Monday, April 29, 2024

ఇంటర్ పొరపాట్లు మళ్లీ జరగొద్దు

- Advertisement -
- Advertisement -

 Examinations

 

త్రిసభ్య కమిటీ సూచనలను అమలు చేయాలి
ఇంటర్, ఎస్‌ఎస్‌సి బోర్డులకు సిఎస్ సోమేష్‌కుమార్ సూచన

హైదరాబాద్ : పరీక్షల నిర్వహణలో గత ఏడాది జరిగిన పొరపాట్లు పునరావృతం కావొద్దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ అన్నారు. ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ సూచనలను ఇంటర్, ఎస్‌ఎస్‌సి బోర్డులు అధ్యయనం చేసి పూర్తి స్థాయిలో అమలు చేయాలని తెలిపారు. ఇంటర్, పదవ తరగతి పరీక్షల నిర్వహణపై సోమవారం బి.ఆర్.కె.ఆర్ భవన్‌లో ఆయన సిఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరీక్షల సన్నద్దతను సమీక్షిస్తు పలు సూచనలు ఇచ్చారు. ఈ సమావేశంలో ఇంటర్, ఎస్‌ఎస్‌సి బోర్డులు, సిజిజి అధికారులు పాల్గొన్నారు. మార్చి, ఏప్రిల్ లో జరగనున్న ఇంటర్ మీడియట్ , పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించటానికి తగు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారని సిఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు.

మార్చి 4 నుంచి 23 వరకు ఇంటర్ పరీక్షలు, మార్చి 19 నుంచి ఏప్రిల్ 6 వరకు పదవ తరగతి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో జవాబు పత్రాలను మూల్యాంకనం చేసే అందరికీ సమగ్ర శిక్షణ ఇవ్వాలని సూచించారు. విద్యార్థుల ఫిర్యాదుల కోసం ఆన్‌లైన్ పరిష్కార విధానం ఉండాలని చెప్పారు. సందేహాలు ఉన్న విద్యార్థులు వెబ్‌సైట్‌ను సంప్రదించేలా చూడాలని తెలిపారు. అన్ని జిల్లాల్లోనూ సహాయక కేంద్రాలు ఏర్పాటు చేయాలని సిఎస్ అన్నారు. ప్రవేశాలు మొదలు ఫలితాల వెల్లడి వరకు క్యాలెండర్ రూపొందించాలని, తప్పులు జరగకుండా ఐటీ మాడ్యుళ్లను పూర్తిస్థాయిలో పరీక్షించాలని సీఎస్ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, పరీక్షలను ప్రశాంత వాతవరణంలో నిర్వహించటానికి అదనపు చర్యలు కూడా తీసుకుంటున్నామన్నారు.

జవాబుపత్రాలను మూల్యాంకనం చేసే ప్రతి ఒక్కరికీ అవసరమైన పూర్తి స్థాయి శిక్షణను అందించి గత సంవత్సరంలో సాధరణంగా జరిగిన తప్పులపై అవగాహన కల్పించామని చెప్పారు. ఏ ఒక్క విద్యార్ధి నష్ట పోకుండా చూడాలని సిఎస్ అధికారులకు సూచించారు. ఈ సారి ఇంటర్ పరీక్షలకు 9.65 లక్షల విద్యార్ధులు, పదవ తరగతి పరీక్షలకు 5.08 లక్షల విద్యార్ధులు హజరవుతున్నారని తెలిపారు. పరీక్షా కేంద్రాల ఏర్పాటు , జంబ్లింగ్ పద్దతి, హల్ టికెట్‌ల జారీ, ఫలితాల వెల్లడి తదితర ప్రక్రియలను అధికారులు సిఎస్‌కు వివరించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్ రెడ్డి, ఇంటర్ విద్య కమిషనర్ సయ్యద్ ఓమర్ జలీల్, పాఠశాల విద్య శాఖ సంచాలకులు విజయ్ కుమార్, సి.జి.జి. డైరెక్టర్ జనరల్ రాజేంద్ర నిమ్జే, టిఎస్‌టిఎస్ మేనెజింగ్ డైరెక్టర్ జి.టి.వేంకటేశ్వర్ రావు, ఎస్.ఎస్.సి బోర్డ్ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

Do not repeat mistakes in Examinations
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News