Saturday, July 27, 2024

7 దశలలో పోలింగ్.. జూన్ 4న లోక్ సభ ఫలితాలు

- Advertisement -
- Advertisement -

ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 7 దశలలో పోలింగ్
జూన్ 4న ఓట్ల లెక్కింపు..ఫలితాల వెల్లడి
ఆంధ్రప్రదేశ్‌లో మే 13న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు
సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా అసెంబ్లీలకూ ఎన్నికలు
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన సిఇసి రాజీవ్ కుమార్

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల నగారా మోగింది. లోక్‌సభతోపాటు ఆంధ్ర ప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రధాన ఎన్నికల కమిషనర్(సిఇసి) రాజీవ్ కుమార్ శనివారం న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఏప్రిల్ 19న ప్రారంభమై ఏడు దశలలో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న మొదటి దశ, ఏప్రిల్ 26న రెండవ దశ, మే 7న మూడవ దశ, మే 13న నాలుగవ దశ, మే 20న ఐదవ దశ, మే 30న ఆరవ దశ, జూన్ 1న ఏడవ దశ ఎన్నికలు జరుగుతాయని సిఇసి తెలిపారు.

జూన్ 4న ఫలితాలు వెలువడతాయని ఆయన ప్రకటించారు. అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో ఏప్రిల్ 19న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో మే 13న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు నాలుగు దశలుగా మే 13, మే 20, మే 25, జూన్ 1న జరుగుతాయి. 26 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు కూడా జరుగుతాయని రాజీవ్ కుమార్ కొత్తగా నియమితులైన ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్‌బీర్ సిగ్ సంధూ సమక్షంలో ప్రకటించారు.

బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలలో ఏడు దశలలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరుగుతుందని ఆయన తెలిపారు. సిక్కిం, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో జరుగుతాయని ఆయన చెప్పారు. 2018 నుంచి రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్మూ కశ్మీరులో అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు నిర్వహించడం లేదని ఆయన వెల్లడించారు. బీహార్, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడుతో సహా వివిధ రాష్ట్రాలలోని 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయని ఆయన చెప్పారు. ఏప్రిల్ 19న మొదటి దశ ఎన్నికలలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని 102 నియోజకవర్గాలలో పోలింగ్ జరుగుతుంది. ఈ దశలో 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. రెండవ దశగా ఏప్రిల్ 26న 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని 89 నియోజకవర్గాలలో పోలింగ్ జరుగుతుంది.

ఈ దశలో నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. మూడవ దశగా మే 7న 12 రాష్ట్రాలు, యుటిలలోని 94 నియోజకవర్గాలలో పోలింగ్ జరుగుతుంది. దీంతో ఆరు రాష్ట్రాలు, యుటిలలో వోటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. నాలుగవ దశ కింద మే 13న 10 రాష్ట్రాలు, యుటిలలోని 96 నియోజకవరాలలో వోటింగ్ జరుగుతుంది. ఈ దశలో మూడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. ఐదవ దశగా మే 20న ఆ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని 49 నియోజకవర్గాలలో పోలింగ్ జరుగుతుంది. దీంతో మరో మూడు రాష్ట్రాలు, యుటిలలో పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. ఆరవ దశగా మే 25న 7 రాష్ట్రాలు, యుటిలలోని 57 నియోజకవర్గాలలో పోలింగ్ జరుగుతుంది. ఈ దశతో మరో రెండు రాష్ట్రాలు, యుటిలలో పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. ఏడవ, చివరి దశ కింద జూన్ 1న 57 నియోజకవర్గాలలో పోలింగ్ జరుగుతుంది.

ఈ దశతో 8 రాష్ట్రాలు, యుటిలలో వోటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. మజిల్ పవర్(కండ బలం) మనీ పవర్(ధన బలం), మిస్‌ఇన్ఫర్మేషన్(తప్పుడు సమాచారం), మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘనలు(ప్రవర్తనా నియమావళి) అనే నాలుగు ఎంల నుంచి ఎదురయ్యే సవాలను గట్టిగా ఎదుర్కొనేందుకు ఎన్నికల సంఘం సిద్ధంగా ఉందని సిఇసి రాజీవ్ కుమార్ ప్రకటించారు. ప్రచార సందర్భంగా హుందాతనాన్ని పాటించాలని, వ్యక్తిగత దూషణలకు పాల్పడవద్దని రాజకీయ పార్టీలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో పిల్లలను ఉపయోగించవద్దని ఈ విషయంలో ఎన్నికల పరిశీలకులు చాలా కఠినంగా ఉంటారని సిఇసి హెచ్చరించారు. వార్తల ముసుగులో ప్రకటనలను అఅనుమతిచబోమని ఆయన స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాలలో తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాజకీయ పార్టీలను సిఇసి హెచ్చరించారు. సోష్‌ల్ మీడియా ప్రవర్తనకు రాజకీయ పార్టీలే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన తెఇపారు.

నిర్ధారించుకున్న తర్వాతే వ్యాప్తి చేయాలని ఆయన సూచించారు. ప్రస్తుత చట్టాలైన ఐటి చట్టంలోని సెక్షన్ 79(3)(బి) కింద తప్పుడు వార్తలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. చట్టవ్యతిరేక కంటెంట్‌ను తొలగించడానికి ప్రతి రాష్ట్రంలో నోడల్ అధికారులను నియమిస్తామని ఆయన తెలిపారు. విద్వేష ఉపన్యాసాల విషయంలో ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు. అంశాల ఆధారంగా ప్రచారం ఉండాలని, విద్వేష ప్రసంగాలు, కులపరమైన,మతపరమైన ప్రసంగాలు, ఇతరుల వ్యక్తిగత జీవితాలను విమర్శిస్తూ చేసే ప్రసంగాలు ఉండరాదని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ ప్రకటనలను మీడియా వెల్లడించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.

వార్తల ముసుగులో రాజకీయ ప్రకటనలను ప్రచురించరాదని ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించి వ్యక్తిగత సందేశాలను అభ్యర్థుల ఖాతాలో వేస్తామని సిఇసి చెప్పారు. ఈ అంశాలపై కన్నేయడానికి 2100 మంది సలహాదారులను కమిషన్ నియమించిందని, ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, శారీరక వైకల్యాలు, 40 శాతం శారీరక వైకల్యాలు ఉన్న ఓటర్లు తమ ఇంటి నుంచి ఓటు హక్కును వినియోగించుకోవచ్చని సిఇసి తెలిపారు. 85 సంవత్సరాలు పైబడిన ఓటర్లు దాదాపు 82 లక్షల మంది ఉన్నట్లు ఆయన వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News