Thursday, September 18, 2025

ఇజ్రాయెల్- పాలస్తీనా అంశంపై కేంద్రం గందరగోళం: శరద్‌పవార్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఇజ్రాయెల్- పాలస్తీనా అంశంపై కేంద్ర ప్రభుత్వ వైఖరి గందరగోళంగా ఉందని ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ అన్నారు. ఇలాంటి పరిస్థితులను గత ప్రభుత్వాల్లో తానెప్పుడూ చూడలేదని తెలిపారు. హమాస్ దాడుల తరువాత ఇజ్రాయెల్‌కు పూర్తిస్థాయి మద్దతిస్తున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తూ, విదేశాంగశాఖ ప్రకటన అందుకు భిన్నంగా ఉండటాన్ని శరద్‌పవార్ ప్రస్తావించారు. ఢిల్లీలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ పాలస్తీనాకు మద్దతివ్వడమే భారత్ విధానమని చెప్పారు.

ఇజ్రాయెల్‌పై హమాస్ దాడుల తర్వాత అక్టోబర్ 8న ప్రధాని మోడీ స్పందిస్తూ , హమాస్ ఉగ్రవాదుల నరమేధం గురించి తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్టు చెప్పారు. ఇజ్రాయెల్‌కు భారత్ అండగా ఉంటుందని ప్రకటించారు. ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో కూడా ఆయన మాట్లాడారు. అక్కడికి నాలుగు రోజుల తర్వాత భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఆరిందమ్ బాగ్చీ ఇదే విషయంపై స్పందిస్తూ, … సార్వభౌమ, స్వతంత్ర పాలస్తీనా నిర్మాణానికి భారత్ మద్దతిస్తుందని ప్రకటించారు.

ఇలా కేంద్రం వేర్వేరు ప్రకటనలు చేయడాన్ని శరద్ పవార్ తప్పుబట్టారు. పాలస్తీనాలో వేలాది మంది ప్రజలు మరణిస్తున్నారన్న ఆయన , గతంలో ఇజ్రాయెల్ పోరాటానికి భారత్ ఎప్పుడూ మద్దతు ఇవ్వలేదని చెప్పారు. గాజాపై ఇజ్రాయెల్ దాడికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో తీసుకొచ్చిన తీర్మానంపై భారత్ ఓటింగ్‌కు దూరంగా ఉండటాన్నిశరద్ పవార్ తప్పుబట్టారు. కీలక సమయాల్లో మౌనం వహించడం సరికాదన్నారు. ఇజ్రాయెల్ దాడులపై కేంద్రం వైఖరిని శరద్‌పవార్ వ్యతిరేకించడం ఇదే తొలిసారి కాదు. గాజాపై ఇజ్రాయెల్ ప్రతిదాడులు తీవ్రతరం చేసిన తర్వాత ఆయన స్పందిస్తూ, ఇజ్రాయెల్‌కు భారత్ మద్దతు పలకడం దురదృష్టకరమన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News