Saturday, July 27, 2024

కేంద్రం గ్రాంట్ల కోసం ఎదురు చూపులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిన గ్రాంట్లు, బకాయిలను వసూలు చేసుకునేందుకు రాష్ట్ర ప్ర భుత్వం నిర్ధిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ‘ఎలాగై నా సరే’ కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టుకోవడమే కాకుం డా వడ్డీ లేకుండా రుణాలను ఇవ్వాలని, ఒకవేళ వడ్డీలు విధించినప్పటికీ భారీగా తగ్గించి సాఫ్ట్ లోన్లుగా మార్పులు చేసి రుణాలు ఇవ్వాలని కూ డా కేంద్రాన్ని కోరడమే కాకుండా ఆ విధంగా ఒప్పించేందుకు కూడా రా ష్ట్ర ప్రభుత్వ పెద్దలు పట్టువదలని విక్రమార్కుడి మాదిరిగా ప్రయత్నాలు చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, ఆర్థికశాఖ  మంత్రి భట్టి విక్రమార్క, పరిశ్రమలు, ఐటి శాఖల మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబులు అధికారికంగానే కేంద్ర ప్రభుత్వ పెద్దలైన ప్రధానమంత్రి, ఆర్ధికశాఖామంత్రితోనే కాకుండా చివరకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ఉన్నతాధికారులతో కూడా మంతనాలు జరపాలని నిర్ణయించుకొన్నారు.

ఇప్పటికే న్యూఢిల్లీలో మొదటి దఫా విన్నపాలు పూర్తయ్యాయని, మలి దఫా విన్నపాలు కూడా అందజేసేందుకు ఈసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అప్పాయింట్ మెంట్ తీసుకొని విజ్ఞాపన పత్రాలను అందజేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు న్యూఢిల్లీకి వెళ్ళి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సమన్వయం చేస్తూ రాష్ట్రానికి నిధులు తీసుకువచ్చేందుకు న్యూఢిల్లీలోని తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి అయిన షబ్బీర్ ఆలీ, తెలంగాణ రెసిడెంట్ కమిషనర్, ఇతర అధికారులు కలిసి కేంద్ర ప్రభుత్వ ఆర్ధికమంత్రిత్వ శాఖాధికారులతో నిరంతరం టచ్‌లో ఉంటారని, ఆ విధంగా తెలంగాణ రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నిధులు, బకాయిలను తెచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను రూపొందించుకొంది. ఎందుకంటే కేంద్రం ఇవ్వాల్సిన గ్రాంట్లు, బకాయిల నిధులన్నీ విడుదల చేస్తే రాష్ట్రంలో ఆర్ధిక సమస్యలన్నీ తొలగిపోతాయని కొందరు సీనియర్ అధికారులు వివరించారు.

రానున్న 2024-25వ ఆర్ధిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి 21 వేల కోట్ల రూపాయల నిధులు గ్రాంట్ల రూపంలో రావాల్సి ఉందని, ఆ నిధులను విడుదల చేయాలని కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అదే విధంగా కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల కింద తెలంగాణ రాష్ట్రానికి మరో 19 వేల కోట్ల రూపాయల నిధులు రావాల్సి ఉందని, ఆ నిధులను విడుదల చేయించేందుకు మంతనాలు జరుగుతున్నాయని కొందరు సీనియర్ అధికారులు వెల్లడించారు. అంతేగాక తెలంగాణ రాష్ట్రా రైతాంగాన్ని ఆదుకోవడానికి వీలుగా రైతుల పంట రుణాలను మాఫీ చేసేందుకు ప్రత్యేకంగా ఒక కార్పోరేషన్‌ను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉందని, ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ దృష్టికి తీసుకెళ్ళి, ఆయన ఆమోదం పొందాలని కూడా నిశ్చయించారని వివరించారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కేంద్ర-రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం ఉండాలని, రాష్ట్రాలకు న్యాయంగా రావాల్సిన నిధులను ఇవ్వాలని కేంద్రాన్ని కోరడంలో తప్పేముందని,

అందుకే దేశ ప్రధానిని కాన్ఫిడెన్స్‌లోకి తీసుకొని ఆర్ధికసాయాన్ని పొందాలని భావించడంలో తప్పేముందని ఆ అధికారులు అంటున్నారు. అంతేగాక రుణాల సేకరణలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, ఎఫ్‌ఆర్‌బిఎం చట్టానికి లోబడే వ్యవహరించాలనే సంకల్పంతో ఉన్నామనే అంశాలను కేంద్రానికి స్పష్టం చేసిన తర్వాత రాష్ట్రానికున్న ఆర్ధిక అవసరాలను తీర్చాల్సిన బాధ్యత కేంద్ర సర్కార్‌పైన కూడా ఉంటుందనే అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్ళాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని వివరించారు. అనేక సంవత్సరాలుగా రాష్ట్రంలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలను బిజెపి ప్రభుత్వం కొన్నింటిని రద్దు చేసిందని, మరికొన్ని పథకాలకు నిధులను తగ్గించారని, దాంతో ఆ పథకాలను రాష్ట్ర ప్రభుత్వమే సొంత నిధులతో అమలు చేస్తూ కొనసాగిస్తున్నందున రాష్ట్ర ఖజానాపై అదనపు భారం పడుతోందని, ఇలా అర్ధాంతరంగా నిలిపివేసిన కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఎంత ఖర్చయ్యిందో… ఆ నిధులను కూడా రాష్ట్రానికి విడుదల చేయాలని కూడా కేంద్రాన్ని కోరేందుకు రాష్ట్ర

ఆర్ధికశాఖాధికారులు లెక్కలుకడుతున్నట్లు తెలిసింది. దీనికితోడు రాష్ట్రంలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్రం ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్ నిధులు, ఆయా పథకాల అమలు చేసినట్లుగా ధృవీకరించే యుటిలిటీ సర్టిఫికేట్ (యుటి)లను కూడా ఎప్పటికప్పుడు కేంద్ర ఆర్ధికశాఖకు పంపించాలని, తద్వారా ఫండ్ ఫ్లో ఆగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆర్ధికశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారని వివరించారు. అంతేగాక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిసిన సమయంలో కూడా రేవంత్‌రెడ్డి ఆర్ధికపరమైన విజ్ఞప్తులు చేశారని ఆ అధికారులు వివరించారు. అందులో భాగంగానే కేంద్రం రాష్ట్రానికి 600 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసిందని, అదే తరహాలో ఇతర పెండింగ్ నిధులను కూడా విడుదల చేయించడానికి మన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పక్కా ప్లాన్ ఉందని ఆ అధికారులు వివరించారు. అంతేగాక వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి కింద రాష్ట్రానికి ఇప్పటి వరకూ 1800 కోట్ల రూపాయల బకాయిలను కేంద్రం ఇవ్వాల్సి ఉందని, వచ్చే ఆర్ధిక సంవత్సరంలో ఇవ్వాల్సిన 450 కోట్ల రూపాయలను కలుపుకుంటే మొత్తం 2250 కోట్ల రూపాయలను కేంద్రం

ఇవ్వాల్సి ఉంటుందని వివరించారు. దీనికితోడు గత పాలకులు జాతీయ బ్యాంకుల నుంచి ఎక్కువ వడ్డీలకు తీసుకున్న రుణాలపైన కూడా వడ్డీలు తగ్గించేందుకు కూడా సాయంచేయాలని కేంద్రాన్ని కోరేందుకు ముఖ్యమంత్రి రేవంత్ ప్లాన్ చేస్తున్నారని వివరించారు. అదే జరిగితే పాత అప్పులన్నీ (జాతీయ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు) సాఫ్ట్ లోన్లుగా మారిపోయి ఆర్ధికభారం తగ్గుతుందని, ఈ విషయంలో సిఎం రేవంత్ విజయం సాధిస్తారని కూడా ఆ అధికారులు ధీమాను వ్యక్తంచేస్తున్నారు. అంతేగాక గడచిన పదేల్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన నిధులన్నీ 2019 నుంచి నిలిచిపోయాయని, గత పాలకులు కేంద్ర సర్కార్‌తో రాజకీయపరమైన గొడవలు పెట్టుకొని రాష్ట్రానకి రావాల్సిన నిధుల కోసం చిత్తశుద్దితో ప్రయత్నాలు చేయలేదని, అదే మంటే లేఖలు రాసి చేతులు దులుపుకున్నారేగానీ రెగ్యులర్‌గా మానిటర్ చేయలేదని, అందుచేతనే ఏకంగా సుమారు 34,149 కోట్ల రూపాయలు రావాల్సి ఉందని, ఆ నిధుల కోసం కూడా ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నాలు చేస్తారని అంటున్నారు. రాజ్యాంగానికి లోబడి, ఫెడరల్ స్ఫూర్తికి అనుగుణంగా, కేంద్ర ప్రభుత్వ నీతి ఆయోగ్, కేంద్ర ఆర్ధికమంత్రిత్వ శాఖ నియమ, నిబంధనల మేరకు తెలంగాణ రాష్ట్రానికి గ్రాంట్ల రూపంలో రావాల్సిన నిధులను కూడా కేంద్రం నిలిపివేసిందని తెలిపారు.

14వ ఫైనాన్స్ కమీషన్ సిఫారసుల ప్రకారం తెలంగాణలోని గ్రామీణ స్థానిక సంస్థలకు 315 కోట్ల 32 లక్షల రూపాయలు, పట్టణ స్థానిక సంస్థలకు 502 కోట్ల 61 లక్షల రూపాయలు కలిపి స్థానిక సంస్థలకు 817 కోట్ల 61 లక్షల రూపాయల నిధులను గ్రాంట్ రూపంలో కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉందని వివరించారు. అదే విధంగా 15వ ఆర్ధిక సంఘం సిఫారసుల మేరకు పన్నులవాటాలో తెలంగాణకు ఇవ్వాల్సిన 723 కోట్ల రూపాయలను ఇప్పటి వరకూ ఇవ్వలేదు. 15వ ఆర్ధిక సంఘం సిఫారసుల ప్రకారం న్యూట్రిషన్ రంగంలో తెలంగాణకు మరో 171 కోట్ల రూపాయల నిధులను ఇవ్వాల్సి ఉంది. కొన్ని ప్రత్యేకమైన రంగాలకు 15వ ఆర్ధిక సంఘం 3,024 కోట్ల రూపాయల నిధులను గ్రాంటుగా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలని సిఫారసు చేసిందని, ఆ నిధులను కూడా ఇవ్వలేదని వెల్లడించారు. మిషన్ భగీరథ పథకానికి 15వ ఆర్ధిక సంఘం తెలంగాణ రాష్ట్రానికి మరో 2,350 కోట్ల రూపాయల నిధులను ఇవ్వాలని కేంద్రానికి సిఫారసు చేసిందని,

అంతేగాక నీతి ఆయోగ్ సంస్థ కూడా మిషన్ భగీరథ పథకానికి 19,205 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్రానికి గ్రాంటుగా ఇవ్వాలని సిఫారసు చేసిందని వివరించారు. అంతేగాక మిషన్ కాకతీయ పథకానికి మరో అయిదు వేల కోట్ల రూపాయల నిధులను ఇవ్వాలని కూడా నీతి ఆయోగ్ సిఫారసు చేసినప్పటికీ కేంద్రం ఒక్క రూపాయిని కూడా గ్రాంట్‌గా ఇవ్వలేదని, ఇప్పుడు ఆ నిధులన్నింటినీ రాబట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News