Friday, March 29, 2024

కొత్త సిఎస్ సోమేశ్‌కుమార్

- Advertisement -
- Advertisement -

CS Someshkumar

 

నీటి పారుదల సలహాదారుగా శైలేంద్రకుమార్ జోషి

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఎఎస్ అధికారి సోమేశ్ కుమార్ నియమితులయ్యారు. సీఎస్ ఎంపికపై సిఎం కెసిఆర్ తుది కసరత్తు చేసి తెలంగాణ రాష్ట్ర ఐదో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఎంపిక చేశారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై సిఎం కెసిఆర్ మంగళవారం మధ్యాహ్నం సంతకాలు చేశారు. 1989 ఐఎఎస్ బ్యాచ్ అధికారి సోమేశ్‌కుమార్ పదవీకాలం 2023 డిసెంబర్ ౩౧ వరకు ఉంది. ఎక్కువ సమయం ఈ బాధ్యతలు నిర్వహించే అవకాశం రావడం వల్ల సోమేశ్‌కుమార్‌ని నియమించడం వల్ల స్థిరత్వం ఉంటుందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సోమేశ్‌కుమార్ గతంలో జిహెచ్‌ఎంసిగా కమిషనర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ప్రత్యేక చీఫ్ సెక్రటరి (రెవిన్యూ), సిసిఎల్‌ఎ (ఎఫ్‌ఎసి)గా కొనసాగుతున్నారు. కాగా ఇప్పటి వరకు ప్రధాన కార్యదర్శిగా కొనసాగిన శైలేంద్ర కుమార్ జోషి పదవీకాలం శనివారంతో ముగిసింది.

వాస్తవానికి సోమేశ్‌కుమార్ కంటే సీనియర్ అధికారి అయిన అజయ్‌మిశ్రాకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి దక్కుతుందని అంతా భావించారు. అయితే అందరి ఊహాగానాలను తెరదించుతూ సోమేశ్‌కుమార్ వైపే సిఎం కెసిఆర్ మొగ్గు చూపారు. సిఎస్‌గా నియమితులైన సోమేశ్‌కుమార్ వెంటనే ఆ బాధ్యతలను చేపట్టారు. మంగళవారం సాయంత్రం శైలేంద్రకుమార్ జోషి వీడ్కొలు సమావేశంలో సిఎం కెసిఆర్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు.

పోటీలో నెగ్గిన సోమేశ్‌కుమార్…
కాగా, ప్రధాన కార్యదర్శి పదవికి సోమేశ్‌కుమార్, అజయ్ మిశ్రాతో పాటు చిత్రా రామచంద్రన్, అధర్‌సిన్హా పోటీ పడ్డారు. వీరందరిలో అజయ్ మిశ్రానే అందరికంటే సీనియర్. అయితే దీర్ఘకాలం ఒకే సిఎస్ ఉండాలని భావించిన సిఎం కెసిఆర్ సోమేశ్‌కుమార్‌కు ఆ అవకాశం ఇచ్చారు. సిఎం తన నిర్ణయాన్ని చివరి వరకు గోప్యంగా ఉంచడంతో కొత్తగా సిఎస్‌గా ఎవరిని ఎంపిక చేస్తారన్న అంశంపై అటు అధికార వర్గాలు, ఇటు రాజకీయవర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపింది. సిఎస్ నియామకానికి సాంకేతిక సమస్యలు ఎదురుకాకుండా మంగళవారం మధ్యహ్నం సిఎం కెసిఆర్ కొత్త సిఎస్‌ను ఎంపిక చేయగా.. ఆ వెంటనే ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జోషి పదవి విరమణ చేశారు.

నీటిపారుదల సలహాదారుగా జోషి..
ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నీటి పారుదల రంగానికి సంబంధించి ఇప్పటికే వివిధ ప్రాజెక్టులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విశిష ్టసేవలందించిన జోషి సేవలను సద్వినియోగం చేసుకోవాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. ఈ క్రమంలో పదవీ విమరణ చేసిన శైలేంద్రకుమార్ జోషిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడుగా నియమిస్తూ సిఎం కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. నీటి పారుదల సలహాదారుడిగా జోషిని నియమించారు. దీనికి సంబంధించిన ఫైలుపై సిఎం కెసిఆర్ సంతకం చేశారు. కాగా మంగళవారం సాయత్రం బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో శైలేంద్రకుమార్ జోషికి అధికారులు, ఉద్యోగులు వీడ్కొలు పలికారు.

సిఎం కెసిఆర్‌కు సోమేశ్‌కుమార్ కృతజ్ఞతలు
రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సోమేశ్‌కుమార్ ప్రగతి భవన్‌లో సిఎం కెసిఆర్‌ను కలిసి పుష్పగుచ్చం అందజేశారు. తనను సిఎస్‌గా నియమించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

New CS Someshkumar
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News