుర్తు చేసుకుంటున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.