Wednesday, June 19, 2024

ఉత్తమం కాదు, అథమం

- Advertisement -
- Advertisement -

Congress party

 

పిసిసి అధ్యక్షుడిపై కుంతియాకు సీనియర్ల ఫిర్యాదు

రాష్ట్ర కాంగ్రెస్‌లో 40శాతం మంది కోవర్టులే : రాజనర్సింహ, ఎస్‌సి, ఎస్‌టిలు పార్టీకి దూరమవుతున్నారు
కిందస్థాయి నాయకులను పట్టించుకోవడం లేదు: రాష్ట్ర ఇంఛార్జి వద్ద పొన్నాల, విహెచ్ తదితరుల మొర

హైదరాబాద్ : కాంగ్రెస్‌లో విబేధాలు తారా స్థాయికి చేరుకున్నాయి. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి వ్యతిరేకంగా పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు ఆదివారం తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ ఆర్‌సి. కుంతియాను కలిసి ఫిర్యాదు చేశారు. పిసిసి అధ్యక్షుడిగా ఉత్తమ్ తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించడంలోనూ, అందరి అభిప్రాయలను పరిగణిలోకి తీసుకోకుండా ఒంటెద్దు పోకడలతో పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తున్నారంటూ కుంతియా దృష్టికి తీసుకెళ్ళారు. ఈ నేపథ్యంలో
ఉత్తమ్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా, మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మినారాయణ, వి. హనుమంతరావు తదితరులు కుంతియాను కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలను వారు కుంతియాకు వివరించారు.

ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఎవరికి చెప్పకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటూ కాంగ్రెస్‌ను రాష్ట్రంలో కనుమరుగు చేస్తున్నారంటూ కుంతియాకు వివరించారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల కోసం ఉత్తమ్ ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీల నియామకంలో ఎవరిని ఆయన ఎవరిని సంప్రదించడం లేదని ఫిర్యాదు చేశారు. పార్టీలో సీనియర్లను సైతం పట్టించుకోవడం లేదని, తమలాంటి వారిని సైతం అవమానాలకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ఉత్తమ్ ఒక వర్గానికి అధిక ప్రాధాన్యం ఇస్తుండడం వల్ల ఎస్‌సి, ఎస్‌టి, బిసిలుపార్టీకి దూరం అవుతున్నారని వివరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్‌ను వెంటనే ప్రక్షాళన చేయాలని నేతలు కుంతియాకు సూచించారు. కాగా కాంగ్రెస్‌లో ఏకంగా 40 శాతం మంది వరకూ అధికార టిఆర్‌ఎస్‌కు కోవర్టులు ఉన్నారని దామోదర రాజనర్సింహ కుంతియాకు చెప్పారు. దీని కారణంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ చతికిలపడుతోందన్నారు.

కిందిస్థాయి నాయకులను పట్టించుకునే వారే కరవయ్యారన్నారు. కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఆదారణ ఉన్నప్పటికీ దానిని ఓట్ల రూపంలో మలుచుకునే కార్యక్రమాలుగానీ, తగు వ్యూహాలను రూపొందించడంలో ఉత్తమ్ పూర్తిగా విఫలం చెందారని రాజనర్సింహా కుంతియా దృష్టికి తీసుకెళ్ళారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ తన సత్తాచాటుకోవాలంటే పార్టీ అధిష్టానం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటే తప్ప సాధ్యం కాదన్నారు. ఆ దిశగా పార్టీ హైకమాండ్‌తో మాట్లాడాల్సిందిగా కుంతియాకు ఆయన సూచించారని సమాచారం. పార్టీ కోసం నిజాయితీగా పనిచేసే వారికి ఏ మాత్రం గుర్తింపు లేకుండా పోతోందని కుంతియా ముందు గోడు వెళ్ల్లబోశారు.

ఇలా అయితే పార్టీ మనుగడ ఎలా? అని ప్రశ్నించారు. పార్టీ బలోపేతం కోసం తాము చిత్త శుద్ధితో శ్రమిస్తున్నామని, కానీ పెద్దల నుంచి మాత్రం సహాయ నిరాకరణే ఎదురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని బతికించాలని తాము యత్నిస్తుమన్నారు. కాని మరో పార్టీలోని మరో వర్గం మాత్రం అధికార పార్టీతో లాలూచీ పడుతోందని చెప్పారు. గత ఆరేళ్లలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన ఉద్యమాలు ఏమైనా ఉన్నాయా? అని కుంతియాను ఈ సందర్భంగా దామోదర రాజనరసింహ నిలదీశారని తెలుస్తోంది.

మల్లన్నసాగర్ భూ నిర్వాసితులపై తాము ఉద్యమించామని వారు గుర్తుచేశారు. కానీ తమ ఉద్యమాన్ని సొంత పార్టీ నేతలు మాత్రం పట్టించుకోలేదన్నారు. పార్టీలో తమకు తగిన గౌరవం లభించడం లేదని వారు కుంతియాకు వివరించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో సరైన వ్యక్తులను నియమిస్తేనే పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తోందని లేదంటే మరోసారి చతికిలపడటం ఖాయమని వారు పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.

ఉత్తమ్, భట్టిలపై గుర్రు
ఉత్తమ్‌తో పాటు సిఎల్‌పి నాయకుడు భట్టి విక్రమార్కలపై విహెచ్, పొన్నాల తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇటీవల గవర్నర్‌ను కలిసే సమయంలో తనను పిలిచి అవమానించారని విహెచ్ కుంతియాకు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో తాను ఢిల్లీలో ఉన్నానని, అయినప్పటికీ ఉత్తమ్, భట్టీలు రావాలని పిలిస్తేనే హైదరాబాద్‌కు వచ్చానన్నారు. తీరా గవర్నర్‌ను కలిసే వారిలో తన పేరు లేదని గుర్తుచేశారు. అలాగే పొన్నాల లక్ష్మయ్య కూడా తన పేరు కూడా లేదని చెప్పారు. ఈ ఘటన జరిగినప్పటి నుంచిఉత్తమ్, భట్టిపై వీహెచ్, పొన్నాల ఆగ్రహాంతో ఉన్నారు.

Disagreements in Congress
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News