Sunday, June 16, 2024

రాజ్యాంగం మారిస్తే బలీయ ప్రతిఘటనే: రాహుల్

- Advertisement -
- Advertisement -

రాజ్యాంగం మారిస్తే బలీయ ప్రతిఘటనే
ఢిల్లీ ఎన్నికల ప్రచార సభలో రాహుల్

న్యూఢిల్లీ : ఇప్పుడు జరుగుతోన్న ఎన్నికలు రాజ్యాంగ పరిరక్షణలో అత్యంత కీలకమైనవని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. బిజెపి ఎప్పుడూ రాజ్యాంగాన్ని ముక్కలు ముక్కలు చింపిపారేయాలని చూస్తోందని ఆరోపించారు. ఈ ధోరణిని నిలువరించే దిశలో ఇప్పటి ఓటు ఓ ఆయుధం అవుతుందని ఆయన తెలిపారు. ఈశాన్య ఢిల్లీలోని దిల్షాద్ గార్డెన్‌లో జరిగిన ఎన్నికల సభలో గురువారం రాహుల్ మాట్లాడారు.

పార్టీ అభ్యర్థి కన్హయ్యకుమార్ గెలుపుకోసం ఆయన ప్రచారం సాగిస్తున్నారు. బిజెపి వారికి భారతీయ జెండా అన్నా, భారతీయ రాజ్యాంగం అన్నా పడదని, వీటిని వారు ఏనాడూ ఆమోదించలేదని విమర్శించారు. రాజకీయ కారణాలతో అంతకు మించిన సంకుచితవాదంతో ఈ విధంగా వ్యవహరించడం ఎంతవరకు సబబు? అని రాహుల్ నిలదీశారు. వారికి వారి అజెండా తప్పితే దేశ గౌరవప్రద జెండా అవసరం లేదని విమర్శించారు. ఈసారి ఎన్నికల ప్రచారసభలలో బిజెపి నేతలు ప్రత్యేకించి మోడీ కూడా తాము రాజ్యాంగాన్ని మార్చివేయాలని అనుకుంటున్నామని బహిరంగంగా అంగీకరించారని , దీనిని ఎవరైనా సహిస్తారా? అని ప్రశ్నించారు.

రాజ్యాంగ పరిరక్షణకు కలిసికట్టుగా సాగాల్సి ఉందని, ఇప్పుడు సరైన సదవకాశం వచ్చిందని, రాజ్యాంగాన్ని భక్షించేందుకు సిద్దం అవుతున్న వారికి ఓటుద్వారానే జవాబు చెప్పాల్సి ఉంటుందని పిలుపు నిచ్చారు. రాజ్యాంగం అత్యంత విలువైనది, ఇది కేవలం ప్రకరణలతో కూడిన పుస్తకం కాదు , ఇందులో మన దేశపు సిద్ధాంతపరమైన వారసత్వ స్రవంతి ఇమిడి ఉంది, గాంధీ, అంబేద్కర్ , నెహ్రూ వంటి వారి ఆలోచనలకు వేదిక అయి ఉందని తెలిపారు. రాజ్యాంగాన్ని మార్చడం బిజెపికి తేలిక అనుకుంటున్నారేమో, వారు గనుక ఈ చర్యకు దిగే ధైర్యం చేస్తే కోట్లాది మంది భారతీయల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొవల్సి వస్తుందని చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల ప్రచారానికి గురువారం చివరిరోజు. ఈ నెల 25న పోలింగ్ జరుగుతుంది. ఢిల్లీలో మొత్తం ఏడు ఎంపీ సీట్లు ఉన్నాయి. కాంగ్రెస్ ఆప్ నడుమ ఎన్నికల సర్దుబాట్లు జరిగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News