Friday, April 26, 2024

తెల్లకణాలు కొల్లగొట్టారు

- Advertisement -
- Advertisement -

White blood cells

 

ఇఎస్‌ఐని పీల్చిపిప్పిచేసిన జలగలు

షెల్ కంపెనీల ద్వారా
రూ. 110 కోట్లు స్వాహా

రూ. 11,800 విలువ చేసే తెల్ల రక్త కణాల కిట్‌కు రూ.36,800 చెల్లింపు
బయటపడిన ఓమ్నీ ఎండి శ్రీహరిబాబు బండారం, అరెస్టు
లెజెండ్ అనే మరో డొల్ల కంపెనీ ఏర్పాటులో దేవికారాణి, పద్మ పాత్ర, శ్రీహరి బాబు తోడ్పాటు

హైదరాబాద్ : ఇఎస్‌ఐ స్కామ్‌లో అవినీతి నిరోదక శాఖ తవ్వే కొద్ది కొత్త మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఇఎస్‌ఐలో తెల్ల రక్తకణాల కిట్స్‌కొనుగోలులో భారీ అవినీతి జరిగినట్లు ఎసిబి అధికారులు గుర్తించారు. ఇఎస్‌ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణి, జాయింట్ డైరెక్టర్ పద్మల అవినీతిపై దర్యాప్తు చేపడుతున్న ఎసిబి అధికారులు షెల్‌కంపెనీల పేరుతో ఓమ్ని చైర్మన్ శ్రీహరిబాబు రూ.110 కోట్ల కొల్లగొట్టిన వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈక్రమంలో రూ.11,800 తెల్లరక్తకణాల కిట్‌ను రూ.36,800 వెచ్చించి కొనుగోలు చేసిన పత్రాలను ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకుని ఓమ్ని ఎండిపై మరో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో కృపాసాగర్‌రెడ్డి లెజెండ్‌కంపెనీ పేరుతో ఏర్పాటు చేసిన షెల్‌కంపెనీ దేవికారాణి, పద్మలు సహకరించారని విచారణలో తేలింది.

షెల్ కంపెనీల పేరిట రూపొందించిన బిల్లులతో లెజెండ్ కంపెనీకి ప్రభుత్వం రూ.54 కోట్లు చెల్లించింది. దీంతో విచారణ ముమ్మరం చేసిన ఎసిబి అధికారులకు ఒమ్ని మెడి ఎండి శ్రీహరితో కలిసి దేవికారాణి డొల్ల కంపెనీ ఏర్పాటు చేసినట్లు తేల్చారు. లెజెండ్ అనే డొల్ల కంపెనీ ఏర్పాటు చేసి ఆ సంస్థ నుంచి ఔషధాలు, రక్తపరీక్షల కోసం వినియోగించే కిట్లు కొనుగోలు చేసినట్లు పత్రాలు సృష్టించారు. ఈ నేపథ్యంలో ఓమ్ని ఎండి , ఇఎస్‌ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణి, జాయింట్ డైరెక్టర్ పద్మలు వ్యూహాత్మకంగా డొల్ల కంపెనీకి కృపాసాగర్ రెడ్డి అనే వ్యక్తిని ఎండిగా నియమించారు. లెజెండ్ కంపెనీకి విడుదల చేసిన నిధులతో పాటు 2017-, 2018 సంవత్సరంలో లెజెండ్ కంపెనీతో జరిగిన కొనుగోలు ఒప్పంద పత్రాలను ఎసిబి అధికారులు పరిశీలించారు. కేవలం రెండు ఒప్పంద పత్రాల్లోనే రూ.110 కోట్ల విలువైన ఔషధాలు కొనుగోలు చేసినట్లు సృష్టించినట్లు గుర్తించారు.

దీనిలో రూ.12 కోట్ల మేర అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. లెజెండ్ కంపెనీ ఖాతా నుంచి శ్రీహరి ఖాతాకు రూ.54కోట్లు బదిలీ అయిన విషయాన్ని ఎసిబి అధికారులు గుర్తించారు. బహిరంగ మార్కెట్‌లో లభించే ధర కంటే సుమారు ఆరు రెట్లు ఎక్కువగా చెల్లించి రక్తపరీక్షల కిట్లు కొనుగోలు చేసినట్లు ఎసిబి అధికారుల దర్యాప్తులో తేలింది.అదేవిధంగా ఒమ్ని మెడితో పాటు లెజెండ్ కంపెనీలో శ్రీహరి, దేవికారాణికి వాటాలున్నట్లు అధికారులు గుర్తించారు. ఒమ్ని మెడిలో శ్రీహరికి రూ.99 కోట్ల వాటాతో పాటు అతడి పేరు మీద డిపాజిట్లు కూడా ఉన్నాయి. భార్య పేరు మీద రూ.7 కోట్లు, శ్రీహరి పేరుపై రూ.24కోట్లు ఉన్నట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. ఐఎంఎస్ కుంభకోణంలో అధికారులు ఇప్పటికే 21 మందిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దేవికారాణి, పద్మ, ఇందిరతో పాటు పలువురు ఉద్యోగులు, ఫార్మ కంపెనీలకు చెందిన ప్రతినిధులను అరెస్ట్ చేశారు.

ఒమ్ని మెడీ ఎండి శ్రీహరిని ఎసిబి అరెస్ట్ చేసింది. అయితే ఆయన ఇటీవలే బెయిల్ పై చంచల్ గూడ జైలు నుంచి బయటకు వచ్చారు. డొల్ల కంపెనీల అక్రమాలపై ఎసిబి అధికారులు అతన్ని మరోసారి అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన అనంతరం అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో లెజెండ్ కంపెనీ ఎండి కృపాసాగర్, ఒమ్ని మెడీ ఉద్యోగి వెంకటేశ్వర్ రెడ్డి పరారీలో ఉన్నారని ఎసిబి అధికారులు పేర్కొంటున్నారు. వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే మరింత సమాచారం వచ్చే అవకాశం ఉందని ఎసిబి అధికారులు వివరిస్తున్నారు. ఇదిలావుండగా ఇఎస్‌ఐ కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌డైరెక్టరేట్ ఇప్పటికే విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇఎస్‌ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణిపై మనీ లాండరింగ్‌కేసును ఇడీ నమోదు చేయడంతో పాటు ఆమె అధికారంలో ఉండగా ఆమె పెద్ద మొత్తంలో షెల్‌కంపెనీలు ఏర్పాటు చేసినట్లుగా ఇడీ పక్కా ఆధారాలు సేకరించింది.

ఇఎస్‌ఐ కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించిన దేవికా రాణిపై మూడు కేసులు, ఆమె భర్తపై కూడా ఎసిబి కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఇఎస్‌ఐలో రెండు వందల కోట్ల వరకు శ్కాం జరిగినట్లు పేర్కొంటున్న ఎసిబి అధికారులు అంతకన్నా ఎక్కువే జరిగిందని తాజాగా పేర్కొంటున్నారు. ఈ శ్కాంలో రూ. 200 కోట్ల నుంచి దాదాపు రూ. 400 కోట్ల మేర అవినీతి జరిగినట్లు తమ ప్రాధమిక దర్యాప్తులో తేలిందని ఎసిబి అధికారులు వివరిస్తున్నారు.

Corruption in White blood cells
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News