Saturday, April 27, 2024

పతంగులతో పాటు పక్షులను ఎగురనిద్దాం!

- Advertisement -
- Advertisement -

Chinese Manza

 

హైదరాబాద్ : సంక్రాంతి పండగను అందరూ ఆనందంగా జరుపుకోవాలి. కానీ పతంగుల వల్ల పర్యావరణం, పక్షులకు హాని జరగకుండా చూడాలని అటవీ శాఖ కోరింది. పతంగులతో పాటు పక్షులనూ ఎగరనిద్దాం అనే నినాదంతో చైనీస్ మాంజా వాడకం వల్ల అనర్థాలపై అందరూ అవగాహన కలిగిఉండాలని అటవీ శాఖ కోరింది. పతంగులను ఎగుర వేసేందుకు ఉపయోగించే చైనీస్ మాంజా (చైనా దారం) వల్ల తీవ్ర అనర్థాలు జరుగుతున్నాయని అటవీ శాఖ తెలిపింది. కైట్స్ ఎగరవేసేందుకు గ్లాస్ కోటింగ్ తో ఉన్న నైలాన్ , సింథటిక్ తాడు వాడుతున్నారు. పండగ తర్వాత ఎక్కడికక్కడ ఈ వ్యర్థాలు మిగిలిపోయి పర్యావరణం, పక్షులకు హాని జరుగుతోంది.

దారంలో చిక్కుకున్న పక్షులు విలవిల్లాడి, చనిపోతున్నాయి. మనుషులు కూడా గాయపడుతున్నారు. చైనీస్ మాంజా బదులు సంప్రదాయ కాటన్ దారాలను పతంగుల కోసం వాడాలని అధికారులు సూచించారు. ఈ పండగ సీజన్ లో దేశవ్యాప్తంగా నలుగురు చైనీస్ మాంజా బారినపడి చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. (రెండు రోజుల కింద గుంటూరు లో ఓ బాలుడి మెడకు మాంజా చుట్టుకోవటంతో చికిత్సపొందుతూ మృతి చెందాడు.) జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రం లో కూడా చైనా మాంజా వినియోగాన్ని నిషేధించామని పిసిసిఎఫ్ఆర్.శోభ వెల్లడించారు. పోలీసులతో పాటు ఇతర శాఖలతో సమన్వయంతో మాంజా వాడకాన్ని అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఎన్‌జిఒల సహకారంతో స్కూలు పిల్లలతో పాటు అందరికీ అవగాహన కల్పిస్తున్నామన్నారు. చైనా మాంజా అమ్మినా, నిలువ, రవాణా చేసినా ఐదేళ్ళు జైలు శిక్ష, లక్ష రూపాయల దాకా జరిమానా ఉందని, మాంజా వాడకం వల్ల మనుషులకు, పక్షులకు హాని జరిగితే 3 నుంచి 7 ఏళ్ల దాకా జైలు శిక్ష రూ. 10వేల జరిమానా ఉంటుందన్నారు. గత నాలుగేళ్లలో సుమారు వెయ్యి కిలోల దాకా చైనీస్ మాంజా సీజ్ చేశామని, 123 కేసులు పెట్టామని పిసిసిఎఫ్ (అడ్మిన్) మునీంద్ర తెలిపారు. చైనా దారం దిగుమతి వల్ల స్థానికంగా కాటన్ తో పంతుగుల దారం తయారు చేసేవాళ్లు ఉపాధి కోల్పోతున్నారు.

చైనా మాంజా రవాణా చేస్తే వాహనాలు కూడా సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు. పండగ సీజన్ లో నిఘా కోసం ప్రత్యేకంగా ఐదు టీమ్ లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. చైనా దారం అమ్మకం గురించిన వివరాలు తెలిస్తే అటవీ శాఖ టోల్ ఫ్రీ నెంబర్లు 040..-23231440, 18004255364 తెలియజేయాలన్నారు. ఈ సమావేశంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన అటవీ అధికారులు, విజిలెన్స్, యాంటీ పోచింగ్ సిబ్బంది, అటవీ శాఖ ఒఎస్‌డి
శంకరన్‌తో పాటు పలు స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Chinese Manza Prohibition
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News