Tuesday, September 17, 2024

ఆచరణ తక్కువ-ఆర్భాటం ఎక్కువ

- Advertisement -
- Advertisement -

దివంగత ప్రధానులు నెహ్రూ, ఇందిరా గాంధీ తరువాత వరుసగా 11వ సారి జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగించిన రికార్డు ప్రధాని మోడీదే. రికార్డులు బాగున్నాయి. ప్రసంగాలు అంతకన్నా ప్రతీసారి అదరగొడుతున్నారు. కాని ప్రసంగాల విషయంలో ఆచరణలోకి వస్తే ఆర్భాటం తప్ప అమలు 50 శాతం కూడా ఉండడం లేదు. అలాగే, గురువారం 98 నిమిషాల పాటు ఏకధాటిగా ప్రసంగించిన ఘనత కూడా ఆయనదే. ఇక ఈ ప్రసంగాల తీరును పరిశీలిస్తే జరుగుతున్న పరిణామాలు వాస్తవాలకు దూరం గా ఉంటున్నాయి. ముఖ్యంగా యువతకు నూతన అవకాశాలు అందుబాటులో ఉన్నాయని, ఉపాధి కల్పనలో గణనీయమైన ప్రగతి సాధించామని చెప్పుకొచ్చారు.

కానీ ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనే యువతలో నిరుద్యోగం రేటు 17 శాతానికి చేరింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తదితర 11 రాష్ట్రాల్లో నిరుద్యోగం రేటు 20 శాతానికి పైగా ఉందని పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే చెబుతోంది. ఇక ఉపాధి కల్పన సంగతి పరిశీలిస్తే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి (ఎంజిఎన్‌ఇజిఎస్) పథకాన్నే ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. మొత్తం నమోదైన ఉపాధి హామీ కార్మికులు 25.25 కోట్ల మంది కాగా, ఆధార్ కార్డు లేనివారు 7.6 కోట్ల మంది ఈ పథకం నుంచి తప్పుకోవలసి వచ్చింది. వంద రోజులు పని కల్పించడానికి బదులు కేవలం 16 రోజులకు మాత్రమే పని కల్పిస్తున్నారు. దీని బట్టి ఉపాధి కల్పనలో గణనీయమైన ప్రగతి ఎలా సాధించినట్టు? ఇక ప్రపంచానికే అన్నం పెట్టే స్థాయికి భారత్ ఎదగాలి అని మోడీ ప్రసంగంలో ఉద్ఘాటించారు.

ఇది వినడానికి బాగానే ఉన్నా క్షేత్రస్థాయి వాస్తవాలు భిన్నంగా ఉన్నాయి. ఆకలి, పోషకాహార లోపాలతో దేశ వ్యాప్తంగా రోజుకు సుమారు 4500 మంది పిల్లలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. 145 కోట్ల మంది జనాభాలో 81 కోట్ల మందికి ప్రభుత్వమే ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేయాల్సి వస్తుంటే ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయికి ఎప్పుడు భారత్ ఎదుగుతుందో ప్రశ్నార్థకం. మధ్యతరగతి వర్గాల పిల్లలపై లక్షలు పెడుతున్నామని, మన విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి ఉండకూడదని మోడీ తన ప్రసంగంలో అభిప్రాయపడ్డారు. కానీ దేశంలో విద్యారంగం చాలా దీనస్థితిలో ఉంది. యూనివర్శిటీల్లో ప్రొఫెసర్ల ఉద్యోగాలే కొన్ని నెలలుగా భర్తీ కావడం లేదు. దేశ వ్యాప్తంగా 11 లక్షల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అందులోని 69 శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే ఏర్పడ్డాయని యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్, అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) నివేదిక చెబుతోంది. దేశంలో 1829 సంవత్సరాలు వారు 22% అంటే 26 కోట్ల పది లక్షల మంది, 1024 సంవత్సరాల వయసు వారు 35 కోట్ల 60 లక్షల మంది ఉన్నారు.

ఇంతమంది యువతకు ఆధునిక చదువులు, నైపుణ్యాలు కలిగించకపోవడం పెద్ద లోపం. అలాంటప్పుడు విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి ఎలా తప్పించగలం? ఇక వ్యవసాయానికి సంబంధించి భారత్‌లో చిరుధాన్యాలు అందరికీ చేరాలని ప్రధాని పిలుపు ఇవ్వడం బాగానే ఉంది. కానీ వ్యవసాయ రంగానికి ప్రభుత్వపరంగా ఏ విధంగా సహాయ సహకారాలు లభిస్తున్నాయో ప్రత్యక్షంగా చూస్తున్నాం. ముఖ్యమైన పంటలకు కనీస మద్దతు ధర చట్టప్రకారం కల్పించాలని రైతులు సాగిస్తున్న పోరాటం ఏమాత్రం ఫలించడం లేదు. బంగ్లాదేశ్‌లో మైనార్టీ హిందువులపై దాడులు సాగుతుండడంపై ప్రధాని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. కానీ మనదేశంలోనే మణిపూర్‌లో ఒక వర్గంపై నిత్యం జరుగుతున్న హింసాకాండను విస్మరించారు. కనీసం ఒకసారైనా మణిపూర్‌ను ప్రధాని సందర్శించకపోవడం గమనార్హం. గత ఏడాది 77వ స్వాతంత్య్ర దినోత్సవం నాడు కూడా ప్రధాని మోడీ ఎర్రకోటపై నుంచి అన్నీ గొప్పలే చెప్పుకున్నారు. 140 కోట్ల దేశ జనాభా తన కుటుంబమన్నారు. జనాభాలో ముప్ఫై ఏళ్ల లోపు యువత అత్యధికంగా ఉన్నారని, వారి శక్తి సామర్థాలు అమోఘమన్నారు.

కానీ పెరుగుతున్న నిరుద్యోగం పరిష్కారం సంగతి దాటవేశారు.దళితులు, పీడితులు, ఆదివాసీలు గౌరవంగా బతకాలని కోరుకున్నా ఆదివాసీలకు కనీస వసతులు ఇప్పటికీ వారి గూడేలలో సమకూరలేదన్నది వాస్తవం. ఇక సెబి అదానీ వ్యవహారం ఎంత సంచలనం కలిగించిందో తెలిసిందే. ఈ విషయంలో ప్రభుత్వం కిమ్మనడం లేదు. దర్యాప్తులో ఏ అంశాలు తేలాయో బయటపడలేదు. గత పదేళ్లలో మోడీ ప్రభుత్వం చేసిందంతా కార్పొరేట్ సంస్థలకు పబ్లిక్ రంగ పరిశ్రమలను ధారాదత్తం చేయడమే. అదానీ, అంబానీ వంటి ఆశ్రిత పెట్టుబడిదారీ వ్యవస్థను మరింత ప్రోత్సహించడమే. ఈ నేపథ్యంలో స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాలు ఎంత గొప్పగా ఉన్నా అవి ఎంతవరకు దేశాన్ని పారదర్శకంగా ప్రగతి మార్గంలో నడిపిస్తున్నాయో ప్రభుత్వమే ఆత్మవిమర్శ చేసుకోవలసిన అవసరం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News