Sunday, June 4, 2023

ఘనకీర్తి చాటాలి

- Advertisement -
- Advertisement -

అమరుల త్యాగాలను స్మరిస్తూ..ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ‘దశాబ్ది’ ఉత్సవాలు

వేడుకల నిర్వహణకు రూ.105 విడుదలకు ఆదేశం

మంత్రులు, ఎంఎల్‌ఎలు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ఉత్సవాలు నిర్వహించాలి
పదేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని ప్రజలకు చాటిచెప్పాలి
ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలి
ఉద్యమ నాయకత్వ పాలనలో ప్రగతి సాధించడం కష్టమనే భావన పటాపంచలు చేశాం
ఎలాంటి భావోద్వేగాలకు గురికాకుండా నిర్దిష్ట లక్షసాధనతో దూసుకెళ్తున్నాం
తత్ఫలితంగా
ఆదర్శవంతమైన, సమర్థవంతమైన పాలనను అందించగలిగాం
తక్కువ సమయంలోనే రాష్ట్రంలో అన్నిరంగాల్లో సమ్మిళిత అభివృద్ధి సాధించాం
దేశంలోనే వ్యవసాయం, ఐటి, విద్యుత్ తదితర రంగాల్లో తెలంగాణ ముందంజ
గత పాలకుల నిర్ల్యక్షానికి కునారిల్లిన వ్యవసాయ రంగాన్ని పునరుజ్జీవింపజేయడానికి ప్రథమ ప్రాధాన్యం కల్పించాం
కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు

ఉద్యమ నాయకత్వమే స్వయంగా పాలన చేస్తే ప్రగతి సాధించడం కష్టం అనే అపోహను పటాపంచలు చేస్తూ ఎటువంటి భావోద్వేగాలకు గురికాకుండా పరిపాలనను నిర్దిష్ట లక్ష్యంతో ముందుకు కొనసాగించడం జరిగింది. తత్పలితంగా దేశానికే ఆదర్శవంతమైన పాలనను అందించగలిగాం. నేడు విద్యా, వైద్య రంగాల్లో తెలంగాణ అత్యద్భుత ఫలితాలను అందుకుంటూ దేశానికే ఆదర్శంగా నిలిచింది.

ఒకనాడు గంజి కేంద్రాలు నడిచిన పాలమూరులో నేడు పచ్చని పంటలతో పారే వాగులతో పాలుగారే పరిస్ఠితి నెలకొన్నది. ధాన్యం ఉత్పత్తిలో మనం పంజాబ్‌ను దాటేసి పోతున్నం.

మన తెలంగాణ: హైదరాబాద్: పోరాటాలు, త్యాగాలతోప్రజాస్వామ్య పం థాలో సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రం లో చేరుకున్నప్రగతి ప్రస్థానాన్ని తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా, అమరుల త్యాగాలు స్మరిస్తూ, ప్రజల అకాంక్షలకు అనుగుణంగా ఘనంగా జరపాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జూన్ 2 నుంచి మూడు వారాల పాటు సాగే ఈ ఉత్సవాలు తెలంగాణ ఘనకీర్తిని చాటిచెప్పేలా వాతావరణంలో జరపాలని సిఎం అన్నారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఖర్చుల నిమి త్తం కలెక్టర్లకు 105 కోట్ల రూపాయల నిధు లు విడుదల చేయాల్సిందిగా ఆర్థిక శాఖను సిఎం కెసిఆర్ ఆదేశించారు.

గురువారం డా. బిఆర్.అంబేద్కర్‌తెలంగాణ లోతెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కార్యాచరణ, ఏర్పాట్లపై దిశానిర్దేశం చే సేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆదర్శంగా తెలంగా ణ హరితహారం సాధించిన విజయాలను సి ఎం కెసిఆర్ వివరించారు. వాతావరణ పరిస్థితలకు అనుగుణంగావరి పంట నాట్లను ఇప్పుడు అనుసరిస్తున్న ధోరణిలో కాకుండా ముందస్తుగా సకాలంలో నాటు వేసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాల గురించి సిఎం వివరించారు. అదే సందర్భంలో…గిరిజనులకు పోడు పట్టాల పంపిణీ గురించి సిఎం ప్రకటించారు.

ఆదర్శంగా నిలిచిన శాఖలకు సిఎం అభినందనలు
దశాబ్ధి ఉత్సవాల నిర్వహణ ప్రధాన ఉద్దేశ్యంగా.. ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ ఏర్పడే నాటికి వున్న పరిస్థితులను పదేండ్లకు చేరుకున్న స్వరాష్ట్ర పరిపాలనలో సాధించిన గుణాత్మక అభివృద్ధిని సిఎం కెసిఆర్ రంగాల వారీగా వివరించారు. ఏ రోజు కారోజుగా రోజువారీ కార్యక్రమాలను వివరించిన ముఖ్యమంత్రి ఆయా రోజుల్లో చేపట్టే శాఖలు అవి సాధించిన అభివృద్ధిని వివరిస్తూ…అందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన ప్రజాసంక్షేమ కోణాన్ని తాత్విక ధోరణి దాని వెనకున్న దార్శనికతను కలెక్టర్లకు సిఎం కెసిఆర్ అర్థం చేయించారు.గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జూన్ 2 నుంచి 22 వరకు ఏరోజున ఏ కార్యక్రమం చేపట్టాలో కలెక్టర్లకు సిఎం వివరించారు. ఈ మూడు వారాల ఉత్సవాల విశిష్టతను, ప్రాముఖ్యత ప్రాశస్త్యాన్ని వివరించారు. గ్రామాలు, నియోజకవర్గాలు, జిల్లాల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, క్షేత్రస్థాయిలో వాటి నిర్వహణ గురించి సిఎం కెసిఆర్ సమావేశంలో అంశాల వారీగా లోతుగా విశదీకరించారు.

మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్లకు సిఎం కెసిఆర్ దిశా నిర్దేశం చేశారు. పదేండ్లకు చేరుకున్న ప్రగతి ప్రస్థానంలో ఆదర్శంగా నిలిచిన ఆయా శాఖలకు సిఎం అభినందనలు తెలిపారు. వ్యవసాయం విద్యుత్తు సాగునీరు ఆర్ అండ్ బి తదితర శాఖల మంత్రులను అధికారులను సిఎం అభినందించగా సమావేశం చప్పట్లతో హర్షం వ్యక్తం చేసింది. కాగా… సిఎం కెసిఆర్ ఆదేశాలను అనుసరించి ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ సాధించిన అభివృద్దిని దేశం నలుదిక్కులా కనిపించేలా తెలంగాణ గరిమ ప్రస్పుటించేలా చాటేందుకు, పండుగ వాతావరణంలో దశాబ్ధి ఉత్సవాలను నిర్వహించేందుకు తాము ఈ మూడు వారాలు కృషి చేస్తామని కలెక్టర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఉన్నతాధికారులు,కలెక్టర్లు,ఎస్‌పిలు పాల్గొన్నారు.

అన్ని రంగాల్లో సమ్మిళితాభివృద్ధిని సాధించుకున్నాం
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…“కొన్ని దశాబ్దాల పోరాటాల తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం అందరం కలిసి సమిష్టి కృషితో అతి తక్కువ కాలంలోనే అన్ని రంగాల్లో సమ్మిళితాభివృద్ధిని సాధించుకున్నాం. నేడు తెలంగాణ వ్యవసాయం ఐటి పరిశ్రమలు విద్యుత్ సహా అన్ని రంగాల్లో దేశంలోనే ముందంజలో వున్నది. నూతన రాష్ట్రంగా ఏర్పడ్డ నాటికి మనకన్నా ముందంజలో వున్న గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్, హర్యానాలను దాటేసి తెలంగాణ ముందంజలోకి దూసుకుపోతున్నది. రాష్ట్రం వచ్చిన్నాడు కేవలం 8 లక్షల టన్నులుగా వున్న ఎరువుల వినియోగం నేడు 28 లక్షల టన్నులు వాడుతున్నం. వొక పద్ధతి ప్రకారం ఎటువంటి ఇబ్భంది రాకుండా ఎరువలను ఇతర వ్యవసాయ అవసరాలను రైతులకు అందుబాటులోకి తేవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శించిన దార్శినిక విధానాలతోనే ఇది సాధ్యమైంది. వొకనాడు గంజి కేంద్రాలు నడిచిన పాలమూరులో నేడు పచ్చని పంటలతో పారే వాగులతో పాలుగారే పరిస్ఠితి నెలకొన్నది. ధాన్యం ఉత్పత్తిలో మనం పంజాబ్‌ను దాటేసి పోతున్నం” అని సిఎం వివరించారు.

నేడు విద్యా వైద్య రంగాల్లో తెలంగాణ అత్యద్భుత ఫలితాలను అందుకుంటూ దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. తెలంగాణ విద్యార్థుల నీట్ , ఐఎఎస్ పోటీ పరీక్షల్లో దేశంలోనే ముందువరసలో ర్యాంకు లు సాధిస్తూ తెలంగాణ కీర్తిని చాటుతుండడం పట్ల సీఎం హర్షం వక్తం చేశారు. విద్యార్థులను అభినందించారు. కాగా నారాయణ్ పేట్ ఎస్పీ వెంకటేశ్వర్లు కూతురు సివిల్ సర్వీసెస్ లో జాతీయ స్థాయిలో మూడో ర్యాంకును సాధించిన నేపథ్యంలో సమావేశం అభినందనలు తెలిపింది.

వీడియో రికార్డు చేసి భద్రపరచాలి
21 రోజుల పాటు జరిగే దశాబ్ధి ఉత్సవాలను జిల్లాల వారీగా వీడియో రికార్డు చేసి భధ్రపరచాలని సిఎం కలెక్టర్లను ఆదేశించారు. అదే సందర్భంలో నియోజకవర్గాల వారీ జిల్లాల వారీగా జరిగిన అభివృద్ధిని తెలిపే .. పదేండ్ల ప్రగతి నివేదిక.. పుస్తకాలను ముద్రించి అందచేయాలన్నారు.ఇప్పటికే నిర్ణయించిన మేరకు ఆయా రంగాల్లో సాధించిన అభివృద్ధిని డాక్యుమెంటరీలు రూపొందుతున్నాయని, వాటిని ఈ ఉత్సవాల సందర్భంగా ప్రదర్శించాలని ఆదేశించారు.
గిరిజనులకు పోడు భూముల పట్టాలు

జూన్ 24 నుంచి 30 తారీఖు వరకు గిరిజనులకు పోడు పట్టాల పంపిణీ
రాష్ట్రవ్యాప్తంగా 2,845 గ్రామాలు తాండాలు గూడాల పరిధిలో ఆదివాసీ గిరిజనుల ఆధ్వర్యంలో వున్న4,01,405 ఎకరాల పోడు భూములకు పట్టాలు అందచేయాలని సిఎం ఆదేశించారు. తద్వారా1,50,224 మంది గిరిజనులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఆ వెంటనే ప్రతి లబ్ధిదారుని పేరుతో ప్రభుత్వమే ఐఎఫ్‌ఎస్ కోడ్‌తో కూడిన బ్యాంకు ఖాతాను తెరిపించాలని, ఈ బాధ్యత గిరిజన సంక్షేమ శాఖ, కలెక్టర్లదేనని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. ఈ ఖాతాల ద్వారా లబ్ధిదారులకు రైతుబంధును ప్రభుత్వం అందచేస్తుందని సిఎం తెలిపారు. వీరితో పాటు 3 లక్షల 8 వేల మంది ఆర్‌ఒఎఫ్‌ఆర్ పట్టాదారులకు రైతుబంధును వర్తింపచేస్తామని సిఎం అన్నారు.

బిసి ఎంబిసి కులాలకు ఆర్థిక సాయం
రాష్ట్రంలో కులవృత్తుల మీద జీవనం కొనసాగిస్తున్న విశ్వకర్మలు తదితర బిసి, ఎంబిసి కులాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం లక్షరూపాయల ఉచిత ఆర్థిక సాయాన్ని అందిస్తుందని సిఎం ప్రకటించారు. బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతను ఏర్పడిన సబ్ కమిటీ సమావేశమై ఇందుకు సంబంధించిన విధి విధానాలు ఖరారు చేయాలన్నారు. జూన్ 9 నాడు జరుపుకునే తెలంగాణ సంక్షేమ సంబురాల్లో సబ్ కమిటీ సిఫారసు చేసిన కులాలకు లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందించనున్నారు.

గృహలక్ష్మి పథకం
నియోజకవర్గానికి 3 వేల చొప్పున అర్హులైన లబ్ధిదారులకు గృహలక్ష్మి పథకాన్ని వర్తింపచేయాలని సిఎం కెసిఆర్ సూచించారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో గృహలక్ష్మి పథకం కొనసాగుతుందని సిఎం స్పష్టం చేశారు.ఇంటి నిర్మాణానికి సంబంధించి దశలవారీగా పథకాన్ని వర్తింపచేయాలన్నారు. సొంతజాగాలున్న లబ్ధిదారులకు మొదటి దశ అనగా బేస్‌మెంట్ దశలో 1 లక్ష రూపాయలు, స్లాబ్ దశలో మరో లక్ష రూపాయలు, ఇంటి నిర్మాణం పూర్తయిన ఆఖరి దశలో మరో లక్షరూపాయలు మొత్తంగా మూడు లక్షల రూపాయలు అందచేయాలని సిఎం తెలిపారు.

నియోజకవర్గానికి 1,100 మందికి దళితబంధు
ప్రతీ నియోజకవర్గానికి 1,100 వందల మంది లబ్ధిదారులను ఎంపిక చేసి క్రమపద్దతిలో దళితబంధు పథకాన్ని అమలు చేయాలని సిఎం తెలిపారు.గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని కూడా దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా ప్రారంభించి దశలవారీగా అమలు చేయాలని సిఎం తెలిపారు. జూన్ 2వ తేదీ నుండి 22వ తేదీ వరకు మూడు వారాల పాటు సాగే.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల రోజు వారీ కార్యక్రమాల పూర్తి వివరాలను గురువారం నాటి సమావేశంలో కలెక్టర్లకు సిఎం వివరించారు. ఈ దిశగా దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ విజయవంతం చేయాలని ఆదేశించారు.

జూన్ 2 దశాబ్ధి ఉత్సవాల ప్రారంభోత్సవం
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు జూన్ 2న సిఎం కెసిఆర్ ప్రారంభిస్తారు. గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద సిఎం నివాళులర్పిస్తారు.అనంతరం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సచివాలయం ప్రాంగణంలో ముఖ్యమంత్రి పతాకావిష్కరణ చేసి, దశాబ్ది ఉత్సవ సందేశం ఇస్తారు. జిల్లాల్లో మంత్రుల ఆధ్వర్యంలో పతాక వందనం, దశాబ్ది ఉత్సవ సందేశం ఉంటుంది.

జూన్ 3వ తేదీ – శనివారం – తెలంగాణ రైతు దినోత్సవం
రాష్ట్రంలోని అన్ని రైతు వేదికల్లో క్లస్టర్ పరిధిలోని గ్రామాల రైతుల సమావేశం ఉంటుంది. సమావేశం జాతీయగీతాలపనతో ప్రారంభం కావాలి. రైతు వేదికలను మామిడి తోరణాలు, పువ్వులు, సీరియల్ బల్బులతో అద్భుతంగా అలంకరించాలి.రైతు వేదికల ప్రాంగణాల్లోనూ, హాలు లోపల కూడా రాష్ట్ర వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలపై పోస్టర్లు పెట్టాలి. ఉచిత కరెంటు, రైతు బంధు, రైతు బీమా తదితర పథకాల విశిష్టతను తెలియజేసే విధంగా ఫ్లెక్సీలు ఉండాలి. రైతు బీమా లబ్దిదారులతో వారి కుటుంబానికి కలిగిన మేలును సభలో మాట్లాడించాలి. రైతులతో సామూహిక భోజనం చేయాలి.

జూన్ 4 సురక్షా దినోత్సవం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని, స్నేహపూర్వక విధానాన్ని, సమర్ధవంతమైన సేవలను వివరించే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలి. పోలీసుశాఖలో జరిగిన సంస్కరణలను, వాటి విశిష్టతను సభల ద్వారా, కరపత్రాల ద్వారా ప్రజలకు తెలియజేయాలి.పాస్ పోర్ట్ వెరిఫికేషన్ ప్రక్రియను సత్వరంగా పూర్తి చేయడంలో తెలంగాణ పోలీస్ గత 8 సంవత్సరాలుగా దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిన విషయాన్ని హైలైట్ చేయాలి. ఈ విధంగా పోలీసుశాఖ సాధించిన ఘనతలను, విజయాలను ప్రజలకు తెలియజేసే కార్యక్రమాలను చేపట్టాలి.

జూన్ 6 పారిశ్రామిక ప్రగతి ఉత్సవం
పారిశ్రామిక వాడలు, ఐటీ కారిడార్లలో సభలు నిర్వహించాలి. ఈ సభలో పారిశ్రామిక రంగంలో సాధించిన ప్రగతిని ప్రకటించాలి. టిఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమల స్థాపన, అనుమతులు సులభతరమైన విషయాన్ని ప్రస్తావించాలి. రాష్ట్రానికి తరలి వచ్చిన పెట్టుబడుల వెల్లువకు సంబంధించిన వివరాలను, తద్వారా పెరిగిన ఉద్యోగ ఉపాధి అవకాశాల వివరాలు ప్రకటించాలి.

పాంప్లెట్లు ప్రచురించి, పంచాలి.
టి హబ్, వి హబ్ లలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల సమావేశం నిర్వహించాలి.ఐటి ఎగుమతులు, ఉద్యోగ కల్పనలో హైదరాబాద్, బెంగళూరును అదిగమించి దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచిన తీరును ఆవిష్కరించాలి.

జూన్ 7 సాగునీటి దినోత్సవం
కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం రూపొందించిన డాక్యుమెంటరీని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ప్రదర్శించాలి. మంత్రి కెటిఆర్ అమెరికా సదస్సులో ప్రదర్శించిన డాక్యుమెంటరీని జిల్లా కలెక్టర్లు అందరికీ పంపిస్తారు. సాగునీటి రంగంలో సాధించిన రికార్డు స్థాయి ప్రగతిని వివరిస్తూ ప్రతి నియోజకవర్గంలో 1000 మందితో సభ నిర్వహించాలి.ఈ సభలో రైతులు, ఎంఎల్‌ఎ, ఇతర ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు పాల్గొనాలి. ప్రపంచంలోకెల్లా అతి పెద్దదైన బహుళదశల ఎత్తిపోతల, బహుళార్దకసాధక కాళేశ్వరం ప్రాజెక్టును మూడున్నరేళ్ల రికార్డు సమయంలో పూర్తి చేసిన ఘనతను ప్రముఖంగా తెలియజేయాలి. అదేవిధంగా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు, సీతారామ ప్రాజెక్టులు పూర్తి కావస్తున్న విషయాన్ని వివరించాలి. రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో చెక్ డ్యాంల నిర్మించడం వల్ల భూగర్భ జలాలు గణనీయంగా పెరిగిన విషయం తెలియజేయాలి. రవీంద్ర భారతిలో ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాగునీటి రంగంలో సాధించిన విజయాలపై సమావేశం జరుగుతుంది.

జూన్ 8 ఊరూరా చెరువుల పండుగ
గ్రామ పంచాయతీలు, నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో గ్రామంలోని పెద్ద చెరువు వద్ద సాయంత్రం 5 గంటలకు చెరువుల పండుగ నిర్వహించాలి. గ్రా మం నుంచి డప్పులు, బోనాలు, బతుకమ్మలు, మత్స్య కారుల వలలతో ఊరేగింపుగా బయలుదేరాలి. గ్రామంలోనిరైతులు, మత్స్య కారులు, మహిళలుఅన్ని వర్గాల ప్రజలు చెరువు కట్టకు చేరుకోవాలి. చెరువు గట్టుపై పండుగ వాతావరణం ప్రతిఫలించేలా ముగ్గులు, తోరణాలతో అందంగా అలంకరించాలి. కట్ట మైసమ్మ పూజ – చెరువు నీటికి పూజ చేయాలి. బతుకమ్మ, కోలాటాలు – పాటలు, గోరేటి వెంకన్న రాసిన చెరువోయి.. మా ఊరి చెరువు తదితర చెరువు పాటలు వినిపించాలి. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు, ఇంజినీర్లు, రిటైర్డ్ ఇంజినీర్లు, మేధావులు, తదితరులు పాల్గొంటారు.

జూన్ 9 తెలంగాణ సంక్షేమ సంబురాలు
నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వం అందించిన ఆసరా పించన్లు, కల్యాణ లక్ష్మి లబ్ధిదారులతో వెయ్యి మందికి తగ్గకుండా పాల్గొనేలా సభ నిర్వహించాలి. ఆ నియోజకవర్గంలో ఎంత మంది పించన్లు, కల్యాణ లక్ష్మి, తదితర సంక్షేమ పథకాల లబ్ధి పొందారు, ఇందుకోసం ఎన్ని నిధులు వెచ్చించారు, దాని ఫలితాలు గురించి వివరించాలి. తాము పొందిన లబ్ధి గురించి, లబ్ధిదారుల చేత మాట్లాడించాలి. తెలంగాణ సంక్షేమంలో స్వర్ణయుగం సాధించిన తీరును, దేశానికి దిక్సూచిగా మారిన తీరును వివరిస్తూ రవీంద్రభారతిలో ఒక సభ నిర్వహించాలి.

జూన్ 10వ పరిపాలనా సంస్కరణలు.. ఫలితాలు
అన్ని జిల్లా కేంద్రాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి, రాష్ట్రంలో పరిపాలన సంస్కరణల ద్వారా ప్రభుత్వ వ్యవస్థలను ప్రజలకు మరింత చేరువ చేయడం ద్వారా కలిగిన మేలును ప్రముఖంగా ప్రస్తావించాలి.ఈ కార్యక్రమంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు అందరినీ భాగస్వామ్యం చేయాలి. ఆయా జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీలు, మండలాలు, మున్సిపాలిటీలు, రెవిన్యూ డివిజన్లు, కొత్త జిల్లాలు తదితర వివరాలతో కరపత్రం తయారు చేసి పంపిణీ చేయాలి. వీటివల్ల ప్రజలకు దూరభారం తగ్గడమే కాకుండా, పరిపాలన పరమైన పర్యవేక్షణ సులభతరమైన విషయాన్ని పేర్కొనాలి. వివిధ శాఖలను పునర్ వ్యవస్థీకరణ చేయడం వల్ల ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుతున్నవిషయాన్నివివరించాలి.

జూన్ 11 తెలంగాణ సాహిత్య దినోత్సవం
రాష్ట్ర స్థాయిలో, జిల్లాస్థాయిలో కవి సమ్మేళనాలు నిర్వహించాలి. రవీంద్రభారతిలో తెలంగాణ గంగాజమునా తెహజీబ్ ప్రతిబింబించేలా ఉర్దూ, తెలుగు కవులచే రాష్ట్ర స్థాయి కవి సమ్మేళనం ఏర్పాటు చేయాలి. ఈ కార్యక్రమాల్లో తెలంగాణ కవులు, సాహిత్యాభిమానులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ సాధించిన ప్రగతి ప్రతిబింబించేలా కవితలు ఉండాలి.రాష్ట్రస్థాయిలో ఉత్తమమైన 5 పద్య కవితలను, 5 వచన కవితలను ఎంపిక చేసి వాటికి నగదు బహుమతులు ప్రకటించాలి.జిల్లాస్థాయి కవి సమ్మేళనంలో చదివిన కవితలతో కవితా సంకలనం ప్రచురించాలి. రాష్ట్రస్థాయి కవి సమ్మేళనంలో కవితలతో కూడా ఒక కవితా సంకలనాన్ని ప్రచురించాలి.

జూన్ 12 తెలంగాణ రన్
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో యు వకులు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులతో ఉదయం 6 గంటలకు తెలంగాణ రన్ కార్యక్రమం నిర్వహించాలి.ఈ రన్ కార్యక్రమంపోలీసు శాఖ నేతృత్వంలో జరుగుతుంది.క్రీడలు, యువజన సర్వీసులశాఖ భాగస్వామ్యం కావాలి. ఈ సందర్భంగా ప్రత్యేకంగా బెలూన్స్ ఎగురవేయాలి.

జూన్ 13 మహిళా సంక్షేమ దినోత్సవం
నియోజకవర్గం కేంద్రంలోమహిళా సదస్సు నిర్వహించాలి. ఈ సదస్సులో అంగన్‌వాడీ టీచర్లు, సెర్ప్ సిబ్బంది, ఇతరులు మొత్తం 1000 మందికి తగ్గకుండా పాల్గొనేలా చూడాలి. మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి సమావేశంలో వివరించాలి. ఈ సమావేశంలో మహిళా ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులందరూ పాల్గొనాలి.

జూన్ 14 తెలంగాణ వైద్యారోగ్య దినోత్సవం
హైదరాబాద్‌లోని నిమ్స్‌లో నూతనంగా ప్రభుత్వం తలపెట్టిన 2 వేల పడకల ఆసుపత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి కెసిఆర్ శంఖుస్థాపన చేస్తారు. నియోజకవర్గ స్థాయిలో కెసిఆర్ కిట్, న్యూట్రీషన్ కిట్, సిఎంఆర్‌ఎఫ్ లబ్దిదారులు, వైద్యారోగ్య శాఖ సిబ్బంది, నూతన మెడికల్, నర్సింగ్, పారామెడికల్ కాలేజీల విద్యార్థులు తదితరులను ఆహ్వానించి సభ నిర్వహించాలి. ఇందులో వైద్యారోగ్య రంగంలో తెలంగాణ సాధించిన అద్భుత ప్రగతిని పేర్కొనాలి. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేషెంట్లకు పండ్లు పంపిణీ చేయాలి.ఉత్తమ ఆశా వర్కర్, ఉత్తమ ఎఎన్‌ఎం, ఉత్తమ స్టాఫ్‌నర్స్, ఉత్తమ ల్యాబ్ టెక్నీషియన్, ఉత్తమ డాక్టర్లకు సన్మానం చేయాలి.అవార్డులు అందించాలి.

జూన్ 15 తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవం
ప్రతి గ్రామ పంచాయతీ ముందు జాతీయ జెండా ఎగురవేయాలి. అనంతరం పల్లె ప్రగతి ద్వారా, గ్రామానికి వచ్చిన నిధుల వివరాలను, వివిధ సంక్షేమ పథకాల ద్వారా గ్రామ ప్రజలకు జరిగిన లబ్ధిని, గ్రామంలో నిర్మించిన మౌలిక వసతుల వివరాలను ప్రకటించాలి. గ్రామ పారిశుద్దం, పచ్చదనం గణనీయంగా మెరుగుపడిన తీరును వివరించాలి. జాతీయ స్థాయిలో సాధించిన అవార్డుల వివరాలను తెలియజేయాలి. నాడు – నేడు ఫార్మాట్ లో గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధి గురించి, ప్రజా సంక్షేమానికి మరియు పంచాయతీరాజ్ ద్వారా వస్తున్న నిధుల వివరాలతో ఊరూరా ఫ్లెక్సీలు పెట్టాలి.ఊరిలో జరిగిన అభివృద్ధిని తెలియజేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలి. ఫొటోలతో బ్రోచర్ల మాదిరిగా తయారు చేసి పంచాలి. రాష్ట్ర స్థాయిలో రవీంద్రభారతిలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో పల్లెప్రగతిపై సమావేశం. సంబంధిత మంత్రితో పాటు, ఉన్నతాధికారులు పాల్గొంటారు.

జూన్ 16 తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవం
ప్రతి కార్పొరేషన్, మున్సిపాలిటీల ఆధ్వర్యంలోజాతీయ జెండా ఎగురవేయాలి. అనంతరం పట్టణ ప్రగతి ద్వారా, పట్టణానికి వచ్చిన నిధుల వివరాలను, వివిధ సంక్షేమ పథకాల ద్వారా పట్టణ ప్రజలకు జరిగిన లబ్ధిని, పట్టణంలో నిర్మించిన మౌలిక వసతుల వివరాలను ప్రకటించాలి. పట్టణ పారిశుద్దం, పచ్చదనం గణనీయంగా మెరుగుపడిన తీరును వివరించాలి. జాతీయ స్థాయిలో పట్టణాభివృద్ధిలో సాధించిన అవార్డుల వివరాలను తెలియజేయాలి.

జూన్ 17 తెలంగాణ గిరిజనోత్సవం
గిరిజన సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి వివరించాలి. ఆయా గిరిజన గ్రామాల్లో సభలు నిర్వహించాలి.గిరిజనుల చిరకాల వాంఛను తీరుస్తూ తండాలకు, గూడాలకు గ్రామ పంచాయతీ హోదా కల్పించి తీరును, విద్య, ఉద్యోగాల్లో ఎస్‌టిల రిజర్వేషన్లను 10 శాతం పెంచిన విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించాలి.హైదరాబాద్‌లో బంజారా భవన్, ఆదివాసి భవన్ నిర్మాణం చేసిన విషయం హైలైట్ చేయాలి. కుమురంభీం జయంతిని, సేవాలాల్ మహరాజ్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్న విషయాన్ని ప్రకటించాలి. సమ్మక్క సారక్క జాతరను రాష్ట్ర జాతరగా నిర్వహిస్తున్న తీరును, అందు కోసం భారీగా నిధులు వెచ్చిస్తున్న తీరును ప్రస్తావించాలి.

జూన్ 18 తెలంగాణ మంచి నీళ్ల పండుగ
ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, పాత్రికేయులు, వివిధ వర్గాల ప్రజలతో మిషన్ భగీరథ ఫిల్టర్ బెడ్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల సందర్శన కార్యక్రమం నిర్వహించాలి. నీళ్లను శుభ్రపర్చుతున్న తీరును వివరించాలి. ఇంటింటికి నల్లాల ద్వారా సరఫరా అవుతున్న తీరును వివరించాలి. సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో భయంకరమైన తాగునీటి ఎద్దడి ఉన్న తీరును ప్రస్తావిస్తూ, మిషన్ భగీరథ ద్వారా ఆ సమస్యను సంపూర్ణంగా పరిష్కరించిన విధానాన్ని అద్భుతంగా తెలియజేయాలి. గ్రామంలోని మహిళలతో సభ నిర్వహించాలి. గతంలో మంచినీటి కోసం పడ్డ కష్టాలను, బిందెడు నీళ్ల కోసం వీధి పోరాటాలు చేయాల్సి వచ్చిన దుస్థితిని ప్రస్తావించాలి. ఈ కార్యక్రమంలో సెర్ప్ ఉద్యోగులందరినీ భాగస్వామ్యం చేయాలి.రాష్ట్ర స్థాయిలో రవీంద్ర భారతిలో సభ నిర్వహించాలి. ఇందులో సంబంధిత మంత్రి, ఉన్నతాధికారులు పాల్గొనాలి. మిషన్ భగీరథ విజయాలను విశేషంగా తెలియజేయాలి.

జూన్ 19వ తేదీ – సోమవారం – తెలంగాణ హరితోత్సవం
రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించాలి. నర్సరీలను సందర్శించాలి.మొక్కలు నాటే కార్యక్రమం (మాస్ ప్లాంటేషన్) అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాలయాల్లోనూ విధిగా నిర్వహించాలి. అటవీ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచడానికి పెద్ద ఎత్తున జరిగిన కృషిని వివరించాలి. అడవుల పునరుద్ధరణ కోసం తీసుకున్నచర్యలు, వచ్చిన ఫలితాల గురించి తెలియజేయాలి. గ్రీన్ కవర్ పెంచడంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్న విషయాన్ని వెల్లడించాలి. హైదరాబాద్‌కు గ్రీన్ సిటీ, ఇతర అవార్డులు వచ్చిన తీరును వివరించాలి.

జూన్ 20 తెలంగాణ విద్యాదినోత్సవం
రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల్లో పాఠశాల నుంచి విశ్వవిద్యాలయం వరకు, అన్ని గురుకుల పాఠశాలలు, వైద్య, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, ఐటీఐ, ఫారెస్ట్, అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ, ఫిషరీస్ తదితర అన్ని విద్యాసంస్థల్లో ఉదయం పతాక వందనం చేయాలి. తదనంతరం సభలో విద్యారంగంలో తెలంగాణ సాధించిన విజయాలను పేర్కొనాలి.ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న మన ఊరు మన బడి పాఠశాలల ప్రారంభోత్సవం నిర్వహించాలి. సిద్ధంగా ఉన్న 10 వేల గ్రంథాలయాలను, 1,600 డిజిటల్ క్లాస్ రూమ్‌లను ప్రారంభించాలి.పిల్లలకు వ్యాసరచన, చిత్రలేఖనం, పాటల పోటీలు, తదితర కార్యక్రమాలు నిర్వహించాలి.ప్రభుత్వ పాఠశాలలను మామిడి తోరణాలతో, పూలతో అందంగా అలంకరించాలి.

జూన్ 21 తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం
రాష్ట్రంలో దేవాలయాలు, మసీదులు, చర్చీలు, ఇతర ప్రార్ధనా మందిరాలకు అలంకరించాలి. దేవాలయాల్లో వేద పారాయణం, మసీదులు, చర్చీల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాలి.ప్రముఖ క్షేత్రాల్లో ప్రత్యేక భక్తి, సాంసృతిక కార్యక్రమాలు నిర్వహించాలి. హరికథలు, పురాణ ప్రవచనాలు తదితర కార్యక్రమాలు నిర్వహించాలి. ఈ కార్యక్రమాల్లో ఎంఎల్‌ఎలు, ప్రజా ప్రతినిధులు అందరూ విధిగా పాల్గొనాలి.

జూన్ 22 అమరుల సంస్మరణ
ఊరూరా గ్రామ పంచాయతీలు ఉదయం 11 గంటలకు సమావేశం కావాలి. అమరులకు శ్రద్ధాంజలి ఘటించి, మౌనం పాటించాలి. అమరులసంస్మరణ తీర్మానం చేయాలి.ఇదే విధంగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, మండల పరిషత్తులు, కార్పొరేషన్లు, జిల్లా పరిషత్తులలో శ్రద్ధాంజలి ఘటించి, రెండు నిమిషాలు మౌనం పాటించాలి. నిర్ణీత ఫార్మాట్‌లో అమరుల సంస్మరణ తీర్మానాలు చేయాలి. రాష్ట్రంలోని అన్ని విద్యాలయాల్లో ప్రార్థనా సమావేశంలో అమరుల సౄ్మతిలో 2 నిమిషాలు మౌనం పాటించాలి. వారి త్యాగాలను గురించి ప్రస్తుతించాలి. అమరుల గౌరవార్ధం ట్యాంక్‌బండ్ నుంచి 6 వేల మందికి తగ్గకుండా, కళాకారులతో భారీ ర్యాలీ. -ముఖ్యమంత్రి కెసిఆర్ అమరవీరుల స్మారకం ప్రారంభిస్తారు. మంత్రులు, ఎంఎల్‌ఎలు తమ తమ నియోజకవర్గాల్లో స్థూపాల వద్ద శ్రద్ధాంజలి ఘటించి, సాయంత్రం హైదరాబాద్‌లో నిర్వహించే సభలో పాల్గొనాలి.హైదరాబాద్ సభలో అమరులకు నివాళి సూచకంగా, అందరి చేతుల్లో ఎలక్ట్రిక్ క్యాండిల్స్ ఉండే విధంగా ఏర్పాటు చేయాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News