Friday, April 26, 2024

ఐఐటి బొంబాయి క్యాంపస్‌లో కులవివక్షత పడగలు

- Advertisement -
- Advertisement -

ముంబై : ప్రఖ్యాత ఐఐటి బొంబాయి క్యాంపస్‌లో ఆదివారం విషాదకర ఘటన జరిగింది. 18 సంవత్సరాల బిటెక్ విద్యార్థి దర్శన్ సోలంకీ తన హాస్టల్ భవనంలోని ఏడో అంతస్తు నుంచి కిందికి దూకి చనిపోయాడు. ఇది ఆత్మహత్యగా భావిస్తున్నారు. అయితే ఎటువంటి సూసైడ్ నోటు లేకుండా ఈ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడటం కలకకలానికి దారితీసింది. అయితే క్యాంపస్‌లో విద్యాలయ స్థాయిలో కులవివక్ష పేరుకుని ఉందని తరచూ చెపుతూ ఉండే ఈ విద్యార్థి దీనికి నిరసన తెలిపేందుకే ప్రాణాలు తీసుకున్నాడని వెల్లడి కావడంతో క్యాంపస్ విద్యార్థులు రగిలిపోతున్నారు. తోటి విద్యార్థిని ఆత్మహత్యకు సంతాపం వ్యక్తం చేస్తూనే, వర్శిటీ అధికారుల తీరును నిరసిస్తూ క్యాంపస్‌లో గుమికూడారు. ముంబైలోని పొవయ్ ప్రాంతంలో క్యాంపస్ ఉంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన ఈ విద్యార్థి మూడు నెలల క్రితమే బిటెక్‌లో చేరాడు.

శనివారమే తొలి సెమిస్టర్ పరీక్షలు పూర్తయ్యాయి. విద్యార్థిది ఆత్మహత్యగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కోణంలో దర్యాప్తు సాగుతోంది. చదువులు, పరీక్షల పరమైన ఒత్తిడితో విద్యార్థి ఈ విధంగా తీవ్రచర్యకు పాల్పడ్డాడా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే అంశంపై కూడా దర్యాప్తు చేపట్టారు. ఈలోగా ఐఐటి బొంబాయికి చెందిన అంబేద్కర్ పెరియార్ ఫూలే స్టడీ సర్కిల్ జరిగిన ఘటనపై స్పందించింది. 18 ఏండ్ల , దళిత విద్యార్థిని పోగొట్టుకున్నామని, బిటెక్‌లో చేరి ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువకుడి విషాదాంతం బాధాకరం అని సర్కిల్ స్పందించింది. ఇది వ్యక్తిగత లేదా సొంత విషయం కాదని, ఇది సంస్థాగత దారుణ హత్య అని సర్కిల్ స్పందించింది.

క్యాంపస్‌లో కులం పేరిట వివక్షసాగుతోందని, దీని గురించి తాము ఎన్నోసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని, ఎస్‌సి, ఎస్‌టి విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసానికి రావడం కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని, ఈ క్రమంలో ఎదురవుతున్న అవమానాలు అన్నీ ఇన్నీ కావని ఈ అధ్యయన వేదిక తెలిపింది. దళితబహుజన, ఆదివాసీ విద్యార్థుల భద్రత విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, ప్రత్యేకించి గిరిజన ప్రాంతాల నుంచి వచ్చే తొలి సంవత్సరం విద్యార్థులపై రిజర్వేషన్ల వ్యతిరేక భావజాలపు బలీయ వర్గాల విద్యార్థుల నుంచి పలు విధాలుగా చిక్కులు ఏర్పడుతున్నాయని విమర్శించారు. చాలా కాలంగా ఈ విద్యాసంస్థలో క్యాంపస్‌లో ప్రత్యేకించి హాస్టళ్లలో వీరిపై పలు రకాలుగా వివక్ష సాగుతోందని, ఈ క్రమంలో దర్శన్ బలి అయ్యాడని, చివరికి తన చావుకు కారణం కూడా తెలియచేయలేని స్థితిలో చనిపోయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News