Saturday, October 5, 2024

వృద్ధుల పథకం.. ఆచరణే కీలకం

- Advertisement -
- Advertisement -

ఆదాయంతో సంబంధం లేకుండా 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ ఆరోగ్యబీమా కల్పించడానికి రూ.3,437 కోట్లతో కేంద్ర ప్రభుత్వం పథకాన్ని రూపొందించడం వృద్ధుల జీవితాల్లో కొత్త జవసత్వాలను సమకూర్చినట్టు అవుతుంది. ఈ పథకం వల్ల దాదాపు 4.5 కోట్ల కుటుంబాల్లోని 6 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుందని కేంద్రం ప్రకటించింది. అన్ని సామాజిక, ఆర్థిక వర్గాలకు చెందిన వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఎబిపిఎం జెఎవై)కింద రూ. 5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా లభిస్తుందని, ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ పరిధిలో ఉన్న వృద్ధులకు ఇప్పుడు రూ. 5 లక్షల అదనపు కవరేజి లభిస్తుందని, ప్రైవేట్ వైద్య ఆరోగ్య బీమా, కార్మిక రాజ్య బీమా కింద ప్రయోజనం పొందుతున్నవారు కూడా ఈ రూ. 5 లక్షల ప్రయోజనం పొందగలుగుతారని వివరించింది.

ఈ విధంగా పథకం తీసుకురావడం మంచిదే కానీ ఆచరణే ముఖ్యం. ప్రభుత్వం తీసుకున్న శ్రద్ధాసక్తులపై ఈ ఆచరణ ఆధారపడి ఉంది. దేశంలో వృద్ధుల జనాభా అనూహ్యమైన రీతిలో పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కల్పించే ఈ ఆరోగ్య సంక్షేమం వృద్ధులకు పెద్ద ఆసరా కల్పిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. యుఎన్‌ఎఫ్‌పిఎ ఇండియా ఏజింగ్ రిపోర్టు 2023 ప్రకారం 2021లో అరవై ఏళ్లు పైబడిన వృద్ధుల జనాభా శాతం మొత్తం జనాభాలో 10.1 శాతం వరకు ఉండగా, 2036 నాటికి 15 శాతానికి పెరుగుతుందని, శతాబ్ది చివరినాటికి దేశంలోని మొత్తం జనాభాలో 36 శాతానికి పైగా వృద్ధులు ఉంటారని అంచనాగా తెలుస్తోంది. అయితే వీరిలో చాలా మంది సుదీర్ఘ రోగాలతో సతమతమవుతున్నారు. ముఖ్యంగా డయాబెటిస్, బిసిలతో పాటు ఎక్కువ శాతం క్షయ రోగగ్రస్థులవుతున్నారు. భారత్‌లోని జాతీయ క్షయ వ్యాప్తి సర్వే 2021 ప్రకారం 55 ఏళ్లు దాటిన వృద్ధుల్లో ప్రతి లక్ష మందిలో 588 మంది క్షయ పీడితులవుతున్నారని బయటపడింది.

అంటే జాతీయ సగటు వ్యాప్తి 316 కన్నా ఇది దాదాపు రెట్టింపు అని చెప్పవచ్చు. డయాబెటిస్, బిపిలకు తోడు క్షయ కూడా దాపురిస్తే అటువంటి వారికి క్షయ నివారణ సంక్లిష్టంగా తయారవుతోంది. ఔషధాల మోతాదు పెరగడమే కాక, దుష్ప్రభావాల సంభావ్యత మరింత పెరిగిపోతోంది. ఫలితంగా క్రమ పద్ధతిలేని చికిత్సతో బతుకు దుర్భరమై చివరకు మరణం సంభవిస్తోంది. కొందరు క్షయ పీడితులైన వృద్ధులకు తగిన సంపాదన కానీ ఆర్థిక వనరులు కాని లేక కుటుంబం ఆసరా కోల్పోయి జీవితంపై విరక్తిని పెంచుకుంటున్న పరిస్థితులు కూడా ఉంటున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఎక్కువ శాతం మంది వృద్ధులకు ఎవరి సహాయం ఉండడం లేదు. వీరికి వైద్య సమాచారం కూడా అందడం లేదు. తమంతట తాము ఆస్పత్రులకు వెళ్లి వైద్యసాయం పొందడానికి ఎన్నో వ్యయప్రయాసలకు గురికావలసి వస్తోంది.

సాధారణంగా వృద్ధులు కోలుకోవడానికి పుష్టికరమైన ఆహారం అవసరం. కానీ ఆ విధంగా పోషించే అవకాశాలు చాలా మందికి సమకూరడం లేదు. 60 ఏళ్లు దాటిన వృద్ధులు చాలావరకు పని చేయలేని బలహీనులుగా ఉంటారు. 70 ఏళ్లు వారైతే ఎటూ కదలలేక మంచానికి అతుక్కుపోతుంటారు. ఏదైనా కొంత డబ్బు దాచుకుంటే ఫరవాలేదు. కొన్ని అవసరాలు తీరతాయి. లేదా అన్నిటికీ తమ కుటుంబీకులపై ఆధారపడడం మనసు చంపుకుని బతకవలసి వస్తుంది. వృద్ధుల కోసం సంక్షేమ పథకాలున్నా వారిని సరిగ్గా ఆదుకోలేక పోతున్నాయి. సామాజికంగా ఒంటరివారు కావడం, అనారోగ్యం పాలు కావడం తదితర పరిస్థితులను అధ్యయనంలోకి తీసుకున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ వృద్ధాప్యాన్ని ప్రత్యేకంగా గుర్తిస్తోంది. ఈ విషయంలో ప్రపంచ దేశాలకు సూచనలు అందిస్తోంది.

వృద్ధుల్లో క్షయవ్యాధి మరణాల రేటు యువకుల కన్నా ఆరు రెట్లు ఎక్కువగా ఉంటోంది. ఈ కేసుల్లో మూడొంతులు శ్వాసకోశ సంబంధితమైనవే. వృద్ధుల స్థితిగతులను మెరుగుపర్చడానికి ఆరోగ్య సంరక్షణ, ఆహార భద్రత, వసతి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం 1999లో జాతీయ ప్రణాళికను రూపొందించింది. కానీ ఇది కాగితాలకే పరిమితమైంది. వృద్ధుల సంరక్షణే ప్రధాన లక్షంగా 2007లో సీనియర్ సిటిజన్ యాక్టు రూపొందింది. కానీ ఇవెంతవరకు ఆసరా కల్పిస్తున్నాయో ఎవరికీ తెలియడం లేదు. రైలు ప్రయాణాల్లో వృద్ధులకు టికెట్ ఛార్జీ భారం పడకుండా అమలయ్యే రాయితీ విధానాన్ని కూడా మోడీ ప్రభుత్వం రద్దు చేసింది. పైగా దీని వల్ల రైల్వేకు ఆదాయం బాగా సమకూరుతోందని చెప్పుకొస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో 70 ఏళ్ల వృద్ధులకు రూ. 5 లక్షల వరకు వైద్య బీమా అందించడానికి రూపొందించిన ఆయుష్మాన్ భారత్ పథకం ఎంతవరకు ధీమా కల్పిస్తుందో చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News