Monday, June 10, 2024

కాన్వాయ్‌పై దాడి చేసి లీడర్‌ని విడిపించుకున్న డ్రగ్స్ గ్యాంగ్

- Advertisement -
- Advertisement -

ఫ్రాన్స్‌లో డ్రగ్స్ గ్యాంగ్ తమ నాయకుడిని తరలిస్తున్న కాన్వాయ్‌పై దాడి చేసి గార్డులను చంపి తమ గ్యాంగ్ లీడర్‌ను విడిపించుకుపోయింది. హాలీవుడ్ సినిమా తరహాలో ఈ దాడి బీభత్సంగా జరగడం సంచలనం కలిగించింది. దీంతో ఫ్రాన్స్‌లో హైఅలర్ట్ ప్రకటించారు. నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు. ప్రపంచం లోనే అతిపెద్ద కొకైన్ మార్కెట్‌గా ఫ్రాన్స్‌కు పేరుంది. ఓ మాదక ద్రవ్యాల గ్యాంగ్‌కు అధిపతిగా మహమ్మద్ అమ్రా వ్యవహరిస్తున్నారు. అమ్రాను “ది ఫ్లై” పేరుతో పిలుస్తారు. ఓ దోపిడీ కేసులో అమ్రాకు మే 10న 18 నెలల శిక్ష పడింది. మంగళవారం మరో కేసులో విచారణ కోసం 35 మైళ్ల దూరం లోని రోయూన్ పట్టణం నుంచి నార్మండీ లోని ఎవురెక్స్‌కు తీసుకొని జైలు సిబ్బంది కాన్వాయ్‌తో బయల్దేరారు. మార్గం మధ్యలో ఇంక్రావిల్లే అనే ప్రాంతంలోని టోల్‌బూత్ దాటుతుండగా, ఓ నల్ల ఎస్‌యూవీ కారు ఎదురుగా వచ్చి కాన్వాయ్‌ను ఢీకొంది.

వెంటనే కొందరు గన్‌మెన్‌లు ఆటోమేటిక్ ఆయుధాలతో విచక్షణా రహితంగా ఆ కాన్వాయ్ చుట్టూ తిరుగుతూ కాల్పులు జరపడం మొదలు పెట్టారు. ఈ సంఘటనలో ముగ్గురు గార్డులు చనిపోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. “ ది ఫ్లై ” ను తీసుకుని సాయుధులు రెండు కార్లలో పరారయ్యారు. కొంతదూరంలో ఈ వాహనాలకు నిప్పు పెట్టి వేరే వాటిలో వెళ్లిపోయారు. ఫ్రాన్స్‌ను కుదిపేసిన ఈ సంఘటనపై అధ్యక్షుడు మేక్రాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం మొత్తం బాధితుల పక్షాన ఉందన్నారు. ఈ దాడి చేసిన వారిని కచ్చితంగా శిక్షిస్తామని పేర్కొన్నారు. ఫ్రాన్స్‌లో మాదకద్రవ్యాల వినియోగంపై మంగళవారం ప్రభుత్వం ఓ నివేదిక విడుదల చేసింది. డ్రగ్స్ సంబంధించిన హింస భవిష్యత్తులో గణనీయంగా పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. అదే రోజు ఈ సంఘటన చోటు చేసుకోవడం గమనార్హం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News