Monday, April 29, 2024

చండీగఢ్ మేయర్ పీఠం ‘ఆప్‌’దే

- Advertisement -
- Advertisement -

ఎన్నికల రిటర్నింగ్ అధికారి తీరు ప్రజాస్వామ్య విరుద్ధం
అక్రమ పద్ధతిలో బిజెపి అభ్యర్థిని విజేతగా ప్రకటించిన ఆర్‌ఒ
సుప్రీం కోర్టు సంచలన తీర్పు

న్యూఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్ మేయర్‌గా ఆప్ కౌన్సిలర్ కుల్దీప్ కుమార్‌ను ప్రకటించి మేయర్ ఎన్నికలపై గత కొన్ని వారాలుగా సాగుతున్న వివాదానికి సుప్రీంకోర్టు మంగళవారం తెరదించింది. అదే సమయంలో ఈ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన అనిల్ మాసీని తీవ్రంగా మందలించిన సు ప్రీంకోర్టు ఆయనకు షోకాజ్ నోటీసు జారీచేయాలని ఆదేశించిం ది. జనవరి 30న జరిగిన చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ఆప్-కాం గ్రెస్ కూటమికి చెందిన 8 ఓట్లను చెల్లనివిగా రిటర్నింగ్ అధికారి అనిల్ మాసీ ప్రకటించారు. బిజెపి అభ్యర్థి మనోజ్ సోంకర్‌ను విజేతగా ప్రకటించారు. ఆప్‌కు చెందిన కుల్దీప్ కుమార్‌కు 12 ఓట్లు రాగా బిజెపి అభ్యర్థి మనోజ్ సోంకర్‌కు 16 ఓట్లు వచ్చాయి. దీంతో బ్యాలట్ పేపర్లలో రిటర్నింగ్ అధికారి అక్రమాలకు పాల్పడ్డారని ఆప్ ఆరోపించింది. రిటర్నింగ్ అధికారి ప్రకటనను సవాలు చేస్తూ ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

రిటర్నింగ్ అధికారి ప్రవర్తనను తీవ్రంగా తప్పుపట్టిన సుప్రీంకోర్టు అనిల్ మాసీ ఇంటూ మార్కులు పెట్టి అనర్హమైనవిగా ప్రకటించిన ఆప్ కూటమికి చెందిన 8 ఓట్లు చెల్లుబాటు అవుతాయని మంగళవారం ప్రకటించింది. మేయర్ ఎన్నిక ప్రక్రియను చట్ట విరుద్ధంగా అనిల్ మాసీ మార్చివేశారని పేర్కొన్న సుప్రీంకోర్టు, కోర్టు ఎదుట తప్పుడు వాంగ్మూలాన్ని ఇచ్చినందుకు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆప్ అభ్యర్థి దాఖలు చేసిన పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ బి పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఆప్ అభ్యరి ్థకుల్దీప్ కుమార్‌కు అనుకూలంగా పడిన ఓట్లను ఉద్దేశపూర్వకంగా అనర్హమైనవిగా రిటర్నింగ్ అధికారి మార్చారని ధర్మాసనం పేర్కొంది. బబ్యాలట్ పేపర్లు చెల్లవని గుర్తించిన కారణంగానే తాను వాటిపై ఇంటూ మార్కు వేశానని రిటర్నింగ్ అధికారి సోమవారం కోర్టులో వాంగ్మూలం ఇచ్చారని, అయితే అవి అవి సక్రమంగానే ఉన్నట్లు తాము గుర్తించామని ధర్మాసనం తెలిపింది. రిటర్నింగ్ అధికారి ప్రవర్తనను రెండు ఉదంతాలలో తప్పుపట్టాల్సిన అవరం ఉందని, ఒకటి మేయర్ ఎన్నికల ప్రక్రియను ఇష్టారీతిగా మార్చినందుకు, మరొకటి కోర్టులో తప్పుడు వాంగ్మూలాన్ని ఇచ్చినందుకని ధర్మాసనం పేర్కొంది. ఈ కారణాల వల్ల ఆయనను బాధ్యుడిని చేయక తప్పదని తెలిపింది. ఆయన అనాలోచితంగా తప్పుడు వాంగ్మూలాన్ని ఇచ్చారని భావించలేమని కూడా ధర్మాసనం పేర్కొంది. చర్యలు ఎందుకు చేపట్టకూడదో సంజాయిషీ కోరుతూ అనిల్ మాసీకి షోకాజ్ నోటీసు జారీచేయాలని జుడిషియల్ రిజిస్ట్రార్‌ను ధర్మాసనం ఆదేశించింది. ఎన్నికల ప్రజాస్వామ్యానికి విఘాతం కలగకుండా చూడాల్సిన బాధ్యత తమకు ఉందని ధర్మాసనం తెలిపింది. యావత్ ప్రజాస్వామ్య వ్యవస్థ రాజ్యాంగ సూత్రాలపై ఆధారపడి ఉంటుందని, ఎన్నికల ప్రజాస్వామ్యానికి చెందిన మౌలిక తీర్పు సజావుగా వెలువడేందుకు న్యాయస్థానం చొరవచూపాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. మొత్తం ఎన్నికల ప్రక్రియను కొట్టివేయడం సబబు కాదని, ఓట్ల లెక్కింపు ప్రక్రియలో మాత్రమే అవకతవకలు జరిగినందున దాన్ని సరిచేయాల్సిన అవసరం ఉందని ధర్మాసనం తెలిపింది.
ప్రజాస్వామ్యాన్ని కాపాడిన సుప్రీంకోర్టు: కేజ్రీవాల్
ఈ క్లిష్ట సమయంలో ప్రజాస్వామ్యాన్ని సుప్రీంకోర్టు కాపాడిందని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. చండీగఢ్ మేయర్ ఎన్నికల కేసులో తీసుకున్న నిర్ణయానికి ఆయన సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. వివాదాస్పదంగా మారిన చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో పోలైన ఓట్లను రికౌంటింగ్ చేస్తామని తెలిపిన సుప్రీంకోర్టు వాటిని పరిశీలించి రిటర్నింగ్ అధికారి తోసిపుచ్చిన 8 బ్యాలట్ పేపర్లు చెల్లుబాటు అవుతాయని తీర్పు ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడినందుకు సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News