Tuesday, September 10, 2024

ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం రాత్రి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఆయన రెండు, మూడు రోజులు ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా ఫాక్స్‌కాన్, యాపిల్ కంపెనీ ప్రతినిధులతో సిఎం భేటీ కానున్నట్లు తెలిసింది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు మంత్రి శ్రీధర్‌బాబు సైతం శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నట్టుగా సమాచారం. దీంతోపాటు కాంగ్రెస్ హైకమాండ్‌తో రేవంత్ భేటీ కానున్నట్టుగా తెలిసింది. రైతులకు రుణమాఫీ ఆగస్టు 15వ తేదీతో పూర్తి చేయడం, వరంగల్‌లో రైతు కృతజ్ఞత సభ నిర్వహించాలని భావిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని సిఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆహ్వానించగా మరోమారు రాహుల్‌గాంధీని ఆహ్వానించాలని సిఎం నిర్ణయించినట్టుగా తెలిసింది. అదేవిధంగా సచివాలయం ఎదురుగా రాజీవ్‌గాంధీ విగ్రహం ప్రారంభ కార్యక్రమానికి సోనియాను ఆహ్వానించాలని రాష్ట్ర కాంగ్రెస్ నిర్ణయించిన నేపథ్యంలో

సిఎం రేవంత్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని సోనియాను పిలవాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. దీంతోపాటు నూతన పిసిసి చీఫ్, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టులపై ఏఐసిసి అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కెసి వేణుగోపాల్‌తో పలు అంశాలపై సిఎం రేవంత్ చర్చించనున్నట్లుగా పార్టీ వర్గాల సమాచారం. ఇక దీంతోపాటు మంత్రి పదవులు దక్కే అవకాశం లేని ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వం యోచిస్తోంది. ఆర్టీసి, పౌరసరఫరాలు, మూసీ డెవలప్‌మెంట్ అథారిటీ తదితర వాటికి ఎమ్మెల్యేలను నియమించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీటిపై ఏఐసిసి స్థాయిలో సుదీర్ఘ చర్చ జరపాలని సిఎం రేవంత్ నిర్ణయించినట్టుగా తెలిసింది. అందులో భాగంగా ఒకేసారి పదవులు భర్తీ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పదవుల కోసం పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో సిఎం రేవంత్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం రేవంత్ ఢిల్లీ పర్యటన ఉత్కంఠగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News