మహారాష్ట్రలో మొత్తం ఎన్నికల యంత్రాంగంపై నియంత్రణకు అధికారం, ధనం దుర్వినియోగం జరిగిందని, ఇటువంటి పరిస్థితి ఏ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో గాని, జాతీయ ఎన్నికల్లో గాని ఎన్నడూ కనిపించలేదని ఎన్‌సిపి (ఎస్‌పి) అధినేత శరద్ పవార్ శనివారం ఆరోపించారు. మహారాష్ట్రలో ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఆరోపిత ‘ఇవిఎంల దుర్వినియోగం’ పట్ల నిరసన వ్యక్తం చేస్తున్న సీనియర్ నేత డాక్టర్ బాబా అధవ్‌ను కలుసుకున్న తరువాత పవార్ ఆ వ్యాఖ్య చేశారు. 90 దశకంలో ఉన్న అధవ్ తన మూడు రోజుల నిరసనను పుణె నగరంలోని సంఘ సంస్కర్త జ్యోతిబా ఫులే నివాసం ఫులే వాడలో గురువారం ప్రారంభించారు. ఇటీవలి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలో ఇవిఎంల తారుమారు జరిగిందని ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) భాగస్వామ్య పక్షాలు కాంగ్రెస్. శివసేన (యుబిటి). ఎన్‌సిపి (ఎస్‌పి) ఆరోపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో మహాయుతి అఖండ విజయం సాధించిన విషయం విదితమే.
శివసేన, బిజెపి, ఎన్‌సిపితో కూడిన మహాయుతి నవంబర్ 20 ఎన్నికల్లో 288 అసెంబ్లీ సీట్లకు 230 సీట్లను గెలుచుకున్నది. ఎంవిఎ కేవలం 46 సీట్లతో సరిపెట్టుకున్నది. శరద్ పవార్ విలేకరులతో మాట్లాడుతూ, ఇవిఎంలలో వోట్లు కలపడం గురించి కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యల్లో కొంత నిజం ఉందని, అయితే, వాటిని ధ్రువీకరించేందుకు తన వద్ద ఆధారాలు లేవని చెప్పారు. ‘గతంలో ఎన్నడూ చూడని విధంగా మహారాష్ట్రలో ఇటీవలి ఎన్నికల్లో ‘అధికార దుర్వినియోగం’ జరిగిందని, ‘ధన బలం’ ఉపయోగించారని జనంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అటువంటి విషయాలు స్థానిక స్థాయి ఎన్నికల్లో వినవస్తుంటాయి. కానీ ధన బలం, అధికార దుర్వినియోగంతో మొత్తం ఎన్నికల యంత్రాంగాన్ని చేజిక్కించుకోవడం గతంలో ఎన్నడూ చూడలేదు. అయితే, దానిని మహారాష్ట్రలో దానిని చూశాం. జనం ఇప్పుడు గుర్రుగా ఉన్నారు’ అని ఆయన చెప్పారు. సామాజిక సిద్ధాంతకర్త జయప్రకాశ్ నారాయణ్ గురించి జనం గుర్తు చేసుకుంటున్నారని పవార్ చెబుతూ, ఎవరో ఒకరు ముందడుగు వేయాలని సూచించారు. ‘ఈ విషయమై బాబా అధవ్ ముందడుగు వేసి, ఫులే వాడలో ఆందోళన నిర్వహిస్తున్నారని విన్నాను. ఆయన నిరసన ప్రజలకు ఆశలు రేకెత్తిస్తుంది. అయితే, అది సరిపోదు.
పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ధ్వంసం అయ్యే ముప్పు కానవస్తున్నందున భారీ స్థాయిలో తిరుగుబాటు అవసరం’ అని శరద్ పవార్ చెప్పారు. తమ చేతుల్లో దేశాధికారం ఉన్నవారికి దీని గురించి పట్టదని మాజీ కేంద్ర మంత్రి పవార్ అన్నారు. ‘దేశంలో దీనిపై (ఇవిఎంల ఆరోపిత దుర్వినియోగం)పై విస్తృత స్థాయిలో చర్చ జరుగుతున్నప్పటికీ పార్లమెంట్‌లో ఈ అంశం లేవనెత్తడానికి ప్రతిపక్షాలు ప్రయత్నించినప్పుడల్లా వారిని మాట్లాడనివ్వడం లేదు. ఈ సమస్యలపై మాట్లాడేందుకు ఆరు రోజులుగా ప్రతిపక్ష నాయకులు అవకాశం కోరుతున్నారు, కానీ వారి డిమాండ్లను కనీసం ఒక్కసారైనా అంగీకరించలేదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై దాడిని వారు కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది’ అని ఆయన అన్నారు. ఇవిఎంలలో వోట్లను ఎలా కలపవచ్చో కొందరు వ్యక్తులు తనకు చూపారని, కానా వారి వాదనల ధ్రువీకరణకు తన వద్ద ఆధారాలు లేవని పవార్ తెలిపారు. వోట్లను తిరిగి లెక్కించాలని దాదాపు 22 మంది పరాజిత అభ్యర్థులు కోరడం గురించి ప్రశ్నించగా, దీని వల్ల సత్ఫలితం ఉంటుందా అన్న సందేహాలను పవార్ వ్యక్తం చేశారు. ఎన్నికల రోజు చివరి రెండు గంటల్లో ఏడు శాతం వోట్లు పడ్డాయని బాలాసాహెబ్ థొరట్ వంటి కాంగ్రెస్ నాయకుల ఆరోపణలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయని పవార్ చెప్పారు.