Wednesday, April 17, 2024

ఇవిఎంలపై ఇంకా అనుమానాలే!

- Advertisement -
- Advertisement -

బిహెచ్‌ఇఎల్ తయారు చేసిన మన ఇవిఎం లకు పారిస్‌లో ఉన్న వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ సంస్థ ఎలాంటి ధ్రువీకరణ ఇవ్వలేదు. 2002 లో బిహెచ్‌ఇఎల్ పేటెంట్ కోసం దరఖాస్తు పంపి, తిరస్కరిస్తారనే భయంతో తన అభ్యర్థనను 2006లో వెనక్కి తీసు కుంది. 2010లో మాజీ న్యాయమంత్రి డా. సుబ్రమణ్య స్వామి ది హిందూలో ‘బ్యాలెట్ రిగ్గింగ్ ఫలితాలపై కొంత ప్రభావం చూపితే ఇవిఎం చిప్ ద్వారా మొత్తం ఎన్నికలనే స్వాధీనం చేసుకోవచ్చు’ అని రాశారు.

ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి కూటమి 400 స్థానాలు సాధించాలని మోడీ, వై నాట్ 175 అని జగన్ అంటుంటే వారి ధీమాకి ఆశ్చర్యం కలుగుతుంది. ఫలితాల నిర్ణయాలు తమ చేతుల్లోనే ఉన్నట్లు వారు మాట్లాడుతున్నారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో జగన్ 151 కైవసం చేసుకుంటే అప్పటికి పాలక పక్షమైన టిడిపి కేవలం 23 చోట్ల గెలవడం అనూహ్యమే. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కెసిఆర్ పై వ్యక్తమైనంత జన వ్యతిరేకత అప్పుడు బాబుపై కనబడలేదని చెప్పాలి. అయినా భారీ ఓటమిని చవిచూశారు. మోడీ 400 స్థానాల్లో గెలుపు కోరుకోవడం కూడా అత్యాశే. దక్షిణ భారతంలో 130 సీట్లు పోగా ఉత్తరాన మిగిలేవి 395. అందులో కొద్దీ చోట్లనైనా గెలిచే అవకాశాలున్న పార్టీలు ఎన్నో ఉన్నాయి. ఇలా చూస్తే గతం మాదిరే 300పై చిలుకుతో తృప్తి పడవలసిందే.

అయితే ఈ ధీమాల వెనుక ఏమైనా గూడుపుఠాణి ఉందా! ఎన్నికల ప్రక్రియ, ఇవిఎంల నిర్వహణ ప్రభుత్వం కనుసన్నల్లో జరుగుతుంది కాబట్టి వాటిని తారుమారు చేసే అవకాశం వారికి లభిస్తుందా అనే అనుమానం కలుగుతుంది. దానికి బలం చేకూర్చే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మార్చి 18న భారత్ జోడో యాత్రలో భాగంగా ముంబైలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ‘ఇవిఎంలు లేకుండా మోడీ గెలవలేడు, రాజుగారి ప్రాణం ఇవిఎంల్లోనే ఉంది’ అని అన్నాడు. విశేషమేమిటంటే మన ఇవిఎంలు సంపూర్ణంగా సురక్షితమైన ఎన్నిక సాధనాలు అని ఏ ప్రపంచ స్థాయి సంస్థ కూడా నిర్ధారించలేదు. బిహెచ్‌ఇఎల్ తయారు చేసిన మన ఇవిఎంలకు పారిస్‌లో ఉన్న వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ సంస్థ ఎలాంటి ధ్రువీకరణ ఇవ్వలేదు. 2002 లో బిహెచ్‌ఇఎల్ పేటెంట్ కోసం దరఖాస్తు పంపి, తిరస్కరిస్తారనే భయంతో తన అభ్యర్థనను 2006లో వెనక్కి తీసుకుంది. 2010లో మాజీ న్యాయమంత్రి డా. సుబ్రమణ్య స్వామి ది హిందూలో ‘బ్యాలెట్ రిగ్గింగ్ ఫలితాలపై కొంత ప్రభావం చూపితే ఇవిఎం చిప్ ద్వారా మొత్తం ఎన్నికలనే స్వాధీనం చేసుకోవచ్చు’ అని రాశారు. ఈ రోజుల్లో ప్రపంచంలో హ్యాకింగ్ చేయలేని ఎలక్ట్రానిక్ పరికరమేదీ లేదనేది అందరూ ఒప్పుకొనే సత్యం.

గోవాలో ఈ నెలలోనే గోవాన్స్ అజినెస్ట్ ఇవిఎమ్స్ అని ఆందోళన చేపట్టారు. పంజాబ్ లోను అంబేడ్కర్ నవయువక్ దళ్ తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తోంది. చాలా కాలంగా మేము ఈ సమస్యను లేవనెత్తుతూనే ఉన్నాము, 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున మళ్లీ ప్రజల దృష్టికి తీసుకు రావడానికి మేము ఈ ప్రచారాన్ని ప్రారంభించాం అని ఆ సంస్థ అధ్యక్షుడు బన్సీ లాల్ ప్రేమి అన్నారు. ఇవిఎంలను హ్యాక్ చేయవచ్చని ఎవరైనా నిరూపించాలని ఎన్నికల సంఘం కోరినప్పుడు సుప్రీంకోర్టు న్యాయవాదుల నేతృత్వంలోని ఇవిఎం హటావో దేశ్ బచావో మోర్చా సవాలును స్వీకరించిందని ప్రేమి చెప్పారు. తమకు యాభై యంత్రాలను అందించాలని, ఆ యంత్రాలను ఎలా తారు మారు చేస్తారో నిరూపిస్తామని అ సంస్థ అంది. అయితే ఇది ఇవిఎంల చట్టపర రక్షణ వ్యవస్థకు భంగకరంగా ఉందని ఎన్నికల సంఘం నిరాకరించింది.

గత సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా వివిధ పార్టీలు పేపర్ బ్యాలెట్‌లకు తిరిగి తేవాలని లేదా ఓటర్- వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వివిపిఎటి)ను మెరుగుపరచాలని డిమాండ్ చేశాయి. ఓటు వేసిన అభ్యర్థి గుర్తుతో కూడిన ప్రింటెడ్ పేపర్ స్లిప్ సీలు చేసిన పెట్టెలో వేయడానికి ముందు ఓటరుకు ఏడు సెకన్ల పాటు కనిపిస్తుంది. దాని కాపీని ఓటరుకు ఇవ్వాలని, అంతే కాకుండా ఆ స్లిప్‌పై ఓటు వేసిన తేదీ, సమయం కూడా ఉండాలని కాంగ్రెస్ నాయకులు సుప్రీం కోర్టులో పిటిషన్ కూడా వేశారు. అభ్యర్థులు కోరిన చోట వివి పాట్ చిట్టిలను లెక్కించాలని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్ దాఖలు చేసిన పిటిషన్‌కు ప్రతిస్పందనగా ప్రతి ఎన్నికలలో అన్ని స్లిప్పులను లెక్కించినట్లయితే, అది పరోక్ష మార్గాల ద్వారా పేపర్ బ్యాలెట్‌లను తిరిగి ప్రవేశపెట్టినట్లే అవుతుందని సుప్రీం కోర్టు పేర్కొంది.

సాంకేతిక నిపుణుల్లో కూడా ఇవిఎంల విషయంలో ఏకాభిప్రాయం లేదు. వీటి వల్ల పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరగడానికి అవకాశం లేదని కొందరు నిపుణులు వాదిస్తున్నప్పటికీ, ఎంపిక చేసిన చోట్ల తారుమారు జరగవచ్చని కొందరు సూచిస్తున్నారు. అప్పుడప్పుడు కొన్ని ఓట్లు వేరే పార్టీకి వెళ్లడం చూశాం. కానీ 20 లక్షల యంత్రాలలో ఇది నాలుగైదింట్లో జరుగుతుంది. అందువల్ల మొత్తం వ్యవస్థను వ్యతిరేకించడం తప్పు. అయితే ఆ రకమైన అవకతవకలను ఎలా ఆపాలి, నిరోధించాలి అనేది ముఖ్యం అని మాజీ ప్రధాన ఎన్నికల సాధికారి ఖురేషి అన్నారు. ఎన్నికలను తారుమారు చేయడం బ్యాలెట్ బాక్సులను నింపే పాత రోజులు కావివి.

ఇప్పుడు మీరు శాసనసభలో మెజారిటీని ప్రభావితం చేసే రీతిలో ఎంపికను తారుమారు చేయవచ్చు అని జగదీప్ చోకర్ అనే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఓట్ల లెక్కింపులో ఇవిఎంలను కంప్యూటర్‌కు కలిపి ఎవరికెన్ని ఓట్లు వచ్చాయో తేలుస్తారు. వాటి ఆధారంగా ఫలితాలను ప్రకటిస్తారు. కంప్యూటర్ లోపల ఏముందో, ఇవిఎంలో ఏముందో తెలియదు. అందుకే వివిపాట్ స్లిప్ లను 100 % లెక్కించాలని, తుది ఫలితాల ప్రకటనకు స్లిప్‌ల లెక్కే పరిగణనలోకి తీసుకోవాలని ఆగస్టు 2023లో 79 మంది రిటైర్డ్ ఐఎఎస్ అధికారులు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. స్లిప్‌లపై అభ్యర్థి సంఖ్య, పార్టీ మొదలైన వాటి పేరును ముద్రించడంతో పాటు, ఆ కాగితంపై బార్‌కోడ్‌ను కూడా ముద్రించాలి. బార్‌కోడ్ ఆధారంగా లెక్కింపు జరగాలని వారు కోరారు.

ముంబైకి చెందిన న్యాయవాది సునీల్ అహ్యా, సోర్స్ కోడ్ ఆడిట్ కోసం ఐఇఇఇ1028 అంతర్జాతీయ ప్రమాణమని, అయితే దీనిని భారత ఎన్నికల సంఘం ఉపయోగిస్తుందా లేదా అనేది తెలియదని కోర్టులో పిల్ వేశారు. ఆ విచారణ సందర్భంగా ఎన్నిక సంఘం సాంకేతిక మూల్యాంకన కమిటీ కోడ్‌ను ఆడిట్ చేస్తుందని, దాని వద్ద సమాచారం అందుబాటులో ఉందని ఎన్నిక సంఘం కోర్టుకు తెలిపింది. మెషీన్‌ల కోసం సాఫ్ట్‌వేర్‌ను డిజైన్ చేసే కమిటీ తన స్వంత పనిని ఎలా ఆడిట్ చేస్తుంది, ఇది ఒక స్వతంత్ర ఏజెన్సీ ద్వారా చేయవలసి ఉంటుంది అని ఆయన ఎన్నికల సంఘాన్ని కోరారు. సోర్స్ కోడ్‌లను ఎవరూ రహస్యంగా ఉంచరు. సోర్స్ కోడ్ ఇతర విషయాలతో పాటు పబ్లిక్ చేసిన తర్వాత కూడా యంత్రాలు సురక్షితంగా ఉండాలి. వాస్తవానికి హ్యాకింగ్‌కి తట్టుకొని యంత్రాలు సురక్షితంగా ఉన్నాయని నిరూపించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉంది అని ఐఐటిలో కంప్యూటర్ సైన్స్ మాజీ ప్రొఫెసర్ సుభాషిస్ బెనర్జీ అభిప్రాయపడ్డారు.

పైన పేర్కొన్న సమాచారమంతా నిపుణులు, విశ్లేషకుల మాటల్లోంచి సేకరించిందే. ఇలా ఇవిఎంలపై అనుమానాలు, భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న చోట ఎన్నికల ప్రక్రియకు అర్థమేమిటి? ఇవిఎంలు వాడుతున్న కొన్ని దేశాలు ప్రజల, పార్టీల కోరిక మేరకు వాటిని పక్కనపెట్టాయి. మన దేశంలో కూడా వీటి వినియోగంపై రెఫరెండం కోరితే ఇలాంటి సందేహాలకు తెరపడింది.

బి. నర్సన్
94401 28169

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News