Thursday, May 2, 2024

కంటోన్మెంట్ వాసులకు ఉచిత మంచినీటి పథకం

- Advertisement -
- Advertisement -

ఈనెల 1 నుంచే వర్తింపు
ప్రభుత్వంపై రూ.1.50 కోట్ల భారం
అయినా ప్రజా సంక్షేమమే ముఖ్యం: మంత్రి తలసాని

Free water for Cantonment area
మన తెలంగాణ/సిటీ బ్యూరో: కంటోన్మెంట్ ప్రాంత వాసుల నీటి బిల్లుల కష్టాలు తీరనున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అమలు చేస్తున్న 20 వేల లీటర్ల ఉచిత మంచినీటి పథకాన్ని ప్రభుత్వం కంటోన్మెంట్ వాసులకు సైతం వర్తింపజేస్తున్నట్లు ప్రకటించింది. ఈ పథకం ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. కంటోన్మెంట్ వాసులు ఇక మీదట 20 వేల లీటర్ల వరకు మంచినీటికి ఏలాంటి బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించారు. బుధవారం సికింద్రాబాద్ లోని కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో మంత్రి తలసాని ఎమ్మెల్యే సాయన్నతో కలిసి వాటర్ వర్క్ అధికారులు, బోర్డు సిఇఓ అజిత్ రెడ్డి లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ దేశంలో 62 కంటోన్మెంట్ బోర్డులు ఉండగా ఒక్క తెలంగాణ లో మాత్రమే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఉచిత నీటి పథకానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.

ఈ పథకం ఈ నెల 1 నుంచి అమల్లోకి తీసుకువచ్చామని, దీని వల్ల ప్రతి నెల సుమారు రూ.1.5 కోట్ల ఆర్ధిక భారం ప్రభుత్వం పై పడుతున్నదని చెప్పారు. తెలంగాణ ఆవిర్భావం నాటి నుంచి కంటోన్మెంట్ అభివృద్ధి, ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారం విషయంలో సిఎం కెసిఆర్ ప్రత్యేక చొరవ చూతున్నారని, ఈ ప్రాంత ప్రజలు కూడా మా బిడ్డలేనని, గ్రేటర్ ప్రజలతో సమానంగా వారిని అభివృద్ది పథంలో తీసుకురావడమే లక్షంగా పని చేస్తున్నమన్నారు. కంటోన్మెంట్ ప్రాంతం లో సుమారు 4 లక్షల మంది జనాభా ఉండగా, వారికి రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ , వృద్దులు, వికలాంగులు, వితంతువులకు ఆసరా పెన్షన్ లు, పేదలకు ఉచితంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను వర్తింప చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. రామన్న కుంట అభివృద్ధి కోసం రూ.3 కోట్లు, ప్యాట్నీ నాలా అభివృద్ధి, నిర్మాణ పనుల కోసం రూ. 10 కోట్లతో ఈ ప్రాంత ప్రజలకు వైద్య సేవల కోసం బొల్లారం లో అత్యాధునిక సౌకర్యాలతో హాస్పిటల్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.25 కోట్లను మంజూరు చేసిందని, ఈ పనులన్నిత్వరలో పనులు ప్రారంభం కానున్నాయని తెలిపారు. కంటోన్మెంట్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నప్పటికీ ఈ ప్రాంత అభివృద్ధిని మోడీ సర్కార్ ఏమాత్రం పట్టించుకోకపోవడం దుర్మార్గం అన్నారు.

ప్రజల నుండి వసూలు చేసిన పన్నులను కూడా అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేయకపోగా, తరచుగా కంటోన్మెంట్ రోడ్లను బ్లాక్ చేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేయడం సరైంది కాదన్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ ప్రాంత సమస్యలను కేంద్రం ఏ మాత్రం పట్టించుకోకుండా మోద్దునిద్రపోతుందని విమర్శించారు. బోర్డు కమిటీలు సమస్యల పై తీర్మాణాలు చేసి పంపినా పట్టించుకోకుండా బాధ్యతారాహిత్యం వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు.రక్షణమంత్రి దేశంలోని కంటోన్మెంట్ లలో పర్యటిస్తే ప్రజలు పడుతున్న బాధలు, సమస్యలు తెలుస్తాయని, ఆ మాత్రం ఆలోచన లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో బేవ రేజెస్ కార్పోరేషన్ చైర్మన్ గజ్జెల నగేష్, వాటర్ వరక్స్ ఇఈ సత్యనారాయణ, ఇఎన్‌సి కృష్ణ, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి, సభ్యులు లోకనాధం, పాండు యాదవ్, నళినీ కిరణ్, అనిత ప్రభాకర్, భాగ్య శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.

కంటోన్మెంట్‌లో 30,292 నల్లా కనెక్షన్లు:

ప్రభుత్వ నిర్ణయంతో కంటో న్మెంట్ పరిధిలోని దాదాపుగా 25 వేల కుటుంబాలకు లబ్ది చేకూరనుంది. కంటోన్మెంట్ పరిధిలో మొత్తం 8 వార్డులు మొండాతో కలుపుకుంటే 9 వార్డులు ఉన్నాయి. ఇందులో మొత్తం అధికారిక లెక్కల ప్రకారం 30,292 మంచినీటి కనెక్షన్లు ఉన్నాయి.వీటిలో బస్తీలో 16, 900, కాలనీల్లో 13,391 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. మంచినీటి బిల్లులకు సంబంధించి కంటోన్మెంట్ అధికారులు బస్తీ వాసుల నుంచి నెలకు రూ.214, కాలనీ వాసుల నుంచి రూ.450 లను వసూళ్లు చేస్తున్నారు. అయితే ఇక మీదట ప్రతినెల 20 వేల లీటర్ల వరకు ఉచితంగా మంచినీటిని అందజేయనున్నారు. ఈ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News