Saturday, July 27, 2024

డిగ్రీలో ప్రాజెక్ట్ వర్క్‌గా ‘ఈచ్ వన్ టీచ్ వన్’

- Advertisement -
- Advertisement -

863 Posts in Tribal Gurukul Degree Colleges

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో అక్షరాస్యత శాతం పెంచేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈచ్ వన్ టీచ్ వన్ కార్యక్రమాన్ని డిగ్రీ కోర్సులో ప్రాజెక్టు వర్క్‌గా పొందుపరిచే అంశాన్ని ఉన్నత విద్యామండలి పరిశీలిస్తోంది. డిగ్రీ చివరి సంవత్సరంలో ఆరవ సెమిస్టర్‌లో ప్రాజెక్ట్ వర్క్‌కు నాలుగు క్రెడిట్లు ఉంటాయి. ప్రాజెక్ట్ వర్క్‌లో ఈచ్ వన్ టీచ్ వన్‌ను పొందుపరచడంతో పాటు ఈ అంశానికి రెండు క్రెడిట్లు కేటాయించాలని భావిస్తున్నట్లు తెలిసింది. డిగ్రీ ఆరవ సెమిస్టర్ విద్యార్థులు ప్రాజెక్ట్ వర్క్‌లో కొంతమంది నిరక్షరాస్యులకు చదువు చెప్పనున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి డిగ్రీలో ఈచ్ వన్ టీచ్ వన్ కార్యక్రమాన్ని పొందుపరచనున్నట్లు సమాచారం. ఇంజనీరింగ్, ఫార్మసీ వంటి వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులతో సమానంగా హోదా, వేతనాలు లభించేలా డిగ్రీ కోర్సుల్లో మార్పులకు యుజిసితో పాటు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. వచ్చే విద్యాసంవత్సరం డిగ్రీ కోర్సుల్లో చేరే విద్యార్థులకు కొత్తగా కేటాయించే క్రెడిట్లు, కొత్త సిలబస్ వర్తించనుంది. అందులో భాగంగా డిగ్రీ చివరి సెమిస్టర్‌లో ప్రాజెక్ట్‌లో భాగంగా ఈచ్ వన్ టీచ్ వన్ కార్యక్రమాన్ని పొందుపరచనున్నారు.
డిగ్రీ విద్యలో సమూల మార్పులు
డిగ్రీ విద్యలో సమూల మార్పులు చోటు చేసుకోనున్నాయి. డిగ్రీలో బిఎ, బి.కాం, బిఎస్‌సి తదితర కోర్సుల్లో విద్యార్థి ఏ కోర్సులో ప్రవేశం పొందినా ఆయా కోర్సుల్లోని సబ్జెక్టులతో పాటు ఇతర సామాజిక అంశాల పట్ల అవగాహన, ప్రయోగాత్మక పరిజ్ఞానం ఉండేలా తీర్చిదిద్దుతోంది. అందులో భాగంగానే డిగ్రీలో సబ్జెక్టుల వారీగా మార్కులు, క్రెడిట్స్‌లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఆయా కోర్సుల్లోని సబ్జెక్టులకు ఉన్న ప్రాధాన్యతకు అనుగుణంగా క్రెడిట్స్‌ను కేటాయించనున్నారు. లెర్నింగ్ ఔట్ కమ్స్ బేస్డ్ కరికులమ్ ఫ్రేమ్ వర్క్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్(ఎల్‌ఒసిఎఫ్)ను ఇటీవల యుజిసి విడుదల చేసింది. డిగ్రీలో ఉపాధి అవకాశాలు కల్పించేలా నైపుణ్య శిక్షణకు సంబంధించిన పాఠ్యాంశాలతో పాటు సామాజిక అంశాలను పొందుపరచనున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆయా కోర్సుల లక్ష్యాన్ని నిర్ధేశించుకుని సబ్జెక్టులకు మార్కులు, క్రెడిట్స్‌ను యుజిసి కేటాయిస్తోంది.

Each One Teach One as Project Work in Degree

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News