Sunday, June 23, 2024

రోగం తెలిసింది

- Advertisement -
- Advertisement -

 

 

వరుణ్ కి ఆ రోజు కూడా కడుపులో నొప్పి తగ్గలేదు. అప్పటికి నాలుగు రోజుల నుంచి కడుపులో నొప్పని మూలుగుతున్నాడు ఎనిమిదేళ్ళ వరుణ్. సరిగ్గా తినటం లేదు. తల్లీదండ్రీ ఇద్దరూ ఉద్యోగస్తులే. ఇద్దరూ చెరి రెండు రోజులూ సెలవు పెట్టి ఇంట్లో వుండి చూసుకున్నారు వరుణ్‌ని. రోజంతా మూలుగుతూ పడుకుంటున్న కొడుకుని చూసి తల్లడిల్లిపోయారు తల్లిదండ్రులు. మంచి పిల్లల డాక్టరుకి చూపించారు. పరీక్షలన్నీ చేయించారు. డాక్టర్‌కి కూడా అర్ధం కాలేదు..ఆ నొప్పి ఎందుకు వస్తోందో. అసలే వరుణ్ కి మూడు నెలల పరీక్షలు వస్తున్నాయి. వాటికి చదువుకోవాలి.

ఈ సమయంలో ఇన్ని రోజులు స్కూలు పోతే ఆ పాఠాలెలా అని తల్లిదండ్రులతోపాటు వరుణ్ కూడా ఆందోళన చెందుతున్నాడు. పోనీ పిల్లాడేమన్నా నాటకమాడుతున్నాడు పరీక్షలు ఎగ్గొట్టటానికి అనుకుంటే వరుణ్ తెలివిగలవాడే. బాగానే చదువుతాడు.
మార్కులు బాగానే వస్తాయి. అయితే తల్లితండ్రికి తమ కొడుకు తమకి మల్లే జీనియస్ కావాలని, సమాజంలో ఉన్నత స్ధానంలో వుండాలని కోరిక. అందుకే ఇంకా మంచి మార్కులు రావాలి, ఎప్పుడూ స్కూల్ ఫస్టు రావాలి అని చెబుతూ వుంటారు. నాలుగు రోజులయినా వరుణ్ కడపు నొప్పి తగ్గకపోయేసరికి వరుణ్ వాళ్ళ అమ్మమ్మనీ తాతయ్యనీ పిలిపించారు కొన్నాళ్ళు వరుణ్ ని చూసుకోవాలి రమ్మని. మరి వాళ్ళ సెలవులు వరుణ్ కోసమే అయిపోతాయి. ఏ జీతం నష్టం మీదయినా సరే సెలవు పెడదామంటే వాళ్ళ వుద్యోగ బాధ్యతలతో అది కుదరదు. వరుణ్ అమ్మమ్మ పేరు సుశీలమ్మ. తాతయ్య రావుగారు. వాళ్ళిద్దరూ తమ సొంత వూళ్ళోనే వుంటారు వాళ్ళ పిల్లలు వాళ్ళ దగ్గర వుండమని ఎంత చెప్పినా వినిపించుకోకుండా. అవసరమైనప్పుడు వచ్చి పోతుంటారు.
వాళ్ళు రాంగానే వరుణ్ తల్లిదండ్రులు వరుణ్ ని తమ తల్లిదండ్రులకప్పచెప్పి, అన్ని విషయాలూ చెప్పి ఆఫీసుకెళ్ళారు. సుశీలమ్మగారికి మనవడంటే తెగ ముద్దు. వాడి పక్కన చేరి కబుర్లు మొదలెట్టింది. అనుభవజ్ఞురాలుకదా. శరీరంలో లేని రుగ్మతలను ఎలా నయం చెయ్యాలో తెలిసినావిడ. అందుకే వరుణ్ తో స్కూలు ప్రస్తావన తీసుకురాకుండా, ఆటల గురించీ, స్నేహితుల గురించీ మాట్లాడింది. కథలు చెప్తూ సమయానికి తినిపించింది. కొంచెం సేపు హాయిగా నిద్రపోయేలా చేసింది. సాయంత్రం వరుణ్ తల్లిదండ్రులు వచ్చేసరికి వరుణ్ లో మార్పు చూసి ఆశ్చర్యపోయారు. ఒక్క రోజులోనే కడుపు నొప్పనే మూలుగు మానేశాడు. అమ్మమ్మ, తాతయ్యలతో కబుర్లు చెబుతున్నాడు. వాళ్ళు సంతోషంగా ఆ నాలుగు రోజులూ ఆగిపోయిన తమ పనులు చూసుకోవటంలో నిమగ్నమ యిపోయారు.

మర్నాడు వరుణ్ తల్లి రేఖ నొప్పి తగ్గింది కదా స్కూల్ కి వెళ్తావా అని అడిగింది వరుణ్ ని. వరుణ్ కి ఏమి చెప్పాలో తోచక అమ్మమ్మ వంక చూశాడు. వాడి వరిస్ధితి గమనించిన సుశీలమ్మగారు ఇవాళొక్కరోజూ వుండనియ్యిలే. రేపటినుంచీ వెళ్తాడు అన్నది. రేఖ ఏదో అనబోయి మళ్ళీ తల్లి సమర్ధత తెలి సింది గనుక మాట్లా డకుండా ఆఫీసుకి వెళ్ళిపోయింది. వాళ్ళెళ్ళిపోయాక మొదలయ్యాయి అమ్మమ్మా మనవళ్ళ కబుర్లు. ఏంట్రా నీకు బడి అంటే ఇష్టమేకదా. ఎప్పుడూ ఎగ్గొట్టవుకదా. మరి ఈ కడుపు నొప్పేమిటి?

నిజంగానే నొప్పా లేకపోతే అమ్మని బురిడీ కొట్టించటానికి అలా చెప్పావా? అని అడిగింది సుశీలమ్మ. అదేం లేదు అమ్మమ్మా. నిజంగానే నొప్పి వచ్చింది. నాకు స్కూలంటే ఇష్టమే. బాగానే చదువుతాను. మార్కులూ బాగానే వస్తాయి. కానీ అమ్మా, నాన్నకి ఈ మార్కులు సరిపోవు. ఎప్పుడూ స్కూలు ఫస్టు రావాలంటారు. దానికోసం సబ్జక్టుకో టీచర్ దగ్గర ట్యూషన్ పెడతానంటారు. ఇప్పుడే ఎక్కువ సేపు ఆడుకోనివ్వరు. ఇంక ఈ ట్యూషన్లన్నీ మొదలయితే నాకు ఆడుకో వటానికి టైముండదు.
అదేమిట్రా..సెలవు రోజుల్లో ఏమి చేస్తావు? అప్పుడు రోజంతా ఆడుకోవచ్చుకదా! మా సెలవులప్పుడే అమ్మా నాన్నలకి కూడా సెలవలు కదా. ఇంక నేనెట్లా ఆడుకోను? వాళ్ళతోబాటు సినిమాలు, షికార్లు, వాళ్ల స్నేహితుల ఇళ్ళకి వెళ్ళటం. పోనీ నేను ఇంట్లో వుంటానంటే ఒప్పుకోరు. వాళ్ళతో వెళ్ళాల్సిందే. నువ్వే చెప్పు అమ్మమ్మా, నాకు నా స్నేహితులతో ఆడుకోవటం సరదాగా వుంటుందా వాళ్ళ స్నేహితుల ఇళ్ళకి వెళ్ళటమా. పోనీ అక్కడ పిల్లలతో ఆడుకుం దామనుకున్నా అక్కడా అందరి మధ్యా ఇవే మాటలు..ఎవరే క్లాసు చదువుతున్నారు… ఎవరికెన్ని మార్కులొచ్చాయి. నాకు విసుగొచ్చేస్తోంది అమ్మమ్మా. ఒక్కోసారి ఎక్కడికన్నా పారిపోదామనిపిస్తోంది.

ఒక్కసారి ఉలిక్కిపడ్డారు సుశీలమ్మగారు. వద్దు నాన్నా..అలాంటి పిచ్చి పని ఎప్పుడూ చెయ్యకు. ఇంట్లో వుంటే నీకు ఆటలు లేవేమో…బయటకెళ్తే జీవితమే వుండదు. నీకు తిండెవరు పెడతారు? స్కూలుకెవరు పంపుతారు? బట్టలెవరు కొంటారు? నీకు ఏదన్నా నొప్పి వస్తే ఎవరు చూస్తారు?…అసలు నువ్వెక్కడ వుంటావు? ఎన్నో ప్రశ్నలు. వాటన్నిటినీ మీలాంటి చిన్న పిల్లలు ఎదుర్కోలేరు. అందుకే అలాంటి ఆలోచనలే చెయ్యకూడదు. నీకు కావాల్సింది ఏమిటో సరిగా ఆలోచించుకుని, అమ్మా నాన్నని అడిగి తీసుకోవటం నేర్చుకో. వాళ్ళకన్నా మిమ్మల్ని ప్రేమించేవాళ్ళుండరు. అమ్మా నాన్నలకి నీమీద ప్రేమ ఎక్కువయి, నువ్వు సమాజంలో అందరికన్నా ఉన్నత స్ధాయిలో వుండాలని నీకిలా చెబుతు న్నారేమో. వాళ్ళతో నేను మాట్లాడుతానులే. నువ్వు చక్కగా ఆడుకుంటూ చదువుకో. రేపటినుంచి.. రేపటినుంచి ఏమిటి ఇప్పటినుంచే నీకు ఆడుకోవటానికి కూడా సమయం వుండేటట్లు నేను చూస్తానుకదా. వెళ్ళి చక్కా ఒక గంటా, గంటన్నర బయట ఆడుకునిరా. మీ అమ్మతో నేను మాట్లాడ తానుగా. వరుణ్ కడుపు నొప్పి మొదటి రోజు అమ్మమ్మ కబుర్లతోనే తగ్గి పోయింది. ఇప్పు డు అమ్మమ్మ అభయంతో పూర్తి ఉత్సాహం వచ్చింది. తూనీగలాగా బయటకి పరిగెత్తాడు.

సుశీలమ్మగారికి అర్ధం అయింది. పెద్దలకే కాదు, చిన్న పిల్లలకు కూడా ఒత్తిళ్ళు వుంటాయి. తల్లిదండ్రులతోనూ, స్కూల్ లోనూ, తోటి పిల్లలతోనూ వాళ్ళ స్ధాయికి తగ్గవో, ఒక్కోసారి మించినవో వుంటాయి. .. అవేమిటో వాళ్ళకి అర్ధం కావు … తెలుసుకుని తమ ఇబ్బంది ఇదీ అని చెప్పే వయసు కాదు. పెద్దవాళ్ళే పిల్లల గురించి ఆలోచించి వాళ్ళంత లేత వయసు నుంచీ ఒత్తిళ్ళపాలు కాకుండా చూడాలి. వరుణ్ విషయంలో అదే అయింది.  తల్లీ తండ్రీ వాడిని వాళ్ళ పరిధిలో పెంచుతున్నారుగానీ, వాళ్ళు వరుణ్ స్ధాయికి దిగివచ్చి వాడి ఇబ్బందులేమిటో ఆలోచించటంలేదు. ఆ ఒత్తిడి అర్ధం చేసుకోలేక, తట్టుకోలేక వరుణ్ కి వాడికి తెలియకుండానే రోగాలొస్తున్నా యి.శరీరంలో లేని రోగాలకి ఏ డాక్టరయినా ఏం మందిస్తారు. కూతురుకీ, అల్లుడికీ విషయం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తు న్నారు సుశీలమ్మగారు.

పి.యస్.యమ్. లక్ష్మి
98660 01629

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News