Thursday, April 25, 2024

6న పుర పోరు రిజర్వేషన్లు

- Advertisement -
- Advertisement -

Municipal Reservations

 

 

కొత్త చట్టం ప్రకారమే ఎన్నికల షెడ్యూలు
ప్రభుత్వం అనుమతే ప్రధానం, గత చట్టం ప్రకారమైతే అఖిలపక్ష భేటీ ఉండేది
విపక్షాల ఆరోపణలు వాస్తవం కాదు
ముసాయిదా, ఓటర్ల జాబితా విడుదల చేశాం, అభ్యంతరాలు స్వీకరించి 4న తుది జాబితా ప్రకటిస్తాం : నాగిరెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై విపక్ష పార్టీల నాయకులు చేస్తున్న ఆరోపణలను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ వి.నాగిరెడ్డి కొట్టిపారేశారు. కొత్త మున్సిపల్ చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినట్లు స్పష్టం చేశారు. ఈ నెల 6వ తేదీన రిజర్వేషన్లను ప్రకటించనున్నట్లు తెలిపారు. మాసాబ్ ట్యాంక్‌లోని ఎస్‌ఇసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సోమవారం నాగిరెడ్డి మాట్లాడారు. రాజకీయ పార్టీల భేటీలో ప్రభుత్వం కనుసన్నల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం నడుస్తోందని ఆరోపణలు చేశారని, అయితే కొత్త మున్సిపల్ చట్టం ప్రకారమే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినట్లు తెలిపారు.

కొత్త చట్ట ప్రకారం ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల నిర్వహణ తేదీలపై ప్రతిపాదనలు పంపుతుందని, అక్కడ ఓకే చెబితేనే షెడ్యూల్ ప్రకటించామన్నారు. అలానే ప్రభుత్వంలో ఉన్నవారికి ముందుగా తెలిసిందని స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాజకీయ పార్టీల సమావేశంలో గొడవ వల్ల వివరంగా చెప్పలేకపోయమన్నారు. సెక్షన్ 195, 197 ప్రకారం ప్రభుత్వం అనుమతి తోనే షెడ్యూల్ విడుదల చేసినట్లు చెప్పారు. లేదంటే గత చట్టం ప్రకారమైతే అన్ని రాజకీయ పార్టీలతో భేటీ ముందే ఉండేదని, ఆ తరువాత రిజర్వేషన్లు ఖరారు చేసుకుని నోటిఫికేషన్ విడుదల కంటే ఒకటి, రెండు రోజుల ముందు షెడ్యూల్ ప్రకటించే వాళ్లమని చెప్పారు.

ఆన్‌లైన్ నామినేషన్ హార్డ్ కాపీ ఇవ్వాల్సిందే
-మున్సిపల్ ఎన్నికల ముసాయిదా ఓటర్ల జాబితాను మున్సిపాలిటీలు, వార్డుల వారీగా విడుదల చేసినట్లు వెల్లడించారు. జనవరి రెండో తేదీ వరకు ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను స్వీకరిస్తామని తెలిపారు. అసెంబ్లీ ఓటరు జాబితాలో పేరు ఉండి, ఇప్పుడు జాబితాలో లేకపోతే సమస్య పరిష్కరిస్తామన్నారు. జనవరి 4వ తేదీన తుది ఓటరు జాబితా విడుదల చేస్తామని, అప్పటి వరకు ఏమైనా కొత్త ఓటర్ల నమోదుకు పెండింగ్‌లో ఉంటే వెంటనే చేయాలని సిఇఒ రజత్ కుమార్‌కు తెలిపినట్లు చెప్పారు.

6వ తేదీ తరవాత రిజర్వేషన్లు ప్రకటిస్తామన్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఇసి) వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో నామినేషన్ సమర్పించవచ్చునన్నారు. నామినేషన్‌ను ఆన్ లైన్‌లో అప్‌లోడ్ చేసినంత మాత్రాన నామినేషన్ వేసినట్లు కాదన్నారు. ఒరిజినల్ నామినేషన్ కాపీ ని రిటర్నింగ్ అధికారికి నేరుగా ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో 35 వేల నుంచి 40 వేల వరకు సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉంటారన్నారు. ఎన్నికల విధుల్లో వచ్చే సిబ్బంది అంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని నాగిరెడ్డి కోరారు.ఎన్నికల సిబ్బంది 13 వ తేది వరకు పోస్టల్ ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

5వ తేదీన ఎస్‌ఇసికి రిజర్వేషన్ల జాబితా
సిడిఎంఎ డైరెక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ 141 మున్సిపాలిటీలకు కలిపి రాష్ట్ర స్థాయిని యూనిట్ గా తీసుకొని రిజర్వేషన్లు ప్రకటిస్తామని తెలిపారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్లు ఉంటాయని స్పష్టం చేశారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి రిజర్వేషన్లను 50 శాతానికి మించకుండా ఖరారు చేస్తామన్నారు. పట్టణ ప్రాంతాల్లో బిసిల సంఖ్య ఎక్కువగా ఉంటుందని, వారికే ఎక్కువ అవకాశం వస్తుందన్నారు. మహిళలకు లాటరీ పద్ధతిలో 50 శాతం రిజర్వేషన్‌లు ఖరారు చేస్తామన్నారు. కౌన్సిలర్లు, కార్పొరేటర్ల రిజర్వేషన్లు కలెక్టర్లు ప్రకటిస్తారన్నారు. 5వ తేదీన మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ ఛైర్మన్ రిజర్వేషన్లు ప్రకటిస్తామన్నారు.

Declaration of Municipal Reservations on 6th
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News