Friday, March 29, 2024

సర్వ దేవతల నివాసస్థలం…. దేవ ప్రయాగ

- Advertisement -
- Advertisement -

Devprayag sangam

మన దేశంలో ఉన్న 108 దివ్య తిరుపతులలో దేవప్రయాగ కూడా ఒకటి. ప్రపంచంలోనే అత్యంత మోక్షదాయకమైన క్షేత్రంగా దేవ ప్రయాగను పురాణాలు చెబుతున్నాయి. కేదార్‌నాథ్ నుంచి బద్రీనాథ్ వెళ్లే మార్గంలో ఉన్న ఈ దివ్యక్షేత్రం ఉత్తరాఖండ్‌లోని టేహ్రీగర్వాల్ జిల్లాలో ఉంది. ప్రశాంతమైన వాతావరణం, అద్భుతమైన ప్రకృతి అందాల నడుమ అలరారుతున్న ఈ క్షేత్రం సముద్ర మట్టానికి 2723 అడుగుల ఎత్తులో ఉంది. మందాకిని, అలకనంద నదులు ఈ ప్రాంతంలోనే సంగమిస్తాయి. ఇక్కడ మూడు నదుల సంగమం జరిగిందని విష్ణుపురాణం చెబుతోంది.

మానాలో లుప్తమైన సరస్వతీనది ఇక్కడ పాతాళం నుంచి పైకి వచ్చి రఘునాథుని పాదాల చుట్టూ ప్రదక్షిణ చేసుకొని భగీరథి, అలకనంద సంగమించిన చోట తిరిగి పాతాళానికి వెళ్లిపోతుందంటారు. అలాగే గంగానదిని ఈ ప్రాంతం నుంచే గంగానది అని పిలుస్తారు. ఈ ప్రాంతంలో బ్రహ్మచర్యవ్రతంతో నాలుగు నెలలపాటు అష్టాక్షరి మంత్రం జపిస్తే మోక్షప్రాప్తి కలుగుతుందని భక్తులు నమ్ముతారు. ఈ విషయాన్ని శివుడు నారదుడితో చెప్పినట్టు స్కంధ పురాణం ద్వారా అవగతమవుతోంది.

పురాణాల ప్రకారం దశరథ మహారాజు, శ్రీరామచంద్రుడు ఇక్కడ శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేశారని, పాండవులు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించి స్నానాన్ని ఆచరించి స్వామిని దర్శించుకున్నారని ఇక్కడి స్థల పురాణాలు చెబుతున్నాయి.
ఓ అపురూపమైన స్మృతులను మిగిల్చే ఈ దివ్య క్షేత్రం ప్రకృతి అందాలకు నెలవు. ఎటు చూసినా మనోహరమైన కొండలు, గుట్టలు, జలపాతాలు ఈ ప్రాంతానికి వచ్చే పర్యాటకులను ముగ్ధుల్ని చేస్తాయి.

ఈ దివ్య క్షేత్రానికి చేరుకునే మార్గం ఘాట్ రోడ్డు మార్గం. ఎగుడు దిగుడు, మలుపులు తిరిగిన ఘాట్ రోడ్డు మీదుగా సాగిపోయే పయనం భక్తులకు కాస్తంత గగుర్పాటుతో పాటు అపూర్వమైన అనుభూతులను సొంతం చేస్తుంది.
పూర్వం దేవశర్మ అనే ముని ఈ ప్రదేశంలో తపస్సు చేయడం వల్ల ఈ క్షేత్రానికి దేవప్రయాగ అని పేరు వచ్చిందని ఒక కథ ప్రచారంలో ఉంది. దేవప్రయాగ అంటే దేవతలు కలిసే చోటు అని అర్ధం కాబట్టి ఈ ప్రదేశం సర్వదేవతలు నివాసస్థలమని మరో కథ ప్రచారంలో ఉంది.

చుట్టూ ఎత్తైన కొండలు, ఒకవైపున అలకనంద ఉరుకులు పరుగులతో వచ్చి, గోముఖ్ గంగోత్రి హిమనీనదములో పుట్టిన భగీరథితో కలిసి ‘గంగ’గా అవతరించి దిగువకు ప్రవహించడం ఒక అద్భుతాన్ని ఆవిష్కరింప చేస్తుంది.
రెండు నదుల సంగమ ప్రదేశంలో ‘తొండేశ్వర మహదేవ్’ మందిరం వుంది. ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులు ముందుగా ఇక్కడ సంగమ క్షేత్రంలో భక్తితో స్నానాదికాలు చేస్తారు. అనంతరం తొండేశ్వర మహాదేవ్ మందిరంలో కొలువైన మహాదేవ లింగాన్ని భక్తితో దర్శించుకుంటారు. ఈ సంగమాన్ని అత్తాకోడళ్ల సంగమం అనికూడా అంటారు.
దేవప్రయాగలో ముఖ్యంగా మూడు పర్వత శిఖరాలు దర్శనమిస్తాయి. వీటిని గిద్దాంచల్, దశరథాంచల్, నృసింహాంచల్‌గా చెబుతారు. ఇక్కడ మహావిష్ణువు రఘునాథ్‌గా పూజాదికాలు అందుకుంటున్నాడు. ఈ రఘునాథ్ మందిరం గిద్దాంచల్ శిఖరాన దర్శనమిస్తుంది.

ఈ సంగమానికి కుడి వైపున వున్న రఘునాథ్ మందిరం చేరుకోవాలంటే బదరీనాథ్ రోడ్డు మీద వున్న బజారు రోడ్డు దగ్గర నుంచి కాలినడకన సుమారు అర కిలోమీటరు నడక ద్వారా చేరుకోవచ్చు. సన్నని దారిలో వెళ్లి వేలాడే వంతెన దాటి ఈ మందిరం చేరుకోవాల్సి ఉంటుంది.
వేలాడే వంతెన మీద వూగుతూ సాగే నడక, కిందన గలగల ప్రవహిస్తున్న భగీరథి ఎదురుగా అలకనందతో సంగమిస్తూ కనిపించే దృశ్యం భక్తులకు, యాత్రికులకు కావల్సినంత మానసికానందాన్నిస్తుంది.
విశాలమైన ప్రాంగణంలో నిర్మించిన రఘునాథ్‌జీ మందిర గోపురం అల్లంత దూరం నుంచే దర్శనమిస్తుంది. గర్హాల్ మందిరాల నమూనాకు మల్లే ఈ మందిరం కూడా దర్శనమిస్తుంది.

ఈ మందిరాన్ని ఆదిశంకరాచార్యుల వారు నిర్మించినట్లు ఇక్కడి స్థల పురాణాలు చెబుతున్నాయి. అనంతర కాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు.
ఈ మందిరం పురాతన రాతికట్టడం. సుమారు ముప్పై ఎత్తైన మెట్లు ఎక్కి ఆలయానికి చేరుకోవచ్చు. పక్కగా వున్న ద్వారం గుండా లోపలికి వెళితే ముందుగా సీతాదేవి మందిరం దర్శనమిస్తుంది. ఈ మందిరంలో కొలువైన సీతామాత దర్శనం సర్వ మంగళకరంగా భక్తులు భావించి కైమోడ్పులర్పిస్తారు. దీనికి సమీపంలోనే గరుడ మందిరం ఉంది.
గర్భాలయం నిత్యం రఘునాథ్‌జీ నామస్మరణంతో మారుమోగుతోంది.

ఇక్కడ స్వామి నిలుచున్న భంగిమలో దర్శనమిస్తాడు. స్వామి మూల మూర్తికి సమీపంలో ఉత్సవ మూర్తి ఉంది. సర్వాభూషణ శోభితంగా కానవచ్చే రఘునాథుడి దర్శనం పూర్వ జన్మల పుణ్య ఫలం. స్వామి వారికి సమీపంలో హనుమంతుని మూర్తిని కూడా దర్శించుకునే భాగ్యం భక్తులకు కలుగుతుంది.
మందిర ప్రాంగణంలోనే మరో చిన్న మందిరంలో శంకర భగవత్పాదుల విగ్రహం దర్శనమిస్తుంది. అయితే 2013లో సంభవించిన వరదలలో కొత్త కట్టడాలు కొట్టుకుపోయినా ఈ మందిరానికి ఎలాంటి హాని కలుగక పోవడం స్వామివారి లీలా విశేషంగా చెబుతారు.

దేవప్రయాగలో రఘునాథ్ మందిరమే కాక ధనేశ్వర మహదేవ మందిరం, మాతా భువనేశ్వరీదేవి మందిరం, దండ నాగేశ్వర మందిరాలున్నాయి.  ఓ విశేషమైన ఆధ్యాత్మికమైన ఆనందాన్ని, అనిర్వచనీయమైన అనుభూతులను సొంతం చేసే మహత్తర క్షేత్రం దేవప్రయాగ. ఇక్కడ కొలువైన రఘునాథుడి దర్శనం పూర్వజన్మల పుణ్య ఫలం.

ఉత్సవాలు, పండుగలు :

ప్రతి ఏటా డిసెంబర్, జనవరి నెలల్లో ఈ ఆలయంలో మహాపూజ ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ధనుర్మాసం ప్రారంభం నుంచి మొదలుకుని, మకర సంక్రాంతి వరకు ఈ ఉత్సవాలు సాగుతాయి. ఆయా రోజుల్లో వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో విష్ణు సంక్రాంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి పర్వదినాల్లోనూ రామ్‌లీలా పేరుతో సాం స్కృతిక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రావణుడిపై రాముడు సాధించిన విజయా నికి గుర్తుగా దీనిని నిర్వహిస్తారు.

ఎలా చేరుకోవాలి?

ఈ దివ్య క్షేత్రం రుషికేశ్ నుంచి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో, రుద్రప్ర యాగ నుంచి సుమారు నలబై కిలోమీటర్లు ఉంది. అందువల్ల ఈ దివ్య క్షేత్రాన్ని దర్శించాలనుకున్న భక్తులు రిషికేష్ వరకు వచ్చి అక్కడ నుంచి ఏదైనా వాహనంలో చేరుకోవచ్చు.

– దాసరి దుర్గాప్రసాద్

77940 96169

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News