Sunday, September 15, 2024

కొత్త ఫార్మాట్‌లో దులీప్ ట్రోఫీ

- Advertisement -
- Advertisement -

జోనల్ విధానానికి స్వస్తి
రౌండ్ రాబిన్ పద్ధతిలో టోర్నీ
కీలక ఆటగాళ్లంతా బరిలోకి..
ముంబై: దేశవాళీ క్రికెట్‌లోని ప్రధాన టోర్నమెంట్‌లలో ఒకటిగా పేరున్న దులీప్ ట్రోఫీ ఫార్మాట్‌లో భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈసారి దులీప్ ట్రోఫీని జోనల్ విధానంలో కాకుండా రౌండ్ రాబిన్ పద్ధతిలో నిర్వహించనున్నారు. సెప్టెంబర్ ఐదు ఈ టోర్నమెంట్ జరుగనుంది. సీనియర్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, అశ్విన్, బుమ్రాలకు టోర్నీలో మినహాయింపు ఇచ్చారు. మిగతా ఆటగాళ్లందరూ దులీప్ ట్రోఫీ బరిలో దిగనున్నారు.

ఈసారి నాలుగు టీమ్‌లు పోటీ పడనున్నాయి. టోర్నీలో పాల్గొనే జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. టీమ్‌ఎ టీమ్‌కు శుభ్‌మన్ గిల్, టీమ్‌బికి అభిమన్యు ఈశ్వరన్, టీమ్‌సికి రుతురాజ్ గైక్వాడ్ సారథ్యం వహిస్తారు. ఇక టీమ్‌డి కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేశారు. 1961లో మొదలైన దులీప్ ట్రోఫీ ఇప్పటి వరకు ఆరు జట్లతో జోనల్ ఫార్మాట్‌లో జరిగేది. కానీ ఈ సీజన్ నుంచి జోనల్ విధానానికి బిసిసిఐ పుల్‌స్టాప్ పెట్టింది. ఈసారి నాలుగు జట్లతో దులీప్ ట్రోఫీని నిర్వహించనున్నారు. ఎలాంటి నాకౌట్ మ్యాచ్‌లు లేకుండా రౌండ్ రాబిన్ విధానంలో టోర్నీ జరుగనుంది. ప్రతి జట్టు మిగిలిన అన్ని జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. అన్ని మ్యాచ్‌లు ముగిసిన తర్వాత పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టును విజేతగా నిలుస్తుంది.

ప్రతి మ్యాచ్ నాలుగు రోజుల పాటు జరుగుతుంది. కాగా, బంగ్లాదేశ్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో పాల్గొనే టీమిండియాను దులీప్ ట్రోఫీలో ప్రదర్శన ఆధారంగానే ఎంపిక చేయనున్నట్టు బిసిసిఐ వెల్లడించింది. కాగా, దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లకు బెంగళూరు, అనంతపురం వేదికలుగా నిలువనున్నాయి. ఇదిలావుంటే ఈసారి దులీప్ ట్రోఫీలో కీలక ఆటగాళ్లందరూ బరిలో ఉండనున్నారు. సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, జడేజా, సిరాజ్, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్, వంటి కీలక ఆటగాళ్లు ఆయా జట్లకు ప్రాతినిథ్యం వహించనున్నారు.

ఆ కారణాల వల్లే డేనైట్ టెస్టులు నిర్వహించడం లేదు : జైషా

భారత గడ్డపై డేనైట్ మ్యాచ్‌లు ఎక్కువగా నిర్వహించక పోవడానికి గల కారణాలను బిసిసిఐ కార్యదర్శి జైషా వెల్లడించారు. భారత్‌లో ఈ ఫార్మాట్‌లో టెస్టు మ్యాచ్‌లు నిర్వహిస్తే రెండు రోజుల్లోనే ఫలితం వచ్చేస్తుందన్నారు. దీని వల్ల అభిమానులు, బ్రాడ్‌కాస్టర్లు ఆర్థికంగా చాలా నష్టపోతారు. వారి మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత బిసిసిఐపై ఉందన్నారు. మ్యాచ్‌కు వెళ్లే అభిమాని ఐదు రోజుల పాటు చూడాలిన టికెట్‌ను కొనుగోలు చేస్తాడని, అయితే రెండు, మూడు రోజుల్లోనే మ్యాచ్ ముగిసిపోతే తీవ్ర నిరాశకు గురవుతాడని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News