Saturday, April 27, 2024

మెద్వెదేవ్‌దే యూఎస్ ఓపెన్

- Advertisement -
- Advertisement -

Daniel Medvedev won his first Grand Slam title

 

మెద్వెదేవ్‌దే యూఎస్ ఓపెన్ టైటిల్
తుదిపోరులో అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్న రష్యా ఆటగాడు
కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ వశం

న్యూయార్క్: యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ పోరులో రష్యా ఆటగాడు డానిల్ మెద్వెదేవ్ అద్భుతం చేశాడు. తన కేరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు, అర్ధశతాబ్దం తర్వాత కేరీర్ గ్రాండ్‌స్లామ్ సాధించి చరిత్ర తిరగరాద్దమనుకున్న ప్రపంచ నంబర్‌వన్ నోవాక్ జకోవిచ్‌కు ఊహించలేని షాక్ ఇచ్చాడు. యూఎస్ ఓపెన్ ఫైనల్‌లో మెద్వెదేవ్ 6-4, 6-4, 6-4 తేడాతో 34 ఏళ్ల జకోవిచ్‌ను ఓడించాడు. మరోవైపు అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించేందుకు జకోవిచ్ ఇంకొన్ని రోజులపాటు నిరీక్షించాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇప్పటికే జకోవిచ్ 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో రోజర్ ఫెదరర్, నాదల్ సరసన చేరాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి టెన్నిస్ చరిత్రలో కొత్త అధ్యయనాన్ని లిఖిద్దామని ఉవ్విళ్లూరుతున్న జకోకు నిరాశే ఎదురైంది. అయితే ఈ ఏడాది జరిగిని ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌లో జకోవిచ్ చేతిలో పరాజయం చవిచూసిన మెదెదేవ్ ఈ విజయంతో బదులు తీర్చుకున్నట్లయింది.

నువ్వా..నేనా..

అభిమానుల కోలాహాలం మధ్య, అత్యంత ఉత్కంఠగా ఈ మ్యాచ్ ప్రారంభమైంది. ఆట ప్రారంభం నుంచి ఇద్దరు ఆటగాళ్లు నువ్వానేనా అన్నట్లు తలపడ్డారు. తొలిసెట్‌లో 6-4 తేడాతో మెద్వెదేవ్ పైచేయి సాధించినప్పటికీ రెండో సెట్‌లో ఇద్దరు ఆటగాళ్లు బలమైన షాట్లు, సర్వీస్ బ్రేక్‌లతో ఆటను ఉత్కంఠ స్థితికి తీసుకొచ్చారు. అయితే జకోవిచ్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 25 ఏళ్ల మెద్వెదేవ్ 64 తేడాతో రెండో సెట్‌ను కూడా గెలిచాడు. ఇక నిర్ణయాత్మక మూడో సెట్‌లో సెర్బియా యోధుడు జకోవిచ్ మొదట తేలిపోయినప్పటికీ తర్వాత పుంజుకున్నాడు. అయినప్పటికీ మెద్వెదేవ్ విజయాన్ని మాత్రం అడ్డుకోలేపోయాడు. దీంతో హోరాహోరీగా సాగిన ఈ సెట్‌లో మెద్వెదేవ్ 6-4 తేడాతో గెలిచాడు. దీంతో డానిల్ మెద్వెదేవ్ మూడో సెట్‌ను గెలిచి టెన్నిస్ చరిత్రలో తన కొత్త పేజీని ప్రారంభించాడు. 2019లో యూఎస్ ఓపెన్‌లో ఫైనల్ చేరి ఓటమి పాలైన ఈ రష్యా ఆటగాడు ఇప్పుడు టైటిల్ గెలిచి రేసులోకి వచ్చాడు. దాదాపు పదేళ్ల తర్వాత యూఎస్ ఓపెన్ టోర్నమెంట్‌లో కేవలం ఒక్కసెట్‌లో మాత్రమే ఓడి టైటిల్ గెలిచిన వీరుడిగా మెద్వెదేవ్ చరిత్ర సృష్టించాడు. ఇదిలాఉంటే యూఎస్ ఓపెన్‌లో సింగిల్స్ విభాగంలో ఈసారి ఇద్దరు కొత్త ఛాంపియన్లుగా అవతరించడం విశేషం. మహిళ సింగిల్స్‌లో 18 ఏళ్ల ఎమ్మా రదుకాను విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.

జకో కంటతడి..

ఎన్నో ఆశలతో తుదిపోరు బరిలోకి దిగిన ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జకోవిచ్‌కు నిరాశే ఎదురైంది. మెద్వెదేవ్‌తో 6-4, 6-4, 6-4 తేడాతో ఓటమి పాలయ్యాక జకో తన భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయాడు. పదేపదే తన రాకెట్‌ను నేలకేసి కొట్టడంతో పాటు కన్నీటి పర్యంతమయ్యాడు. సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారడంతో అభిమానులు భిన్నంగా స్పందించారు. ఇక టోర్నీ అనంతరం జకో మాట్లాడుతూ టైటిల్ కోసం కొన్ని వారాలుగా మానసికంగా, ఎంతో ఒత్తిడికి లోనయ్యాయనని, ఆ మానసిక సంఘర్షణను తట్టుకోవడం చాలా కష్టమైందన్నాడు. ఓటమి తనను తీవ్రంగా కలిచివేసిందని, తనకోసం సమయం కేటాయించిన అభిమానులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు.

సతీమణికి అదిరిపోయే గిఫ్ట్

యూఎస్ ఓపెన్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించి దిగ్గజ ఆటగాడు నొవాక్ జకోవిచ్‌కు షాకిచ్చిన ప్రపంచ రెండో ర్యాంకర్ డానిల్ మెద్వెదేవ్ ఆదివారం తన సతీమణికి అదిరిపోయే బహుమతి ఇచ్చాడు. జకోవిచ్‌తో తలపడిన తుదిపోరులో డానిల్ 6-4, 6-4, 6-4 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, ఇదే రోజు అతడికి మూడో వివాహ వార్షికోత్సవం కావడం కూడా గమనార్హం. ఈ సందర్భంగా గ్రాండ్‌స్లామ్ ట్రోఫీ అందుకునేటప్పుడు ఈ రష్యా ఆటగాడు తన విజయంలో సతీమణి డారియా సహాయ సహకారాలు ఎంతో ఉన్నాయని తెలిపాడు. ఆమెను ఎల్లప్పుడూ ప్రేమిస్తుంటానని అన్నాడు. కాగా, అక్కడే ఉంటూ ఈ మాటలు విన్న డారియా భావోద్వేగానికి గురైంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News