Sunday, March 26, 2023

దేశంలో విదేశీ జర్నలిస్టుల చేదు అనుభవాలు

- Advertisement -

ఢిల్లీలోని ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్, మన దేశంలో వున్న విదేశీ జర్నలిస్టులతో మూడు సర్వేలు నిర్వహించింది. వాటి పరిశీలన భారత దేశంలో పత్రికా స్వేచ్ఛ గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించింది. 20202022 వరకు నిర్వహించిన మూడు సర్వేలను వారు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపించారు. కానీ మంత్రిత్వ శాఖ నుండి ఎటువంటి ప్రతిస్పందన లేదు. ఇది భారత దేశంలో పత్రికా స్వేచ్ఛ ను మరింత ప్రశ్నార్థకం చేస్తుంది. ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్ తమ సర్వేను బహిర్గతం చేయకపోయినా అది ఎలాగోలా బయటపడి ఇప్పుడు పబ్లిక్ ముందుకు వచ్చింది. మొదటి సర్వేను 2020 జనవరిలో నిర్వహించారు, ఇందులో 40 మంది పాత్రికేయులు పాల్గొన్నారు. 2019 ఆగస్టు 5న జమ్మూకశ్మీర్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసిన సమయం అది. అసోంలో జాతీయ పౌరసత్వ రిజిస్టర్ కూడా అంతకు కొద్ది సమయం ముందే విడుదలయ్యింది.

భారత దేశంలోని ఈ రెండు ముఖ్యమైన సంఘటనలను కవర్ చేయాలనుకున్న విదేశీ పాత్రికేయులకు జమ్మూకశ్మీర్ లేదా అసోంకు ప్రయాణించడానికి ప్రయాణ అనుమతులు నిరాకరించారు. మొదటి సర్వేలో విదేశీ పాత్రికేయులు ప్రయాణ అనుమతుల నిరాకరణ, వీసా అనిశ్చితి, బహిష్కరణ బెదిరింపులు వంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. అనేక సమస్యలపై భారత దేశంలోని ప్రభుత్వాన్ని విమర్శనాత్మకంగా నివేదించడమే తమపై వేధింపులకు కారణమని వారిలో చాలా మంది పేర్కొన్నారు. భారత్‌లో ముస్లింలపై జరుగుతున్న అణచివేత సంఘటనల వివరాలను బహిర్గతం కాకుండా ప్రభుత్వం తొక్కి వేయాలనుకుందని ఒకరు అభిప్రాయ పడ్డారు. భారత రాయబార కార్యాలయం తన దేశంలోని తన ప్రచురణ సంస్థకు ‘ముస్లిం హింసను కవర్ చేయ వద్దు అని ఇమెయిల్ చేసిందని ఒక జర్నలిస్ట్ చెప్పారు. మంత్రిత్వ శాఖలోని అధికారులు తమకు సమన్లు జారీ చేశారని, తమకు ప్రభుత్వ ప్రతికూల కవరేజీని వివరించే ‘ఫైళ్లు’, ‘స్ప్రెడ్ షీట్లు’ చూపించారని సర్వేలో చాలా మంది పేర్కొన్నారు.

విదేశీ జర్నలిస్టులకు (భారత వ్యతిరేక) ఎజెండా ఉందని ప్రభుత్వ అధికారులు ఆరోపించారు. రెండో సర్వేను 2021 ఏప్రిల్లో నిర్వహించగా 41 మంది జర్నలిస్టులు పాల్గొన్నారు. వీరు కూడా విదేశీ జర్నలిస్టులను కట్టడి చేయటానికి ప్రధానంగా వారి వీసా సమస్యను లేవనెత్తుతున్నారని చెప్పారు.ప్రభుత్వాన్ని విమర్శించే జర్నలిస్టులకు స్వల్ప వ్యవధి (3, 4 నెలల) వీసాలు మాత్రమే ఇచ్చి, వీసా పొడిగింపు కోసం అనేక చోట్లకు పరుగులు పెట్టేలా చేస్తున్నారు. నరేంద్ర మోడీపై సానుకూల కథనాలు రాస్తేనే వీసా పొడిగింపు లభిస్తుందని ఓ జర్నలిస్ట్ చెప్పారు. 2019లో కశ్మీర్, అసోం రాష్ట్రాల నుంచి రిపోర్టు చేసేందుకు ట్రావెల్ పర్మిట్ల కోసం దరఖాస్తు చేసుకున్న 30 మంది విదేశీ జర్నలిస్టుల్లో కేవలం 9 మందికి మాత్రమే లభించింది. 2021 సంవత్సరంలో అసోం, జమ్మూకశ్మీర్‌లో క్షేత్ర పరిశీలన కోసం పర్మిట్‌కి దరఖాస్తు చేసుకున్న విదేశీ జర్నలిస్టులలో 96% మంది కి అనుమతి ఇవ్వలేదు. కశ్మీర్ కవరేజీ కోసం అధికారులు తమను పిలిచారని అయితే వారు చూపించినవి మాత్రమే నివేదించవలసి వచ్చిందని పలువురు పాత్రికేయులు తెలిపారు.

2019 సెప్టెంబర్‌లో అక్కడి నుంచి రిపోర్టు చేసేందుకు వెళ్ళిన తనని అసోం అధికారులు బలవంతంగా విమానంలోఎక్కించి పంపివేశారని, ఓ విదేశీ జర్నలిస్ట్ ఆరోపించారు. 2022 ఫిబ్రవరిలో నిర్వహించిన మూడో సర్వేలో 21 మంది విదేశీ కరస్పాండెంట్లు పాల్గొన్నారు. భారత దేశంలో విదేశీ పత్రికా విలేఖరుల పని పరిస్థితులను మెరుగుపరచడానికి ప్రభుత్వం నుండి సరైన స్పందన లేకపోవడం వల్ల తక్కువగా హాజరయ్యారని అనుకున్నారు.మూడో సర్వే కూడా గత రెండు సర్వేల అభిప్రాయాలనే పునః ప్రకటించింది. 2021లో స్పెషల్ రిపోర్టింగ్ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకున్న ఒక్కరికి కూడా సమస్యాత్మక ప్రాంతాలకు వెళ్లేందుకు అనుమతి లభించలేదని చెప్పారు. అంతేకాకుండా, బెదిరింపుల స్థాయి మొదటి సర్వే నాటి కన్నా మూడవ సర్వేకు పెరిగింది.

కర్ణాటకలో క్రైస్తవులపై జరుగుతున్న దాడులపై కథనాన్ని కవర్ చేస్తున్న సమయంలో తమను వెంబడించి, విచారించారని, ఇంట ర్వ్యూ చేసిన వ్యక్తిని బెదిరించారని ఓ జర్నలిస్ట్ పేర్కొన్నారు. భారత్‌లో విదేశీ జర్నలిస్టులను వేధించడానికి వీసా పొడిగింపులు నిరాకరించటంతో పాటు భౌతిక బెదిరింపులు, బహిష్కరణ బెదిరింపులు సాధారణ పద్ధతులుగా ఉన్నాయని మరో జర్నలిస్ట్ ఆరోపించారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ; విదేశీ కరస్పాండెంట్లకు తెలిపిన తాజా మార్గదర్శకాల ప్రకారం, ఇప్పుడు మొత్తం ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలు, మొత్తం జమ్మూకశ్మీర్, లడఖ్, అండమాన్, నికోబార్ ద్వీపం, లక్షద్వీప్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్ లోని ‘అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతాలు’ రక్షిత ప్రదేశాలలో ఉన్నాయి. కనుక ఆ ప్రాంతాలు విదేశీ వార్తాహరులకు నిషేధిత ప్రాంతాలు.

డా. జతిన్ కుమార్
9849806281

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News