Friday, April 19, 2024

‘నేరము’ కక్ష

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: నేరం, నేర పరిశోధన ఈ రెండూ వేర్వేరు అంశాలు. ప్రతి నేరంపై పరిశోధన జరగవలసిన పని లేదు. అలాగే ప్రతి నేర పరిశోధనకు మూలంలో నేరం ఉండి తీరవలసిన అవసరమూ కనిపించడం లేదు. నేరం జరిగినా, నేరస్థులు ఎప్పటికీ బయటపడరు. అటువంటి కేసులెన్నో ఉన్నాయి. నేరమేలేని చోట నేర పరిశోధన లేదా నేరం పేరుతో నేరస్థులను బయటపెట్టలేని పరిశోధన అనేవి ఇప్పుడు ఘనంగా రాణిస్తున్నాయి. ఎవరి ప్రయోజనాలకో, ఎవరి మీదనో నేరం మోపబడుతుంది. అనంతంగా పరిశోధన సాగుతుంది. అది గమ్యం చేరకుండానే ఆగిపోడం, ఆలోగా దాని వల్ల అధికారంలో ఉన్నవారి ప్రయోజనాలు సిద్ధించి ఆ పరిశోధన మూలనపడడం జరిగిపోతుంది. ఇదంతా ఒక మయసభను తలపిస్తుంది, ద్రౌపదిని నానాకష్టాలపాల్జేసిన మాదిరిగానే..

మయసభ ఆఖరు ఘట్టంలో నవ్వులు వినిపిస్తాయి, అవి సుయోధనుడి వొంటి మీద తేళ్ళు, జెర్రులు పాకిస్తాయి, ఆ నవ్వింది ఎవరో నిర్ధారించుకోకుండానే ద్రౌపది మీద అతడు కక్షబూనడం ఆ తర్వాత కథ అంతా తెలిసిందే. ఇలా నేరం వొక చోట, శిక్ష మరొక చోట కూడా జరిగిపోతుంటుంది. ఇప్పుడు నేర పరిశోధన తతంగమంతా పాలకుల రాజకీయ స్వప్రయోజన కాంక్ష కోసమే జరిగిపోతున్నది. ఇందులో నేర పరిశోధకులకు జవాబుదారీతనం ఉండదు. ఈ తతంగం ఇప్పుడు విరివిగా, అనంతంగా సాగిపోతున్నది. అధికార పార్టీకి ప్రభుత్వానికి మధ్య ఉండవలసిన విభజన రేఖ చెరిగిపోయింది. ప్రజా ప్రయోజనాలకే పరిమితం కావలసిన ప్రభుత్వం పాలక పార్టీ ప్రయోజనాలకు పాటుపడుతున్నది.

ఆమేరకు ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు పాలక పార్టీ కోసం పరుగులు తీసే వేట కుక్కలుగా నిరూపించుకొంటున్నాయి. అవతల వేటాడవలసిన దొంగ ఉన్నా లేకపోయినా వాటిని ఉసిగొల్పితే చాలు అవి ఉరకవలిసిందే. గతంలో కేంద్రం చేతిలోని ప్రధానమైన వేటకుక్కగా సిబిఐ పని చేసింది. దాని సారథి స్థానంలో కేంద్ర పాలకులు తమ విధేయులను నియమింపజేసుకొనేవారు. ఇప్పుడు సిబిఐకి బదులు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టొరేట్ (-ఇడి) ఆ బాధ్యతలను నెత్తిన వేసుకొని చేస్తున్నది. సిబిఐ చట్టం ప్రకారం ఏ రాష్ట్రమయినా దానిని వద్దనుకొంటే అది ఆ రాష్ట్ర పరిధిలోని నేరాభియోగ పరిశోధనను చేపట్టకూడదు. సిబిఐని 1946 నాటి ఢిల్లీ స్పెషల్ పోలీస్ చట్టం కింద నియమించారు కాబట్టి దానిని కేంద్రం ఇష్టావిలాసంగా ప్రయోగించజాలదు. గతంలో కేంద్రంలోనూ, దాదాపు అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండేవి కాబట్టి యే పేచీకి ఆస్కారం కలిగేది కాదు.

ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెసేతర పక్షాలు రాష్ట్రాల్లో అధికారంలోకి రావడం మొదలైన తర్వాత కేంద్ర పాలక పక్షం ఆటలు పలు రాష్ట్రాల్లో చెల్లని పరిస్థితి తలెత్తింది. అందుచేత 2014లో బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో నేరాల దర్యాప్తు కోసం సిబిఐకి బదులుగా ఇడిని ప్రయోగించడం ఎక్కువయింది. ఎన్‌డిఎ 2 అంటే ప్రధాని మోడీ హయాం ప్రారంభం అయిన తర్వాత గత ఎనిమిదిన్నరేళ్ల పైచిలుకు కాలంలో ఇడి 120 మందికి పైగా నాయకులపై కేసులు నమోదు చేసింది. భారీ ఎత్తున డబ్బును అక్రమ మార్గాల్లో తరలించడానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులే ఇందులో అధికం. కేసు దర్యాప్తు సమయంలోనే నిందితులను అరెస్టు చేయడం, వారి ఆస్తులను జప్తు చేయడం, బెయిల్ మంజూరు కష్టతరం చేయడం వంటి కఠిన నిబంధనలతో ఇడి కేసులు విరుచుకుపడతాయి.

2014 నుంచి నమోదైన ఇడి కేసుల్లో 95% ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లోని ప్రతిపక్ష నేతలు, వారి సన్నిహితులు, బంధువులపైనే నమోదయ్యాయి. ఈ విధంగా ఇడి కేసులకు గురైనవారిలో డిఎంకెకి చెందిన ఆరుగురు, బిజెడికి చెందిన ఆరుగురు, ఆర్‌జెడి, బిఎస్‌పి, ఎస్‌పిలకు చెందిన చెరి అయిదుగురు నాయకులు ఉన్నారు. అలాగే టిడిపికి చెందిన అయిదుగురు, ఆప్ నాయకులు ముగ్గురు, వైఎస్‌ఆర్‌సిపి వారు ముగ్గురు, సిపిఐ (ఎం) నేతలు ఇద్దరు, ఇంకా ఇతర పార్టీలవారున్నారు. ఎన్‌డిఎ హయాంకి విరుద్ధంగా యుపిఎ పాలనలో కేవలం 26 మంది రాజకీయ నాయకులపైనే ఇడి కేసులు నమోదయ్యాయి.

వీరిలో ప్రతిపక్ష నేతలు 14 మందే కావడం గమనించవలసిన విషయం. ప్రధాని మోడీ పాలనలో ప్రతి వొక్క ప్రతిపక్ష పార్టీకి చెందిన ప్రముఖ నాయకులపై ఇడి కేసులు నమోదయ్యాయి. మనీలాండరింగ్ కేసు వొక్క దానిలో కూడా ఇంతవరకు శిక్షపడకపోడం గమనించవలసిన విషయం. అంటే ఇడి కొండను తవ్వి ఎలుకను కూడా పట్టడం లేదు. విచిత్రమేమిటంటే బిజెపి పాలిత రాష్ట్రాల్లోని ఆ పార్టీకి చెందిన నాయకులపై ఇడి కేసులు నమోదు కావు. కర్ణాటకలో ఇటీవలే ఒక బిజెపి ఎంఎల్‌ఎ ఇంట ఏడు కోట్ల రూపాయలు పట్టుబడ్డాయి. కాని ఇడి కన్ను ఏకపక్షంగా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలలోని పాలక పక్షాల నాయకుల మీదనే పడుతుంది. తాజాగా బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత మీద పడింది!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News